స్థలం కొనేదిక్కులేదు – వడ్డీ చెల్లింపుకు దారిలేదు
దళారులు విలవిల – ప్రకాశంలో కానరాని వికాసం
ఒంగోలు స్థిరాస్తిరంగ దళారులు వడ్డీల చక్రబంధంలో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోలు చేసిన స్థలాలు తిరిగి అమ్ముడుపోకపోవటంతో ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా మట్టి రూపాన ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నిరుటి వరకూ మే నెల రాకముందే ఒంగోలులో స్థిరాస్తి రంగ దళారుల హడావుడి కన్పించేది. ఇప్పుడు ఏ దళారి ముఖం చూసినా నేలనే చూస్తోంది. ఇబ్బడిముబ్బడిగా జేబులు నిండుతుండటంతో అప్పు చేసి మరీ స్థలాలు కొన్న దళారులకు ఇప్పుడు దిక్కుతోచని దుస్థితి ఏర్పడింది. దాదాపు రెండు వేల మంది దళారులు ఇప్పుడు రుణదాతలకు ముఖం చాటేసి తిరుగుతున్నట్లు చెబుతున్నారు. స్థలాలకుతోడు నగరం వెలుపల ప్రాంతాలలో నిర్మించిన అపార్టుమెంట్ల అమ్మకాలు కూడా కునారిల్లుతున్నాయి.
దళారుల అత్యాశ కారణంగా ఒంగోలు నగరంలో స్థలాల ధరలు పదేళ్లకు సరిపడా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని చూడాలని పేరు రాయటానికి ఇష్టపడని స్థిరాస్తి రంగ విశ్లేషకులు ఒకరు రియల్ అడ్వైజరు ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. వందలాదిఆ మంది నూనుగు మీసాల కుర్రోళ్లు బృందాలుగా ఏర్పడి స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి ముందుచూపు, లెక్కలేకుండా వ్యవహారాలు నడిపారని గుర్తుచేశారు.
ఫైనాన్స్ కంపెనీల నుంచీ పల్లెటూరి భూస్వాముల నుంచీ మూడు రూపాయలు మొదలు పది రూపాయలదాకా వడ్డీకి అప్పులు తెచ్చి భూముల్ని దళారులు కొనుగోలు చేశారు. ఇలాంటివారు ప్రస్తుతం నగరంలో రెండు వేల మందిదాకా ఉన్నట్లు లెక్కలు విన్పిస్తున్నాయి. వారిలో ఒక్కొక్క బృందం కనీసం రూ. 20 లక్షల మొదలు ఏడు కోట్ల రూపాయలదాకా పెట్టుబడులు పెట్టారు. ఒంగోలు నగరానికి సమీపంలోని మంగమూరు గ్రామానికి చెందిన 17.50 ఎకరాల భూమిని కొందరు యువకులు కలిసి ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే దానికి సమీపంలో శ్మశాన స్థలం ఉండటంతో రోడ్డు నిర్మాణం సమస్యల్లో పడింది. దీంతో మౌలిక వసతుల నిర్మాణం వీలుకాలేదు. ఫలితంగా ఏడాది నుంచీ ఈ స్థలాన్ని తిరిగి విక్రయించుకోలేక పెట్టుబడి మొత్తం స్తంభించిపోయింది.
నగరం వెలుపల ప్రధాన కూడళ్లలో గది (సెంటుకు ఆరు గదులు) ఒక్కొంటికి లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాలు ఇప్పుడు ఎందుకూ కాకుండా పడిఉన్నాయి. 40 లక్షల రూపాయలు పెట్టి కొన్న 40 గదుల భూమిని ఇప్పుడు రూ. 30 లక్షలకు అమ్ముదామన్నా కొనేదిక్కు లేదని ఓ దళారి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇదంతా వడ్డీకి తెచ్చిన డబ్బుతోనే కొనుగోలు చేశానని తెలిపాడు. అసలు కాదుగదా, ఇప్పుడు వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితిలో పడిపోయానని చేయెత్తి నమస్కరించాడు. వడ్డీ ఎంత అని అడిగితే, ”ఆ … ఒక్కటీ అడక్కండి.” అంటూ ముఖం తిప్పుకుని చకచకా వెళ్లిపోయాడు.
అపార్టుమెంట్లదీ అదే దారి
అద్దంకి బస్సుస్డాండు, కర్నూలురోడ్డు, అంజయ్యరోడ్డు పరిసర ప్రాంతాలలో స్థలాల ధరలు మిన్నంటి ఉన్నా నగరం లోపల అయినందున ఒకింత చేతులు మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గది స్థలం రూ 15 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా పలుకుతోంది.
సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినందున రాష్ట్రప్రభుత్వం ఇసుక తవ్వకాలు నిలిపివేసిన తదుపరి గత నెల, నెలన్నర రోజుల నుంచీ ఒంగోలు, దాని పరిసరాల్లో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. అయినా నగరం వెలుపల నిర్మించిన అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్ల్లు కూడా కునారిల్లుతూనే ఉన్నాయి. నిషేధానికి ముందు ట్ట్రారు ఇసుక మూడు వేల రూపాయలు ఉండగా, ఇప్పుడది రూ. 15 వేలు వెచ్చించినా దొరకటం లేదు. దీంతో నిర్మాణ రంగ పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ స్థితిలోనూ నగరం వెలుపల అదీ దగ్గరంగా నిర్మించిన అపార్టుమెంట్లలో రెండు పడక గదులున్న 1070 చదరపు అడుగుల ఫ్లాట్లు రూ. 20 లక్షల మొదలు రూ. 22 లక్షల దాకా పలుకుతున్నాయి. అదే రెండు, మూడు కిలోమీటర్ల దూరం మధ్య నిర్మించిన ఆపార్టుమెంట్లలో కేవలం రూ. 14 లక్షలకే లభిస్తుండటం విశేషం. నగరం వెలుపల దాదాపు 500కు పైగా ఫ్లాట్లు ప్రస్తుతం అమ్మకం కోసం సిద్ధంగా ఉన్నట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదు మాదిరిగానే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోనూ అపార్టుమెంట్ ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఇదే తరుణం కదూ!
Archive for మే 31st, 2012
31 మే
స్థిరాస్తి రంగంలో రూ. 200 కోట్లకు పైగా మట్టి
31 మే
పెట్రో భారం – ‘పన్నే’ అధికం
పెట్రో ధరలో దాదాపు 80 శాతం దాకా పన్ను భారమే. ప్రభుత్వం ఎప్పుడూ చెబుతున్నట్లుగా వాస్తవానికి పెట్రో భారం మొత్తం నిజంగా అంతర్జాతీయంగా పెరిగింది కానేకాదని లెక్కలు విదితం చేస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. దేశావసరాన్నీ, ప్రజలపై పడుతోన్న భారాన్నీ చూడటం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు లీటరు ఒక్కొంటికి ప్రాంతాలను బట్టి రూ. 81 నుంచి రూ. 82 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా రూ. 14.78. రాష్ట్రానికి చెందిన పన్నులు రూ. 19.63. మొత్తం రూ. 34.41. ఇంతవరకూ చూసినా పెట్రోలు వాస్తవ ధరలో ఈ పన్నుల వాటా 78.17 శాతం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 శాతం మేర అమ్మకం పన్ను కూడా విధిస్తోంది.
వాస్తవానికి అమ్మకం పన్నును మూల ధరపై విధించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఇతర పన్నులు, కేంద్ర పన్నులు, రవాణా ఖర్చులు కలిపిన తర్వాత ధరపై అమ్మకం పన్ను వసూలు చేస్తోంది. అంటే కేంద్రం విధించిన పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పన్ను వసూలు చేస్తోంది. మూల ధరమీద అమ్మకం పన్ను విధిస్తే లీటరుకు రూ. 14.53 పడుతుంది. అయితే అన్నీ కలుపుకున్న ధరపైన పన్ను వసూలు చేస్తున్నందున రూ. 19.63 పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ విధానాన్ని అనుసరించినా ఇక్కడ లీటరుకు కనీసం ఐదు రూపాయలన్నా తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న దానిలో రూ. 6.35 వ్యాట్, రూ. 6.00 ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ, రూ. 2.00 జాతీయ రహదారుల సెస్ ఉన్నాయి. దీనిలో వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్ డ్యూటీనిగానీ తగ్గిస్తే ఆరు రూపాయలు తగ్గుతుంది.
దేశ పన్నుల విధివిధానాలను బట్టి దేశంలో లభ్యంకానుందన దిగుమతి చేసుకునే అత్యవసర సరకులపై వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్ డ్యూటీనిగానీ విధించకూడదు.
నంగనాచి తుంగబుర్ర బీజేపీ
అంతర్జాతీయంగా పన్నులు పెరిగినప్పటికీ దేశంలో యధాతథంగా ఉంచేందుకుగాను 1960 నుంచీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అనుసరించటం ప్రారంభించింది. అదే ‘ఆయిల్ పూల్’ (చమురు నిధి) విధానం. దీనికోసం దేశంలో అమ్ముడుపోయే ప్రతి లీటరు పెట్రోలుకు వినియోగదారులు చెల్లించే ధర నుంచి రూపాయి నిధిని వసూలు చేశారు. అంతర్జాతీయంగా ధర పెరిగినప్పుడల్లా ఈ నిధిని ప్రభుత్వం ఉపయోగించుకునేది. అలా ధర దాదాపుగా స్థిరంగా ఉండేది. కనీసం చీటికీ మాటికీ పెరిగేది కాదు. అయితే బీజేపీ కేంద్రం గద్దెనెక్కిన కాలంలో ఈ చమురు నిధి విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. ఈ నిధిలో ఆనాడున్న 30 వేల కోట్ల రూపాయలను వేరే అవసరాలకు తరలించింది. దానివలన అంతర్జాతీయంగా పెట్రో ధర పెరిగిన ప్రతిసారీ ఇక్కడ కూడా మనపై భారాలు వేయాల్సిన తప్పని పరిస్థితిని ఆనాటి వాజపేయి ప్రభుత్వం దేశంపై రుద్దింది. అయితే ప్రజలకు ఇదంతా ఎక్కడ గుర్తుంటుందిలే అన్న ధీమాతో పెట్రో ధర పెరిగినప్పుడల్లా ఆ పార్టీ కార్యకర్తలు తగుదునమ్మా అన్నట్లుగా జెండాలు బుజానవేసుకుని తప్పంతా కాంగ్రెసుదేనన్నట్లుగా వెర్రికేకలు పెట్టటం క్షంతవ్యంగాని నేరం.
కాంగ్రెసు మోసం
ప్రస్తుతం కేంద్రంలో గద్దెనెక్కి పాలిస్తోన్న కాంగ్రెసు కూడా తనదైన శైలిలో ప్రజలను మోసం చేస్తోంది. పద్ధతి ప్రకారం దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసిన తదుపరి ధరను లెక్కించాలి. అయితే ప్రభుత్వం దానికి భిన్నంగా శుద్ధి చేసిన చమురు దిగుమతి ధరకు సమానంగా పన్నులు లెక్కలు కడుతోంది. దీని వెనుకే అసలు మోసం దాగి ఉందని చమురు రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దేశానికి చెందిన కొన్ని సంస్థలకు కూడా చమురు దిగుమతి చేసుకుని విక్రయించేందుకు అవకాశం కల్పించేందుకే ఈ తప్పడు విధానానికి ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సంస్థలకు అధిక లాభాలు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం శుధ్ది చేసిన తర్వాతి ధరకూ, నేరుగా శుద్ధిచేసిన చమురుకు చెల్లించిన ధరకూ తేడా లేకుండా ఉండాలి. అప్పుడు ప్రభుత్వ ధరకే ప్రవేటు సంస్థలు కూడా విక్రయిస్తున్నారని కొంతకాలంపాటు ప్రచారం చేసుకునేందుకు వీలుపడుతుంది. తర్వాత నెమ్మదిగా చమురు రంగాన్నుంచి ప్రభుత్వం తప్పుకుని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఆ తర్వాత ప్రవేటు సంస్థలు తమ నిజస్వరూపాన్ని చూపించి మన జేబుల్ని పూర్తిగా ఖాళీ చేసేపనికి పూనుకుంటాయి.
పాతొక రోత కాదు – కొత్తొంతా మోతే
దీనికి తోడు దేశంలోని చమురు బావులను కూడా ప్రభుత్వం రిలయన్స్‌కు అప్పగించి చోద్యం చూస్తోంది. వాస్తవానికి తూర్పుగోదావరి తీరంలో లభ్యమయ్యే గ్యాస్‌ను ప్రభుత్వమే పంపిణీ చేపడితే ఒక్కొక్క బండను రూ. 50లకే అందించే వీలుందని నిపుణులు ఏనాడో తేల్చారు. అదే తీరున మిగతా పెట్రో పదార్థాలకు కూడా ఇప్పటి ధరతో పోలిస్తే నాలుగో వంతు కూడా పడదు. పన్నుల భారం తగ్గిస్తే వినియోగదారుల జేబులకు భారం తగ్గుతుంది. దానికి తోడు గతం మాదిరిగానే చమురు నిధిని కూడా తిరిగి పునరుద్ధరిస్తే ఇక చెప్పేదేముంది…. అప్పుడు పెట్రో మంటలుండవు – ఆందోళనలకూ ఆస్కారం ఉండదు. పెట్రోలు చౌకగా లభ్యమయితే నిత్యావసరాలు సహా వస్తువులన్నింటికీ రవాణా ఛార్జీలు తగ్గిపోయి సరసమైన ధరలకు లభ్యమవుతాయి. ఇదండీ పెట్రోలు కథ. మరి మీరేమంటారు!