
- మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం
- కాంగ్రెసు, బిజెపి ఘోర పరాజయం
- మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు
- ప్రజలకు పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం చారిత్రాత్మక విజయం సాధించింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మొట్టమొదటిసారిగా జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేయర్ పదవికి సంజరు చౌహాన్, డిప్యూటీ మేయర్ పదవికి తికిందర్ పన్వర్ భారీ మెజారిటీలతో ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. చౌహాన్, పన్వర్ ఘన విజయం సాధించడం పట్ల కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వ సారథి కాంగ్రెసు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెండు అత్యున్నత పదవులను సిపిఎం కైవసం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు 25 మంది సభ్యుల మున్సిపల్ కౌన్సిల్‌లో సిపిఎం మూడు కౌన్సిలర్ పదవులను కూడా గెలుచుకుంది. ఇక బిజెపి 12 కౌన్సిలర్ స్థానాలను గెల్చుకోగా, కాంగ్రెసు 10 స్థానాలు సాధించింది. సిపిఎం మేయర్ అభ్యర్థి సంజరు చౌహాన్ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎస్‌ఎస్ మన్హస్, కాంగ్రెసు అభ్యర్థి మధుసూద్‌లతో పోటీపడి తన సమీప బిజెపి అభ్యర్థిపౖౖె 7,868 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థికి 14,035 ఓట్లు రాగా, కాంగ్రెసు అభ్యర్థికి 13,278 ఓట్లు పోలయ్యాయి.
కాంగ్రెసు అభ్యర్థి దేవేందర్ చౌహాన్, బిజెపి అభ్యర్థి దిగ్విజరు సింగ్‌లతో పోటీ పడిన సిపిఎం డిప్యూటీ మేయర్ అభ్యర్థి తికిందర్ పన్వర్ సమీప బిజెపి అభ్యర్థిని 4,778 ఓట్ల మెజారిటీతో ఓడించారు. బిజెపి అభ్యర్థికి 16,418 ఓట్లు రాగా, కాంగ్రెసు అభ్యర్థికి 13,205 ఓట్లు వచ్చాయి. మొత్తం 79,970 ఓట్లలో 51,115 ఓట్లు (64.84 శాతం) పోలయ్యాయి. పోలయిన మొత్తం 51,115 ఓట్లలో చౌహాన్‌కు 21,903 ఓట్లు (42.85 శాతం) రాగా, పన్వర్‌కు 21,000 ఓట్లు (41.42 శాతం) వచ్చాయి.1851లో సిమ్లా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి మొదటిసారిగా సిపిఎం రెండు అత్యున్నత పదవులను సాధించింది. 1986 నుంచి సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసి)పై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెసుకు ఈ ఎన్నికల్లో సిపిఎం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఇక్కడ పరోక్ష ఎన్నికల ద్వారానే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రారంభం కాగానే సిపిఎం అభ్యర్థులు అత్యున్నత పదవులకు ఎన్నిక కావడం ప్రజాదరణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెసు విధానాలను, రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి విధానాలను, అదే సమయంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను తీవ్రంగా ఎండగట్టింది. సిపిఎం తన ప్రచారంలో కాంగ్రెసు, బిజెపి ఎస్‌ఎంసిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్న తీరును ప్రజలకు వివరించింది. బిజెపి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులను ఆపేసి ప్రజా సేవలను ప్రయివేటుపరం చేసిన వైనాన్ని విశదపరిచింది. నయా ఉదారవాద విధానాలు సామాన్య ప్రజలపై చూపుతున్న దుష్ప్రభావాన్ని తేటతెల్లం చేసింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత, అవినీతి, ప్రయివేటీకరణ, సామాజిక భద్రత లేమి…మొదలైనవాటికి దారి తీసిన కాంగ్రెసు, బిజెపి విధానాలను సిపిఎం ప్రజలకు వివరించింది. ఈ ఎన్నికల ద్వారా సిమ్లా ప్రజలు కాంగ్రెసు, బిజెపికి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అర్థమవుతోంది. దీంతో ఆ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలను చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రి ధుమాల్, మంత్రులు, బిజెపి ఎమ్మెల్యేలు గెలుపు కోసం నానా అడ్డదారులు తొక్కారు. అయినా ప్రజలు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. కాంగ్రెసు తరపున కేంద్ర మంత్రి వీరభద్రసింగ్ చేసిన ప్రచారం ఫలితమివ్వలేదు. సిపిఎం అభ్యర్థుల తరపున పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి ప్రచారం చేశారు.
ప్రజలకు పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు చరిత్మ్రాక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు సిపిఎం పొలిట్‌బ్యూరో కృతజ్ఞతలు తెలిపింది. సిపిఎంపై నమ్మకముంచి గెలిపించిన ప్రజలకు, పార్టీ హిమాచల్ ప్రదేశ్ శాఖకు అభినందనలు తెలిపింది.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Posted by చెన్నమనేని శివాజీ on మే 29, 2012 at 12:35 సా.
అద్భుతమైన విజయం. కామ్రేడ్ సంజయ్ చౌహాన్ తికేందర్ పర్వత్ లకూ అభినందనలు.
ఇది చాలా ప్రత్యేకత గలిగిన విజయం, ఈ వార్తకున్న ప్రాముఖ్యత నిజంగా అబ్బురపరుస్తోంది. చైనా బోర్డర్ ఆవల కమ్యూనిజానికి చేరిన మొట్టమొదటి మైలురాయి.
ఎవరుఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2020 నాటికి పశుపతి నుండీ దాకా కమ్యూనిస్టు రాజ్యమే