ఉదయాగమనం (కథ)

ఉదయాగమనమయి అప్పటికి నాలుగు గంటలు గడచింది. సూరన్న నుంచి దూసుకొస్తున్న కిరణాలు చురుక్కుమంటుండగా నగరవాసుల ఉరుకులూ – పరుగులూ చురుకెత్తుతున్నాయి. అదుగో సరిగ్గా అప్పుడే వెంకట్‌కు మెలకువ వచ్చింది. తిరిగి అంతలోనే మత్తు ఆవరించింది. నిద్ర ముంచుకొచ్చింది. మెలకువ … మత్తు … నిద్ర అలా అలా సాగుతోంది. కొంతసేపు మెలకువ … మరికొంతసేపు మత్తు – మత్తుగా … ఇంకొంతసేపు నిద్ర. ఏదో తెలియని స్థితి. పైగా ఒళ్లంతా నొప్పులు. తనకు ఏమయిందో అర్ధం కావటం లేదు. ఆ గదిలో మరెవ్వరూ లేరు. అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుండగానే మత్తు ఆవరిస్తోంది. మత్తులోనే నిద్ర. నిద్రలాంటి స్థితి. కొంత అర్ధమవుతుండగానే ఏదో అయోమయం.
కాసేపటికి మళ్లీ మెలకువ. మత్తుమత్తుగా ఉన్నా కొద్ది కొద్దిగా తెలుస్తోంది. అప్పుడే తలుపు తోసుకుని నర్సు లోపలికి రావటంతో తాను ఆసుపత్రిలో ఉన్న సంగతి వెంకట్‌కు పూర్తిగా బోధపడింది. ముందు రోజు సాయంత్రం ఎస్సార్‌ నగర్‌ నుంచి వెంగరావునగర్‌ వైపు రోడ్డులోకి మలుపు తిరుగుతుండగా జరిగిన సంఘటన లీలగా మదిలో మెదిలింది. ఎదురుగా ఎర్రదీపం ఆరిపోయి పచ్చ చంద్రుడు కన్పించటంతో ముందే ఉన్న వెంకట్‌ తన హోండా స్కూటరును కదిలించాడు. అయితే ఎదుటి నుంచి వేగంగా మోటారు సైకిలు మీద బక్కపీనుగు ఒకడు దూసుకురావటం – వెంకట్‌ వాహనాన్ని ఢీకొట్టి పారిపోవటం కన్ను తెరిచి మూసేంతలో జరిగిపోయాయి. వెంకట్‌కు అంతవరకే తెలుసు.
”హాయ్‌ వెంకట్‌” విన్‌ఫోసిస్‌లో తన సహోద్యోగులు శరత్‌, షీతల్‌ గాలిలో చేతులు ఆడిస్తూ వచ్చారు. అంత నీరసంలోనూ ఆ సంఘటన వెంకట్‌కు నవ్వు తెప్పించింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ సిఏ విజయసాయిరెడ్డి, న్యాయమూర్తికి లంచం వ్యవహారంలో యాదగిరి నాంపల్లి కోర్టుకూ, చర్లపల్లి జైలుకూ వచ్చేప్పుడూ, వెళ్లేప్పుడూ ఎదురుగా ఎవ్వరూ లేకపోయినా చేతులూపుతూ తరచూ టీవీల్లో కనపడటం వెంకట్‌కు గుర్తుకొచ్చింది. ముఖం మీద నవ్వు పులుముకుని ”హలో” అంటూ బదులిచ్చాడు.
”ఇప్పుడెలా ఉంది? అన్నట్లు రాత్రి నీకు ఆపరేషను చేసిన డాక్టరు కన్పిస్తే, మాట్లాడి ఇలా వచ్చాం. ప్రమాదం ఏమీ లేదు, అంతా ఓకే అన్నాడాయన.” కంఠోపాఠం చేసిన పద్యాన్ని పంతులుగారికి చిన్నప్పుడు ఒప్పగించినట్లుగా గడా గడా చెప్పేశాడు శరత్‌.
”అలానా! ఆపరేషను చేశారా?” చేతికి వేసిన ట్టును చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు వెంకట్‌. శరత్‌కు అప్పుడు అర్ధమయింది, ప్రమాదం తర్వాత జరిగిన విషయాలేవీ వెంకట్‌కు తెలియవని.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయి స్పృహలో లేని వెంకట్‌ను 108లో నిమ్స్‌కు తరలించిన విషయంతో మొదలు పెట్టి అన్నీ పూసగుచ్చాడు.
”హెల్మెట్‌ లేకపోతే ఏమి జరిగేదోగానీ, చేతి ఎముక విరగటం తప్ప ప్రాణాపాయం లేదు.” అంటూ నిమ్స్‌ వైద్యులు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశాడు.
”విరిగిన ఎముకకు స్టీలు రాడ్‌ వేసేందుకు రాత్రి పొద్దుబోయిన తర్వాత ఆపరేషను చేశారు. పెద్ద గాయాలకేమో కుట్లు వేసి కట్లు కట్టారు. ప్రమాదమేమీ లేదని తేలిన తర్వాత ఈ గదికి మార్చి మేమంతా ఇళ్లకు వెళ్లిపోయాము. అన్నట్లు మన సిఈఓ శ్రీనివాసన్‌గారు కూడా మాతోపాటు ఇక్కడే ఉన్నారు.”
”ఇప్పుడు కూడా సిఈఓగారే మమ్మల్ని ఇక్కడకు పంపించారు.” అన్నాడు షీతల్‌.
”మన వాళ్లెవరయినా నా స్కూటర్ని చూశారా? ఎలా ఉంది?? బాగు చేయిస్తే పనికొస్తుందా??? ప్రశ్నల వర్షం కురిపించాడు వెంకట్‌.
”స్కూటర్ని మేము చూడలేదుగానీ, ఇన్సూరెన్సు వస్తుందిలే. ఆందోళన పడకండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు కూడా అన్నారు.” సర్దిచెప్పారు. అయినా వెంకట్‌ మనస్సులో మాత్రం రెండు నెలల క్రితం వాయిదాల్లో కొన్న స్కూటరే మెదులుతోంది. వారి మధ్య మాటలే లేనట్లుగా కాసేపు మౌనం రాజ్యమేలింది. సాయంత్రం మరోసారి కనపడతామంటూ శరత్‌, షీతల్‌ వెళ్లిపోయారు.
బీటెక్‌ చివరి ఏడాది చివరలో విన్‌ప్రోసిస్‌ నిర్వహించిన క్యాంపస్‌ సెలక్షన్స్‌లో వెంకట్‌ ఎంపికయ్యాడు. గత ఆరు మాసాల నుంచీ ఆ సంస్థలో పనిచేస్తున్నాడు. జీతం యాభై వేలు. కారు కొనుక్కోమని తల్లి రాజ్యలక్ష్మి పోరినా వినకుండా స్కూటరు కొనుక్కున్నాడు. అదీ వాయిదాల పద్ధతిలో తీసుకున్నాడు. తల్లి మాటకు లొంగకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకున్నానని జబ్బలు చరుచుకున్నాడు. తాను ఎన్ని గంటలకు నిద్ర లేవాలో? ఏమి? ఎంత? తినాలో, ఏమి చదవాలో? ఇలా అన్నీ తానై నిర్ణయించే తల్లి అంటే వెంకట్‌కు సదభిప్రాయం లేదు. ఇప్పటిదాకా ఆమె మాటను జవదాటిందీ లేదు. ఏళ్ల తరబడీ ఉన్న విముఖత ఇప్పుడు మగ మయూరంలా పురి విప్పి ఆడుతోంది. తొలిసారిగా తల్లి మాట విననందుకు తనను తానే అభినందించుకున్నాడు. కారు కొనుక్కునేందుకు తల్లి ఇస్తానన్న డబ్బును తిరస్కరించినందుకుగాను గొప్ప పనిచేశానన్నట్లుగా పొంగిపోయాడు. అంతలోనే ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని మాత్రం కలలో కూడా తలపోయలేదు. పంజాగుట్ట హనుమంతుడు ఎల్లకాలం తనతోనే ఉండి ఏ ప్రమాదమూ జరక్కుండా చూసుకుంటాడని ఇంత కాలం నమ్మాడు. అంతుకేగా వాహనాన్ని కొని, నేరుగా హనుమాన్‌ టెంపుల్‌కు వెళ్లాడు. అప్పటికే బోలెడన్ని కార్లూ, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ద్విచక్ర వాహనాలూ అక్కడ కొలువుదీరాయి. వాటి యజమానులు వరుసల్లో బారులు దీరి తమ వంతు కోసం ఎదురెదురు చూస్తున్నారు. వెంకట్‌కు మూడు గంటల తర్వాత వంతొచ్చింది. పురోహితుడు వస్తూనే పేరడిగాడు. ఊరు, గోత్రం తదితర వివరాలు తెలుసుకున్నాడు. బిగ్గరగా ఏవో మంత్రాలు పఠిస్తూ వెలిగించిన కర్పూరం ఉన్న వెండి పళ్లాన్ని వాహనం చుట్టూ మూడు మార్లు తిప్పాడు. కుంకుమ, పసుపు నీటిని బండి మీద వెదజల్లాడు. ఓ కాషాయం రిబ్బనును హ్యాండిలుకు చుట్టాడు.
”మీ సంతోషం కొద్దీ ఏదో ఇలా కానుక వేయండి. దేవుడి హుండీలోనూ తృణమో – పణమో సమర్పించుకోండి.” అంటూ పూజారి వెండి పళ్లాన్ని వెంకట్‌ ముందు పెట్టాడు. అక్కడి తతంగాన్నంతా ముందే తెలుసుకున్న వెంకట్‌ వెంటనే పర్సు తీసి విడిగా పెట్టిన 516 రూపాయల్ని పళ్లెంలో పెట్టి పూజారికి దండం పెట్టాడు. 1116 రూపాయల్ని హుండీలో వేశాడు. అక్కడే పళ్లెంలో ఉంచిన కుంకుమను కాసింత తీసి ముఖానికి రాసుకున్నాడు. కళ్లు మూసుకుని దేవుడికి ఓ నమస్కారం పెట్టేసి బయటపడ్డాడు. తనకు ఇక ఏ ప్రమాదమూ జరగదనుకున్నాడు.
మూడు నెలలు కాకముందే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ప్రమాదం జరిగింది. అదే అర్ధం కాక వెంకట్‌ బుర్ర బద్దలవుతోంది.
”అంత ఖర్చుపెట్టి హనుమంతుడికి పూజ చేసినా ప్రమాదం జరగటం ఏమిటి? అంటూ తనను చూడ వచ్చినవాళ్లందరి దగ్గరా వెంకట్‌ ఆశ్చర్యపోతున్నాడు.
”వెంకట్‌ అమాయకుడని తెలుసుగానీ, మరీ ఇంత అమాయకుడని ఇప్పుడే అర్ధమయింది” అంటూ వాళ్లు చెవులు కొరుక్కున్నారు.
ఏ ప్రశ్నతోనయితే విసిగిస్తున్నాడని సిఈఓ అందరి నోటా విన్నాడో, అదే ప్రశ్న ఆయనకూ ఎదురయింది. నవ్వాలో, కోపగించుకోవాలో తెలియక సిఈఓ తికమకపడ్డాడు. కాసింత సేపటికి తెప్పలర్లి ”చూడు వెంకట్‌, నువ్వింత అమాయకుడివేమయ్యా! అయినా వాహనం కొన్న ప్రతివాడూ ఏదో ఆనవాయితీగా హనుమంతుడికి పూజ చేయిస్తాడు. నువ్వూ చేయించావు. అంతేగానీ పూజ చేయగానే ప్రమాదాలు జరగవనుకుంటే ఎలా? పూజకే అంత మహిమ ఉంటే రోజూ ఇన్ని వేల ప్రమాదాలు జరగవు కదా? ప్రశ్నలు సంధిస్తూనే జవాబూ చెప్పేందుకు సిఈఓ ప్రయత్నించాడు.
”అదేమిటి సార్‌! మీరలా అంటారు? ప్రమాదాలకు గురయిన వాళ్లంతా కూడా పూజలు చేయించారంటారా?
”అవును వెంకట్‌. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నూటికి తొంభై తొమ్మిది మందికి పైగానే ఏ వాహనం కొన్నా, వెంటనే పూజ చేయించటం మన దేశమంతటా రివాజయింది.” వివరించాడు సిఈఓ.
”మరి ప్రమాదాలకూ, దేవుడికీ సంబంధం లేదనుకుంటే పూజలు చేయించటం ఎందుకు సార్‌?” వెంకట్‌ మరోమారు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందరూ అనుకున్నట్లుగా వెంకట్‌ కచ్చితంగా అమాయకుడేనని సిఈఓకి తేలిపోయింది.
”అంతేనయ్యా, వెంకట్‌. పూజలు పూజలే – ప్రమాదాలు ప్రమాదాలే” అంటూ చాలిపోయినట్లుగా సిఈఓ కుర్చీలో వెనక్కు వాలిపోయాడు.
సూరయ్య ఆరోజు పని ముగించే సమయం అది. ఆసుపత్రి గదిలో ఒంటరిగా ఉన్న వెంకట్‌ బుర్రను ప్రశ్నలు చుట్టుముడుతూ ఒకటే తినేస్తున్నాయి. జవాబులు మాత్రం దొరకటం లేదు.
”పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నా బుర్ర తినేయకురా” చిన్నప్పుడు తనను తల్లి తరచూ మందలించటం గుర్తుకొచ్చింది.
”వెధవ ప్రశ్నలూ, నువ్వూనూ – వెధవ, వెధవన్నర వెధవ, కూర్చో” పంతులుగారి చీదరింపులూ తలపుకొచ్చాయి.
”బాబూ, నీది మామూలు బుర్రకాదు. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగినంత తెలివి లేదు మాకు. దయచేసి మమ్మల్ని విసిగించకోయ్‌” స్నేహితుల వ్యంగ్యాస్త్రాలు జ్ఞప్తికొచ్చాయి.
అంతే, తర్వాత కొంతకాలానికి వెంకట్‌ మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడని అందరూ సంతోషపడ్డారు కూడా. అంటే అప్పటి నుంచీ వెంకట్‌ ప్రశ్నించటమే మానుకున్నాడు. వినటం నేర్చుకున్నాడు. ఎవ్వరు చెప్పినా వినటమే. ఊ కొట్టటం. చేతనయినవరకూ చేయటం. అంతే.
”ఏమిటి? ఎవరు? ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎక్కడ? ఇలా ఆరు ప్రశ్నలు వేసుకుంటే వచ్చే జవాబులో ముఖ్యమైన దానిని ముందు పెట్టి వార్తలు రాస్తుంటామురా.” అంటూ పాత్రికేయుడయిన తన చిన్ననాటి మిత్రుడు వీరభద్రం ఓనాడు తనతో చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది. అప్పుడు దానిని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఏదో విన్నట్లు విని, గాలికొదిలేశాడు తప్ప దాన్లో తనకు, ఆ మాటకొస్తే మనుషులందరికీ పనికొచ్చే విషయం ఉందని అనుకోలేదు.
”వాట్‌ – వేర్‌ – వెన్‌ – వై – హూ – హౌలోని తొలి అక్షరాలను తీసుకుని ఐదు డబ్ల్యూలు, ఒక హెచ్‌కు వచ్చే జవాబే వార్తకు లీడ్‌” అంటూ భద్రం చెప్పిన వివరణను ఏనాడూ తాను పట్టించుకోలేదు.
ప్రమాదం జరగక్కుండా తనను కాపాడమని హనుమంతుడిని కోరుతూ స్కూటరు కొన్న వెంటనే పూజ చేయించాడు. అయినా మూడు మాసాలకే ప్రమాదం జరగనే జరిగింది.
”ఆ సంఘటనలో నా తప్పూలేదు. నా ప్రమేయమూ లేదు. అయినా నాకే ప్రమాదం జరిగింది. నా వాహనానికి ఏమయిందో ఇంకా చూసుకోలేదు.” తలలు బోడులయినా తలపులు బోడులు కావని వేమన్న అన్నట్లుగా పుండ్లు మానేందుకుగాను గుండు చేసినా వెంకట్‌ బుర్ర మాత్రం తలపులతో నిండిపోతూనే ఉంది.
”అంటే పూజలకూ – ప్రమాదాలకూ సంబంధమే లేకపోతే అసలు పూజలెందుకు??” నమ్మకాల మూలాల్నే తిరగదోడే ప్రశ్న ఉదయించింది. పూజలు చేయించినా ప్రమాదాలు జరుగుతున్నందన నివారణకు వేరే ఏదో చేయాలన్నమాట. అదేదో ఆలోచించాలి.” అనుకున్నాడు వెంకట్‌.
అప్పుడే సూరన్న ఈ లోక ప్రయాణానికి తొలి అడుగు వేశాడు. ఉదయాగమనమయింది. తూరుపు వేపు కిటికీ నుంచి సూరన్న కిరణాలు దూసుకొచ్చి వెంకట్‌ను తాకుతున్నాయి. వాటి వెచ్చదనంతో చలిపులి పారిపోయింది. అతనిలో నూతనోత్తేజం కలిగింది.

2 వ్యాఖ్యలు

  1. హ హ హ. చాలా సింపుల్ సార్. పూజ చేయించి ఉండకపోతే జైరిగిన ప్రమాదానికి అతను రేపు సంసారానికి పనికిరాకూండ పోయేవాడు (సాధారణంగా తెలుగు సినిమాల్లో ఇదే జరుగుతుంది). పూజ చేయించుకున్నాడు కాబట్టి ఏదో చేతి ఎముకలో రాడ్ తో తప్పించుకున్నాడు.

    స్పందించండి

  2. “నారమ్మ కు కుర్ర తనం లో పట్ట రాని చోట జలగలు పట్టటం, సూరయ్య ఆ ప్రదేశం పై చుట్ట నమిలి ఉమ్మేయటం”, మాస్టారు ఏ ఉద్దేశం తో రాశారో కానీ, నాకు మాత్రం titillating గా అనిపించింది (ఈ విషయం గురించి చెప్పటం (మోటు సరసం) సూరయ్య స్వభావానికి సరిపోయినా). ఈ కథలోనూ, యజ్ఞం కథలోనూ, “నెహ్రూ హయాం లోని మిశ్రమ ఆర్ధిక విధానాల వలన చిన్న కమతాలు కలిగిన దళిత కులాలు, భూమిని కోల్పోయి దిగజారాయని”, రాశారు మాస్టారు. ఉత్తరాంధ్ర సంగతి నాకు తెలియదు కానీ మధ్యాంధ్ర లో దళితులకి నలభైలలో కానీ యాభైలలో కానీ చిన్న కమతాలు కూడా ఉన్న దాఖలాలు లేవు. డెభ్భై ల చివరికి వచ్చేటప్పటికి పట్టా భూములూ, జమీందార్ల భూములూ పంచి పెట్టటం వలన వారికి కూడ కొంచమైనా భూ వసతి ఏర్పడింది. తొంభైల చివరికి పల్లెలలోని దళితులలో కూడా టీచర్లూ, గుమాస్తాలూ వంటి మధ్య తరగతి ఏర్పడి, వారిలో కూడా మధ్య తరగతి భూ-యాజమాన్యం వచ్చింది. కథ మొత్తం మనకు దృశ్య పరం గా కన్నుల ముందు తిరుగుతూ ఉంటుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ గోదా, ఎండా అన్నీ నిజ జీవితపు ముసుగు వేసుకొని కనపడతాయి. మొత్తానికి ఉత్తరాంధ్ర లోని ఒకప్పటి పల్లెటూరి సామాజిక వ్యవస్థనీ అందులోని దోపిడీనీ, దానిలో వస్తున్న ఒక మార్పునీ కళ్ళ కు కట్టిన కథ “చావు”.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: