ప్రణబ్ వల్లిస్తున్న పొదుపు చర్యలు సంపన్న వర్గాల అద్దంలోంచి కాకుండా సగటు భారతీయుని దర్పణంలోంచి చూడాలి. అప్పుడే దాని అసలు రూపం బయటపడుతుంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. కాయగూరల ధరలు ఏడాది వ్యవధిలో 60శాతం పెరిగాయి. పిల్లల్లో పౌష్టికాహార లోపం విషయంలో మన దేశం పరిస్థితి సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల పరిస్థితి కన్నా హీనంగా ఉంది. అనేక కుటుంబాలు పాలు, ఇతర నిత్యావసరాలపై ఖర్చును బాగా కుదించుకొంటున్నాయి. వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల లక్షలాది కుటుంబాలు దివాళా తీస్తున్నాయి. రైతులకు వ్యవసాయ పెట్టుబడులు కానీ, అందుబాటులో రుణ పరపతి సౌకర్యం కానీ ఉండడం లేదు. తాగునీటి సమస్యతో పేదలు అల్లాడుతున్నారు.
ప్రణబ్ ముఖర్జీ ఎంతో ఉద్వేగంతో పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గతంలో ఈ విధమైన పిలుపునే ఇచ్చారు. ఆ పిలుపును ఆకళింపు చేసుకున్న ఆయన మందీ మార్బలం దీనిని ఆచరించడంలో చాలా సృజనాత్మకతను ప్రదర్శించారు! డాక్టర్ సింగ్ ఈ పిలుపునిచ్చి(సాధారణ తరగతిలో విమానయానం, విదేశీ యాత్రల ఖర్చులు తగ్గించుకోవడం వగైరా గురించి) మూడేళ్లకు పైగా కావస్తున్నా ఆ దిశగా కొంచెం కూడా పురోగతి లేదు. పొదుపు చర్యలు చాలా రకాలు. అయితే నేనిక్కడ వాటన్నిటి జోలికి పోవడం లేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆచరిస్తున్న పొదుపు చర్యల గురించే ప్రస్తావించదలిచాను. పొదుపు చర్యల గురించి అహ్లువాలియాకున్న నిబద్ధతను ఎవరూ సవాల్ చేయలేరు. పేదరిక కొలబద్దలను నిర్వచించే సమయంలో ఎవరు ఎంతగా ఘోషించినా తాను పట్టుకున్న కుందేటికి మూడేకాళ్లు అన్నరీతిలో ఆయన వ్యహరించాడు. పట్టణ భారతంలో రోజుకు రు.29 ఖర్చు చేయగలిగేవారు, గ్రామీణ భారతంలో రోజుకు రు23 ఖర్చు చేయగలిగేవారు ఇక ఎంతమాత్రం పేదలు కారని అహ్లువాలియా తేల్చేశాడు. కోట్లాది మంది పేదలను దారిద్య్రరేఖ బయటకు నెట్టే ఈ కొలబద్దలను బలపరచాల్సిందిగా సుప్రీం కోర్టును సైతం కోరాడు. ప్రణాళికా సంఘం దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో రోజుకు రు.32 (పట్టణ), రు.26 (గ్రామీణ) ఖర్చు చేయగలిగినవారిని పేదరిక కొలబద్దలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తరువాత ఈ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఈ యనగారి సహచరులు కొందరు కలిసి పేదరిక కొలబద్దలను మరింతగా కుదించారు.
సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ప్రశ్నలు వెల్లడించిన నిజాలు
డాక్టర్ అహ్లువాలియా తనకుతానుగా ఎంత పొదుపు పాటిస్తుంటాడో తెలుసుకోవడానికి సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద వేసిన రెండు ప్రశ్నలు చాలు. ఈ రెండూ ఆర్‌టిఐ ఆధారిత జర్నలిజానికి తిరుగులేని ఉదాహరణలు. అయితే, ఇవి ప్రజల దృష్టిని ఆకర్షించాల్సినంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు అంశాలు ఆయన పొదుపు చర్యల బండారాన్ని బట్టబయలు చేసేవే. ఇందులో ఒక అంశం (డాక్టర్ అహ్లువాలియా 2004 జూన్, 2011 జనవరి మధ్య జరిపిన విదేశీయాత్రలకు సంబంధించి) పై ఇండియాటుడేలో శ్యామ్‌లాల్ యాదవ్ (ప్రస్తుతం ఈయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నారు) ఒక చక్కటి వార్తాకథనం రాశారు. ఆర్‌టిఐని ఉపయోగించుకుని అంతకుముందు కూడా ఈయన కొన్ని అద్భుతమైన వార్తా కథనాలను రాశారు.
రెండవ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ది స్టేట్స్‌మన్ న్యూస్ సర్వీస్ (విలేకరి పేరులేకుండా) పేరుతో వచ్చింది. ఇందులో 2011 మే- అక్టోబరు మధ్య డాక్టర్ అహ్లువాలియా విదేశీ యాత్రల పేరుతో ప్రజా ధనాన్ని ఎలా మెక్కినదీ వివరించారు. ఆ కాలంలో అహ్లువాలియా పద్దెనిమిది రాత్రులతో కూడిన నాలుగు యాత్రలు జరిపాడు. ఇందుకు గాను మన ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి కొట్టారో తెలుసా? అక్షరాలా ముప్పయి ఆరు లక్షల, నలబై వేల నూట నలబై రూపాయలు. ఈ లెక్కన ఆయన సగటున రోజుకు 2.02 లక్షల రూపాయలు ఖర్చు చేశాడని స్పష్టమవుతోంది.” అని ఎస్‌ఎన్‌ఎస్ కథనం తెలిపింది. అప్పుడు రోజుకు 2.02 లక్ష్లంటే నాలుగువేల డాలర్లతో సమానం. (ఇది మాంటెక్ పొదుపుగా చేసిన ఖర్చు! లేకుంటే ఆ ఖర్చు ఇంకెంత భారీగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఒక విధంగా మనం అదృష్టవంతులమేననుకోవాలి!).అహ్లువాలియా పెట్టిన రోజువారీ ఖర్చు గ్రామీణ భారత దేశంలో ఒక గ్రామీణ భారతీయుడు పెట్టే రోజువారీ ఖర్చు (45సెంట్స్ కటాఫ్) కన్నా తొమ్మిది వేల రెట్లు ఎక్కువ. అదే పట్టణ భారతీయుని సగటు ఖర్చు (55 సెంట్స్ కటాఫ్) తో పోల్చితే ఏడు వేల రెట్లు ఎక్కువ.అయినా, ఇది డాక్టర్ అహ్లువాలియా దృష్టిలో చాలా నామమాత్రపు ఖర్చు.
అహ్లువాలియా పద్దెనిమిది రోజుల్లో రు.36 లక్షలు(72వేల డాలర్లు) ఖర్చు చేయడం ద్వారా ఆ సంవత్సరం ప్రపంచ పర్యాటక పరిశ్రమకు ఆయన వ్యక్తిగతంగా ఉద్దీపన కల్పించారు. ఐరాసకు చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ పేర్కొన్నట్లు 2008-09లో పర్యాటకరంగంలో తలెత్తిన సంక్షోభం నుంచి ఇప్పటికీ అది పూర్తిగా కోలుకోలేదు.2010వరకూ ఇదే పరిస్థితి. 2011లో మాత్రం గ్లోబల్ ట్రావెల్ ద్వారా సమకూరిన ఆదాయం లక్ష కోట్ల డాలర్లుదాటినట్లు ఐరాస సంస్థ పేర్కొంది. ఇందులో అత్యధిక భాగం అమెరికా, యూరపు ( అహ్లువాలియా పద్దెనిమిది రాత్రుల్లో ఎక్కువ భాగం గడిపింది ఇక్కడే)ల నుంచే సమకూరింది. పొదుపు చర్యల ద్వారా ఇక్కడ తమ కడుపు కొట్టి కూడబెట్టిన సొమ్ము అక్కడ పర్యాటక రంగ ఉద్దీపనకు ఉపయోగపడినందుకు భారత ప్రజలు సంతోషించాలి మరి!
శ్యామ్‌లాల్‌యాదవ్ ఆర్‌టిఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి అహ్లువాలియా గత ఏడేళ్లలో 42 అధికారిక విదేశీ పర్యటనలు జరిపాడు. ఈ కాలంలో మొత్తంగా 274 రోజులు విదేశాల్లో విహరించాడు. అంటే ”ప్రతి తొమ్మిది రోజులకు ఒక రోజు” విదేశాల్లో గడిపాడన్నమాట. ఇండియా టుడే రాసిన కథనం ప్రకారం ఆయన విదేశీ యాత్రల వల్ల మన ఖజానాపై పడిన భారం రు.2.34 కోట్లు. ఇది ఆయన విదేశీ యాత్రల ఖర్చుకు సంబంధించి వచ్చిన మూడు అంచనాల్లో అతి తక్కువది. ఆయన యాత్రలకు సంబంధించిన ఈ ఖర్చుల్లో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయాలు పెట్టే ఖర్చులను కూడా కలిపారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ ఖర్చులు కూడా కలిపితే వాస్తవానికి ఈ ఖర్చు మరింత అధికంగా ఉంటుంది.
అహ్లువాలియా నిర్వహించిన పదవిని బట్టి చూసినప్పుడు ఇన్ని విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. విచిత్రమేమిటంటే ఇవన్నీ ప్రధానమంత్రి అనుమతితో జరిగినవే. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే అహ్లువాలియా జరిపిన 42 విదేశీ పర్యటనల్లో 23 పర్యటనలు అమెరికాకు సంబంధించినవే. ఇవన్నీ ప్రణాళికకు సంబంధించినవేనని అనుకోవడానికి లేదు. అర్థం కాని విషయమేమిటంటే ఆయన ఇన్ని సార్లు జరిపిన విదేశీ యాత్రల పరమార్థమేమిటి? పొదుపు చర్యల గురించి గ్లోబల్ చైతన్యం పెంచేందుకేనా? అదే అయితే, ఆయన యాత్రలకు మనం చాలా డబ్బు తగలేశామన్నమాట. ఈ పొదుపు చర్యలే తమ బతుకులను సర్వనాశనం చేశాయని గ్రీక్ ప్రజలు రాజధాని ఏథెన్స్ వీధుల్లో పెద్దయెత్తున ప్రదర్శనలు జరుపుతున్న తీరు చూశాము. ఆయన ఎక్కువ సార్లు పర్యటించిన అమెరికా విషయాన్నే తీసుకున్నా, అక్కడ సంపన్నులకు తోడ్పడే ఈ పొదుపుచర్యలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో అంటే 2008లో అక్కడి సిఇవోలు వందల కోట్ల డాలర్ల బోనస్‌లు తీసుకుని ఎంచక్కా ఇంటికి చెక్కేశారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైన వాల్‌స్ట్రీట్‌ను ముట్టడికి జనాన్ని పురిగొల్పిన అంశాల్లో ఇది కూడా ఒకటి.
2009లో డాక్టర్ సింగ్ పొదుపు చర్యల గురించి పిలుపునిచ్చారు. ఆయన మంత్రివర్గ సహచరులు దీనిని ఎంత చక్కగా పాటించారంటే ఆ తరువాత కొద్ది మాసాలకే ఒక్కో మంత్రి (అతడు లేదా ఆమె) ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ప్రధాని ఆ పిలుపునిచ్చిన తరువాత 27 మాసాలకు, మంత్రులు రేయింబవళ్లు కష్టపడిన ఫలితమో ఏమో కానీ ఈ అమాత్యుల ఆస్తులు కనీవిని ఎరుగనిరీతిలో పెరిగిపోయాయి. (‘మరింత సంపన్నమైన కేంద్ర మంత్రివర్గం’ – ది హిందూలో సెప్టెంబరు21, 2011న ప్రచురితమైన వార్త). ఆ వివరాల ప్రకారం అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఆస్తులు ప్రతి 24 గంటలకు 5లక్షల చొప్పున పెరిగాయి. ఒకవైపు ఆయన మంత్రిత్వశాఖ అధీనంలోని ఎయిరిండియాలో ఎయిరిండియా ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే ఇంకొకవైపు మంత్రిగారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ పొదుపు కొరడా ఝుళిపించారు.
ఈ పొదుపు చర్యలు రెండు రకాల స్ఫూర్తిని కలిగివుంటాయనే విషయం గమనంలో వుంచుకోవాలి. కొద్ది కాలం క్రితం ప్రఫుల్ పటేల్, (యుపిఏ-ఎన్‌సిపి), నితిన్ గడ్కరీ (ఎన్డీయే- బిజెపి) ఇద్దరూ చాలా భారీ ఖర్చుతో అట్టహాసంగా పెళ్లిళ్లు జరిపించారు.
వీరి కార్పొరేట్ సహచరులు దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు.బడా వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ అత్యంత భారీ ఖర్చుతో 27 అంతస్థుల (కానీ, ఇది యాభై అంతస్థుల కన్నా ఎక్కువ ఎత్తు కలిగిఉంటుంది) మనోహరమైన విశాల భవంతిని నిర్మించుకున్నాడు. మద్యం వ్యాపార సామ్రాజ్యాధిపతి, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని విజయ మాల్యాది మరో రకమైన విలాసం. కింగ్‌ఫిషర్ ఎయిల్‌లైన్స్ ఉద్యోగులు జీతాల కోసం పోరాడుతుంటే, అదేమీ పట్టనట్లు దుబాయిలోని భృజ్ ఖలీఫాలోని 123వ అంతస్థులో నిర్వహించిన విందు తన జీవితంలోనే మరచిపోలేనిది అంటూ మే5న ట్వీట్ చేశాడు. అటు అంబానీ, ఇటు మాల్యాకు ఇద్దరికీ రెండు ఐపిఎల్ జట్లు ఉన్నాయి. ఐపిఎల్ పేరుతో నెలకొల్పిన సంస్థకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లభించడమే గాక, వినోదపు పన్ను మాఫీ వగైరా రాయితీలు ఉన్నాయి.
వాల్‌స్ట్రీట్ తరహాలో..
కార్పొరేట్ ప్రపంచం వాల్‌స్ట్రీట్ తరహా పొదుపుచర్యలనే అనుసరిస్తున్నది. అక్కడ సిటీగ్రూప్, మెరిల లింక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు 2008లో 3,260 కోట్ల డాలర్లను బోనస్‌ల రూపంలో ముట్టజెప్పాయి. మరో వైపు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము 17,500 కోట్ల డాలర్లను ఉద్దీపనల కింద ప్రభుత్వం నుంచి పొందినట్లు 2009లో బ్లూమ్‌బర్గ్ బిజినెస్ పత్రిక తెలియజేసింది.
గత వారం ప్రణబ్ ఆలపించిన పొదుపు పాట కూడా అతి సంపన్నులకు మేలు చేకూర్చేవేనని మరచిపోరాదు. ద్రవ్యలోటును సాకుగా చూపి ప్రజా సంక్షేమ పథకాలపై వరుసగా కోత పెడతారు. ప్రజలకు పని చూపేందుకు , ఆకలి తగ్గించేందుకు, స్కూలుకు పిల్లలను పంపేలా చూసేందుకు ప్రయత్నించకుండా మంత్రి ఈ పొదుపు చర్యల గురించి మాట్లాడడం మతిమాలిన చర్య. ఇది సంపన్నుల ప్రభుత్వం. బడ్జెట్‌లో రు.5లక్షల కోట్ల మేర కార్పొరేట్, ఎక్సైజ్ పన్నుల్లో రాయితీలను కార్పొరేట్లకు, సంపన్నులకు కానుకగా ఇచ్చిన ఇదే ప్రణబ్ ముఖర్జీ (చూడండి: ‘ది ఫిక్స్ బిపిఎల్, నిక్స్ సిపిఎల్’ -ది హిందూ, మార్చి26,2012) మనకు మాత్రం పొదుపు పాఠాలు వల్లిస్తున్నాడు. పార్లమెంటులో సీతారాం ఏచూరి ఈ విషయాన్ని లేవనెత్తుతూ సంపన్నులకు, కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలు బడ్జెట్‌లో ద్రవ్యలోటుకన్నా 8వేల కోట్లు అధికంగా ఉందని చెప్పారు.
దేశంలో బంగారం, వజ్రాలపై కస్టమ్స్ సుంకాల మినహాయింపుతో సహా ప్రభుత్వ ఆదాయాన్ని కుదించే వివిధ రకాల అంశాలపై మీడియా ఎందుకు చర్చ నిర్వహించదు అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ (ది హిందూ, జనవరి7,2012) సూటిగా ప్రశ్నించాడు. ఈ విధమైన కస్టమ్స్‌సుంకాల రాయితీలవల్ల ఏటా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని (సంవత్సరానికి సుమారు రు.50వేల కోట్లు) నష్టపోతున్నది. ఇదంతా రాబడితే మన ఆహార భద్రత బిల్లు(రు.27వేల కోట్లు)కు చెల్లించగా ఇంకా చాలా డబ్బు మిగులుతుంది.
(ది హిందూ సౌజన్యంతో)