ఒం’గోలు’

Image
కొమ్మ విరిగిన కష్టాల్లో కాంగ్రెస్‌
సానుభూతి కోసం వైఎస్సార్‌సిపి తపన
తెదేపాకు నూతన జవసత్వాలు
లోక్‌’సత్తా’ సీపీఎం కూటమికి ఐదారు వేల ఓట్లు వస్తే ఐదారు లక్షలు సాధించినట్లే

కష్టాలూ ఒక్కోసారి లాభం తెచ్చుపెడతాయన్నట్లు గా ఉంది. ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటోన్న తెలుగుదేశం సమైక్యంగా కదులుతుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి జూన్‌ 12న జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి నూతన జవసత్వాలు సమకూరినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
అదే సందర్భంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెసు తన అభ్యర్థిని జగన్మోహనరెడ్డికి కానుకగా సమర్పించుకుని, కొమ్మ విరిగిన చెట్టు చందంగా నిట్టూరుస్తూ ఎన్నికల ప్రచార పర్వాన్ని నెట్టుకొస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వదిన, ఇక్కడే ఎంపీగా కూడా గతంలో గెలిచిన పార్వతమ్మ కాంగ్రెసు అభ్యర్థినిగా పోటీ చేస్తోంది. ఆమె భర్త సుబ్బరామిరెడ్డి కూడా ఇక్కడే ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. గెలుపోటములు పక్కనబెడితే కాంగ్రెసుకు పార్వతమ్మకన్నా మంంచి అభ్యర్థి లేడంటే అతిశయోక్తి కాదు. అయితే అదే తెలుగుదేశాన్ని ఎక్కించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచి, గనుల మంత్రిత్వశాఖనూ నిర్వహించిన ప్రస్తుత వైఎస్సార్‌ కాంగ్రెసుపార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గెలుపు కోసం ఇద్దరు గట్టి ప్రత్యర్థులతో కనాకష్టంగా పోరాడాల్సి వస్తోంది.
రెండు లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా కనీసం 65 వేలకు తక్కువకాకుండా ఓట్లు తెచ్చుకోగలగాలి. గతంలో అన్ని ఓట్లు తెచ్చుకుని గెలిచిన బాలినేని ఇప్పుడు వాటి నుంచి ఎంత కోల్పోతాడన్న దానినిబట్టి ఇతరుల గెలుపు ఆధారపడి ఉంటుంది.

Image

వెన్నాడుతోన్న వ్యాన్‌పిక్‌ పాపం
తాజా మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యాన్‌పిక్‌ పాపం వెన్నాడుతోంది. వోడరేవు – నిజాంపట్నం సముద్రరేవుల నిర్మాణ సంస్థ వ్యాన్‌పిక్‌ కోసం ప్రభుత్వం (వాస్తవానికి ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు) కొందరిని భయపెట్టి, మరి కొందరికి ఆశపెట్టి, ఇంకొందరిని మోసగించిన వ్యవహారంలో శిఖర భాగం బాలినేనిదన్న విమర్శలున్నాయి.
అయితే …
ఎవరి భూముల్ని వారికి ఇస్తామని ఇప్పుడు వాగ్దానం చేస్తోన్న కాంగ్రెసును నమ్ముతారా?
భూములు రైతుల చేతికొచ్చేదాకా పోరాడతామని హామీ ఇచ్చిన తెదేపాకు ఓట్లు వేస్తారా?
తమకు ఎకరానికి కేవలం రూ. 50 వేలే ఇచ్చి నాయకులు రూ. 3.50 లక్షల చొప్పున తినేశారని తిడుతూనే గతం మాదిరిగానే బాలినేనికి మద్దతు తెలుపుతారా?
ఇది నిజంగా 35 వేల ఎకరాల ప్రశ్న. ఇప్పుడే జవాబు చెప్పటం ఆ పొలానికి రైతులు అందుకున్నారని చెబుతోన్న రూ. 175 కోట్లంత బరువయిన పని. వాస్తవానికి ‘మా’ ప్రసాద్‌ ఖర్చు పెట్టారని విన్పిస్తోన్న రూ. 1400 కోట్లంత ఖరీదయిన ప్రశ్న ఇది. 1600 ఎకరాల అస్సైన్డ్‌ భూముల్ని అక్రమంగా లాగేసుకున్న పాపం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.
ఆ భూమికి ఇప్పుడు పలుకుతోన్న ధర రూ. 3500 కోట్లను వెయ్యి రూపాయల రూపంలో నేలమీద పరిస్తే వచ్చేంత దూరంలో ప్రధాన అభ్యర్థులకు గెలుపు గుర్రం కన్పిస్తోంది.

Image
తెదేపా ‘మెరుగు’ పడిందోచ్‌
కాంగ్రెసు పార్టీ – వైఎస్సార్‌ కాంగ్రెసుపార్టీ అభ్యర్థులతో పోలిస్తే తెదేపా పరిస్థితి 2009 ఎన్నికల నాటికన్నా గణనీయంగా మెరుగుపడటం విశేషం. ప్రధానంగా ఆ పార్టీ నేతలు కరణం బలరామకృష్ణమూర్తి, ఈదర హరిబాబు, శిద్దా రాఘవరావు పట్టుదలగా కదులుతుండటం ఒక కారణం. తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్థన్‌కు సంబంధించిన సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య ఈ దఫా ఏడు వేల పైచిలుకు పెరగటం విశేషం. ఈ వర్గానికి చెందిన ఓటర్లలో సాధారణంగానే 75 శాతం మంది తెదేపా వైపే మొగ్గుతుంటారు. దీనికితోడు ఈ దఫా ప్రత్యర్థుల కారణంగా మరికొంత ఓటింగు పెరిగే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో గతంలో 22 వేలదాకా ఆ వర్గానికి చెందిన ఓటర్లు ఉండగా ఇప్పుడా సంఖ్య 30 వేలకు చేరుకుంది. వాస్తవానికి గ్రామాల్లో కాంగ్రెసు పక్షానికి జై కొట్టే ఆ వర్గం కుటుంబాలు కూడా నగరంలో మాత్రం తెదేపాకే ఓటేసే అవకాశాలున్నట్లు విశేషకులు కూడా ఒప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో 44 వేల ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీకి ఇప్పుడు 55 వేల దాకా కచ్చితంగా పడనున్నాయని లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడున్న పలు అనుకూలాంశాలను ఓట్లుగా మలచుకొని మరొక పది వేల ఓట్లు తెచ్చుకోగలిగితే దామచర్ల గెలుపు గుర్రం ఎక్కినట్లే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకత, ప్రత్యేకించి తాజామాజీ పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేకత దామచర్లకు అనుకూలం అవుతాయి. దీనికితోడు ఈ నియోజక వర్గ పరిధిలో 25 వేలదాకా ఉన్న వ్యాన్‌పిక్‌ బాధిత ఓటర్లు ఎంత మందిని ఆకట్టుకుంటే ఆయనకు విజయం అంత సులభం అవుతుంది. దీనికితోడు రెండున్నర దశాబ్దాలపాటు తెదేపాకు వెన్నంటి ఉండి తర్వాత దూరమయిన వర్గాలలో ఎంతమందిని తిరిగి అక్కున చేర్చుకుంటారన్నదానిపై కూడా విజయలక్ష్మి చేరువయ్యే అవకాశాలున్నాయి. ఇక మాజీమంత్రి, సౌమ్యుడన్న పేరున్న దామచర్ల ఆంజనేయులు మనవడిగా జనార్థన్‌కు కొన్ని ఓట్లయినా పడవచ్చు. గతంలో వెనుకబడిన తరగతుల ఓట్లతో విజయం సాధించిన తెలుగుదేశం ఈసారి ఏ మేర రాబడితే విజయం కూడా అదే మేర దగ్గరవుతుంది.
చీలిక తంటా
ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలూ, ఒంగోలు నగరంలోనూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పరంగా ఓట్లు చీలి ఉండటం ఓ ప్రత్యేకత. తెలుగుదేశం ఓటర్లలో కొందరు మొగ్గుచూపిన ఫలితంగా బాలినేనికి దక్కిన గెలుపు ఇప్పుడు కాంగ్రెసు ఓట్ల చీలిక ఫలితంగా ప్రశ్నార్థకంగా మారింది. సంప్రదాయ ఓట్లలో ఈ దఫా కాంగ్రెసుకు ఎన్ని మిగులుతాయి? వైఎస్సార్‌సీపీకి ఎన్ని మరలుతాయి?? ఈ రెండు ప్రశ్నలకూ జవాబు దొరికితే విజయం ఎవరిదో ఇట్టే తేలిపోతుంది. అయితే కొన్ని ఓట్లు కాంగ్రెసు అభ్యర్థికి పడినా, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు కారణంగా సానుభూతి పెల్లుబికి లాభం తెచ్చిపెడుతుందని ఆ పార్టీ ఆశ పెట్టుకుంది. పైగా విజయమ్మ ప్రచారంతో మరిన్ని సానుభూతి ఓట్లు సాధిస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. నగరంలో పేదలు గణనీయంగా ఉన్నందున సానుభూతి ఓట్ల తుపాను గాలి ఫ్యాను వైపు వీస్తుందని ఆశతో ఉన్నారు. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాల ఓటర్లు వైఎస్‌కే మొగ్గుచూపుతున్నట్లు కన్పిస్తోంది. ఇక చివరి ఆయుధం మిగతా ఇద్దరి కంటే అధిక మొత్తానికి, అధిక సంఖ్యలో ఓట్లను కొనుగోలు చేయటం ఉండనే ఉంది.

Image
సుబ్బరామన్న – పార్వతక్క – ఓ ఎంపీ
ఇక కాంగ్రెసు సంప్రదాయ ఓట్లకుతోడు చేతికి ఎముకన్నది లేకుండా దానధర్మాలు చేస్తాడన్న పేరుతో సొంత బలగాలను సమీకరించుకున్న మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి భార్యగా కొంత, పార్వతక్కగానూ, పార్వ’తమ్మ’గానూ మరికొంత మాగుంట కుటుంబం పట్ల ఉన్న అనుకూలత ఇంకొంత, పాలక పక్షంగా ప్రస్తుత ఎంపీ శ్రీనివాసుల రెడ్డి ఇచ్చే హామీలు కలగలిసి తెచ్చే ఓట్లు చేతి గెలుపోటములను తేలుస్తాయి. వాస్తవానికి పార్వతమ్మ ఎన్ని ఎక్కువ ఓట్లు రాబట్టుకుంటే అంత ఎక్కువ లాభం తనకన్నా తెదేపాకు దక్కుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే ఈ తరహా గణాంకాలు ఎన్నికల్లో వర్కవుటు కాబోవని పండితులంటున్నారు. గత ఎన్నికల్లో పీఆర్‌పీకి తరలిపోయిన ఓటర్లు చిరంజీవి ఆకర్షణతో తిరిగి తమకే దక్కుతాయని కాంగ్రెసు పెద్ద ఆశలే పెట్టుకుంది.అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి అంచనా వేస్తే కాంగ్రెసుకు ఈసారి దక్కేది మూడో స్థానమేనని కొందరు ఆ పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు.
ఏతావాతా ఈ ఉప ఎన్నికల యుద్ధమంతా తెదేపా – వైఎస్సాఆర్‌సీపీ మధ్యే బలంగా ఉన్నట్లు పైకి కన్పిస్తోంది. కాంగ్రెసు సంప్రదాయ ఓట్ల శాతం బాగా పడిపోతే వైఎస్సార్‌సీపీ గెలుపొందే అవకాశాలున్నాయి. కాంగ్రెసు బలం నిలకడగా ఉంటే తెలుగుదేశాన్నే విజయలక్ష్మి వరిస్తుంది.

Image
లోక్‌’సత్తా’
అవినీతి వ్యతిరేక యుద్ధ వీరుడిగానూ, ఒంగోలులో రైతు పక్షపాతిగా మంచి పేరున్న జేపీ సాధారణంగా ఇక్కడ లోక్‌’సత్తా’ చూపాలి. ఆ పార్టీ ఇక్కడ సీపీఎం మద్దతుతో పోటీపడుతోంది. ఈ లెక్కన చూస్తే ఆ పార్టీకి ఐదారువేలకు తగ్గకుండా ఓట్లు పడితే వారి తాత్కాలిక లక్ష్యం నెరవేరినట్లే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పినట్లుగా వాటి వాటి ఉద్యమాలకు ఆ ఓట్లే ఐదారు లక్షలని కూడా ఒప్పుకోవచ్చు. తమకు వేసే ప్రతి ఓటూ వంద ఓట్ల పెట్టని ఆయన తిరుపతిలో వివరించారు. ఒకనాటి కలెక్టరుగా జేపీ చర్యలతో లాభపడిన రైతుల ఓట్లలో, అవినీతి వ్యతిరేకుల ఓట్ల నుంచి, సీపీఎం ఉద్యమాల ఫలితపు ఓట్ల నుంచి లోక్‌సత్తా ఎన్నింటిని దక్కించుకుంటుందన్నది ఆసక్తిదాయకమే.
వ్యాన్‌పిక్‌ వ్యతిరేక ఓట్లలో లోక్‌సత్తా – సీపీఎం కూటమికి ఎన్ని పడతాయి? తెలుగుదేశం ఎన్ని దక్కించుకుంటుంది? ఈ ప్రశ్నలకు జవాబులే అవినీతి పట్ల ప్రజల మనోభావాలను పట్టిచూపుతాయి.

2 వ్యాఖ్యలు

  1. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లోనైనా గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడంతో తప్పకుండా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలిచి తీరుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో నాలుగింటి పైన కాంగ్రెసు గట్టి ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పదిహేను అంతకు మించి సీట్లు సాధిస్తుందని, తెలుగుదేశం పార్టీ రెండు నుండి నాలుగు స్థానాలు గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన తిరుపతి స్థానంతో పాటు ఆళ్లగడ్డ, రామచంద్రాపురం, నర్సాపురంలలో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం చిరంజీవి ఇమేజ్‌తో పాటు స్థానిక అంశాలతో తిరుపతి, ఆళ్లగడ్డలలో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు ఏమేరకు కలిసివస్తాయో వేచి చూడాల్సిందే.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: