ఇక నోరు మూస్తారా?
రాయని భాస్కరులు అదేలెండి రాయలేని భాస్కరులు కాసిన్ని డబ్బులు పారేసి రాయించుకుని కింద తమ సంతకం గీకేసుకోవటం కద్దు. భాస్కర్రావులకు రాసిపెట్టే వాళ్లు బాగానే రాస్తారుగాబట్టి వాటిని నిలువుగానో, అడ్డంగానో అర్ధం చేసుకోవటం పెద్ద సమస్య కాబోదు. అయితే అసలు సమస్యల్లా కలగాపులగంగాళ్లతోనే.
ఆవేశం వీళ్లకు పెన్నుతో పెట్టిన విద్య. అందువలన వాళ్ల రాతలు అర్ధం కావటం కష్టం. పైగా వాస్తవాలను పట్టించుకోని, తర్కం తెలియని ఈ ప్రబుద్ధుల రాతలు కేవలం గందరగోళానికి పనికొస్తాయి తప్ప వాస్తవాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ఉపకరించవు.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే … దూడ గడ్డికోసమన్నచందంగా చెబుతారు.
బుకాయింపులు – విరుచుకుపడటాలు సరేసరి.
నువ్వు చెడ్డోడివని అంటే చాలు – ”నువ్వే చెడ్డోడివి. ఆ మాటకొస్తే మీ తాత మహా చెడ్డోడు. మీ నాన్న సంగతి చెప్పనలవే కాదు” అంటూ ఎదురు దాడికి దిగుతారు. తిట్ల దండకం మొదలు పెడతారు. తప్ప తాను ఎందువలన చెడ్డవాడు కాదో చెప్పరు. తమను తిట్టినవాళ్లు, వారి ముందు తరాలవాళ్లు ఎలా తప్పుడు వాళ్లో వివరించరు. వివరించలేరు. ఒప్పించలేరు.
కాదంటారా?
24 ఆగస్టు 2012నాటి ఓ బ్లాగు భాగోతాన్ని చూడండి.
బ్లాగు పేరు : ఇక నోరు మూస్తారా…అంతా పేరులోనే ఉందంటే ఇదేనేమో మరి!
అంశం : తెలకపల్లి రవిగారి అపసవ్య రాతలకి ప్రతిగా
విషయం ఇదీ :
కమ్యూనిష్టుల మీద ఆరోపణలు లేవా? అసలు భారత చరిత్రనే వక్రీకరించి రాశారన్న పెద్ద ఆరోపణలు ఎదుర్కుంటున్నది కమ్యూనిష్టు చరిత్రకారులే. మీ వక్రీకరణతో పోలిస్తే ఆరెస్సెస్ వక్రీకరణ ఎంత చెప్పండి. మీ ద్వంద్వనీతి ముందు వారిదెంత? వారికి కనీసం నిబద్ధత అయినా ఉంది. మీ కమ్యూనిష్టులకి అది కూడా లేదు. పెట్టుబడిదారులు ఆడవాళ్లతో కులుకుతారు అని కారల్ మార్క్సే రాసాడు. అటువంటి విషప్రచారాలు మీరు మొదలుపెట్టి అవతలివారి మీదకి నెట్టడం ఎంతవరకూ సబబు?
దీన్లో తెలకపల్లి ఏమి రాశాడో వివరం లేదు. దాడి మాత్రం బోలెడంత ఉంది. తెలకపల్లి రాతల్లో తప్పులుంటే కనీసం ముఖ్యమైన రెండు మూడు అంశాలనయినా తీసుకుని ఇది తప్పు – ఇలా తప్పు … అని వివరిస్తేగదా ఎవరికయనా అర్ధం అయేది. ఎవరయినా తప్పు తెలుసుకునేది. మరి ఈ బ్లాగరుకి అలాంటి తర్కం ఉన్నట్లు కన్పించటం లేదు. కసి మాత్రం బోలెడంత బుసుకొడుతోంది.
అందుకని కలగాపులగం భాస్కరరావుగారూ, కాదు కాదు కలగాపులగం కామేశంగారూ, అవేశం కాదు. ఆలోచనకు పనికొచ్చే సరకు ఏదన్నా ఉంటే చెప్పేందుకు ప్రయత్నించండి. మీరు గదమకుండానే మీకు నచ్చనివాళ్లు తప్పులు రాస్తే నోరు మూసేస్తారు. ఒక వేళ మూయకపోతే జనమే మూయిస్తారు. ఏమంటారు?????