పెట్రో భారం – ‘పన్నే’ అధికం

Image
పెట్రో ధరలో దాదాపు 80 శాతం దాకా పన్ను భారమే. ప్రభుత్వం ఎప్పుడూ చెబుతున్నట్లుగా వాస్తవానికి పెట్రో భారం మొత్తం నిజంగా అంతర్జాతీయంగా పెరిగింది కానేకాదని లెక్కలు విదితం చేస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. దేశావసరాన్నీ, ప్రజలపై పడుతోన్న భారాన్నీ చూడటం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు లీటరు ఒక్కొంటికి ప్రాంతాలను బట్టి రూ. 81 నుంచి రూ. 82 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా రూ. 14.78. రాష్ట్రానికి చెందిన పన్నులు రూ. 19.63. మొత్తం రూ. 34.41. ఇంతవరకూ చూసినా పెట్రోలు వాస్తవ ధరలో ఈ పన్నుల వాటా 78.17 శాతం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 శాతం మేర అమ్మకం పన్ను కూడా విధిస్తోంది.
వాస్తవానికి అమ్మకం పన్నును మూల ధరపై విధించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఇతర పన్నులు, కేంద్ర పన్నులు, రవాణా ఖర్చులు కలిపిన తర్వాత ధరపై అమ్మకం పన్ను వసూలు చేస్తోంది. అంటే కేంద్రం విధించిన పన్నులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పన్ను వసూలు చేస్తోంది. మూల ధరమీద అమ్మకం పన్ను విధిస్తే లీటరుకు రూ. 14.53 పడుతుంది. అయితే అన్నీ కలుపుకున్న ధరపైన పన్ను వసూలు చేస్తున్నందున రూ. 19.63 పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ విధానాన్ని అనుసరించినా ఇక్కడ లీటరుకు కనీసం ఐదు రూపాయలన్నా తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న దానిలో రూ. 6.35 వ్యాట్‌, రూ. 6.00 ప్రత్యేక ఎక్సైజ్‌ డ్యూటీ, రూ. 2.00 జాతీయ రహదారుల సెస్‌ ఉన్నాయి. దీనిలో వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్‌ డ్యూటీనిగానీ తగ్గిస్తే ఆరు రూపాయలు తగ్గుతుంది.
దేశ పన్నుల విధివిధానాలను బట్టి దేశంలో లభ్యంకానుందన దిగుమతి చేసుకునే అత్యవసర సరకులపై వ్యాట్‌నుగానీ, ఎక్సైజ్‌ డ్యూటీనిగానీ విధించకూడదు.
నంగనాచి తుంగబుర్ర బీజేపీ
అంతర్జాతీయంగా పన్నులు పెరిగినప్పటికీ దేశంలో యధాతథంగా ఉంచేందుకుగాను 1960 నుంచీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అనుసరించటం ప్రారంభించింది. అదే ‘ఆయిల్‌ పూల్‌’ (చమురు నిధి) విధానం. దీనికోసం దేశంలో అమ్ముడుపోయే ప్రతి లీటరు పెట్రోలుకు వినియోగదారులు చెల్లించే ధర నుంచి రూపాయి నిధిని వసూలు చేశారు. అంతర్జాతీయంగా ధర పెరిగినప్పుడల్లా ఈ నిధిని ప్రభుత్వం ఉపయోగించుకునేది. అలా ధర దాదాపుగా స్థిరంగా ఉండేది. కనీసం చీటికీ మాటికీ పెరిగేది కాదు. అయితే బీజేపీ కేంద్రం గద్దెనెక్కిన కాలంలో ఈ చమురు నిధి విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. ఈ నిధిలో ఆనాడున్న 30 వేల కోట్ల రూపాయలను వేరే అవసరాలకు తరలించింది. దానివలన అంతర్జాతీయంగా పెట్రో ధర పెరిగిన ప్రతిసారీ ఇక్కడ కూడా మనపై భారాలు వేయాల్సిన తప్పని పరిస్థితిని ఆనాటి వాజపేయి ప్రభుత్వం దేశంపై రుద్దింది. అయితే ప్రజలకు ఇదంతా ఎక్కడ గుర్తుంటుందిలే అన్న ధీమాతో పెట్రో ధర పెరిగినప్పుడల్లా ఆ పార్టీ కార్యకర్తలు తగుదునమ్మా అన్నట్లుగా జెండాలు బుజానవేసుకుని తప్పంతా కాంగ్రెసుదేనన్నట్లుగా వెర్రికేకలు పెట్టటం క్షంతవ్యంగాని నేరం.
కాంగ్రెసు మోసం
ప్రస్తుతం కేంద్రంలో గద్దెనెక్కి పాలిస్తోన్న కాంగ్రెసు కూడా తనదైన శైలిలో ప్రజలను మోసం చేస్తోంది. పద్ధతి ప్రకారం దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసిన తదుపరి ధరను లెక్కించాలి. అయితే ప్రభుత్వం దానికి భిన్నంగా శుద్ధి చేసిన చమురు దిగుమతి ధరకు సమానంగా పన్నులు లెక్కలు కడుతోంది. దీని వెనుకే అసలు మోసం దాగి ఉందని చమురు రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దేశానికి చెందిన కొన్ని సంస్థలకు కూడా చమురు దిగుమతి చేసుకుని విక్రయించేందుకు అవకాశం కల్పించేందుకే ఈ తప్పడు విధానానికి ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ సంస్థలకు అధిక లాభాలు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం శుధ్ది చేసిన తర్వాతి ధరకూ, నేరుగా శుద్ధిచేసిన చమురుకు చెల్లించిన ధరకూ తేడా లేకుండా ఉండాలి. అప్పుడు ప్రభుత్వ ధరకే ప్రవేటు సంస్థలు కూడా విక్రయిస్తున్నారని కొంతకాలంపాటు ప్రచారం చేసుకునేందుకు వీలుపడుతుంది. తర్వాత నెమ్మదిగా చమురు రంగాన్నుంచి ప్రభుత్వం తప్పుకుని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తుంది. ఆ తర్వాత ప్రవేటు సంస్థలు తమ నిజస్వరూపాన్ని చూపించి మన జేబుల్ని పూర్తిగా ఖాళీ చేసేపనికి పూనుకుంటాయి.
పాతొక రోత కాదు – కొత్తొంతా మోతే
దీనికి తోడు దేశంలోని చమురు బావులను కూడా ప్రభుత్వం రిలయన్స్‌కు అప్పగించి చోద్యం చూస్తోంది. వాస్తవానికి తూర్పుగోదావరి తీరంలో లభ్యమయ్యే గ్యాస్‌ను ప్రభుత్వమే పంపిణీ చేపడితే ఒక్కొక్క బండను రూ. 50లకే అందించే వీలుందని నిపుణులు ఏనాడో తేల్చారు. అదే తీరున మిగతా పెట్రో పదార్థాలకు కూడా ఇప్పటి ధరతో పోలిస్తే నాలుగో వంతు కూడా పడదు. పన్నుల భారం తగ్గిస్తే వినియోగదారుల జేబులకు భారం తగ్గుతుంది. దానికి తోడు గతం మాదిరిగానే చమురు నిధిని కూడా తిరిగి పునరుద్ధరిస్తే ఇక చెప్పేదేముంది…. అప్పుడు పెట్రో మంటలుండవు – ఆందోళనలకూ ఆస్కారం ఉండదు. పెట్రోలు చౌకగా లభ్యమయితే నిత్యావసరాలు సహా వస్తువులన్నింటికీ రవాణా ఛార్జీలు తగ్గిపోయి సరసమైన ధరలకు లభ్యమవుతాయి. ఇదండీ పెట్రోలు కథ. మరి మీరేమంటారు!

One response to this post.

  1. ఇండియా కంటే ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లలో పెట్రోల్ ధర ఇండియా కంటే చవక. మన ఇండియాలో మాత్రం పెట్రోల్ మద్యంలాగ ఖరీదైనది.
    https://plus.google.com/111060331959395474623/posts/MLwxAu93D6s

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: