
- గ్రామాలనే కొనేస్తున్న ‘నయా భూస్వాములు’
- కరువు ప్రాంతంలో ‘కార్పొరేట్ సేద్యం’
నిత్య కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా నుంచి వలసలు వెల్లువెత్తుతుండటంతో.. ఖాళీ అవుతున్న ఊళ్లపై పెద్దల కన్ను పడుతోంది. వ్యవసాయం భారమై.. పూటగడవడమే కష్టమైన పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు ఊరొదిలి పోతుండటం పరాన్నభుక్కులకు వరంగా మారింది. వలసలతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతుండటంతో వ్యాపారులు, కొంతమంది రాజకీయ నాయకులు ఎగబడి పేదల భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా కరువు ప్రాంతమైన ఈ జిల్లాలో కార్పొరేట్ వ్యవసాయానికి బీజాలు పడుతోంది.
ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెండ్రాయునిపల్లి గ్రామాన్ని ఓ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు కొనేశారు. ఒకప్పుడు ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివాసముండేవి. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. వరుస కరువులతోపాటు, ఫ్లోరైడ్ సమస్య ఉండటంతో ఒక్కొక్కరు గ్రామం వదిలి ముదిగుబ్బ, కదిరి, అనంతపురం పట్టణాలకు వలస వెళ్లారు. దీంతో గ్రామం మొత్తం ఖాళీ అయింది. మొండిగోడలే మిగిలాయి. వలసలతో ఖాళీ అయిన ఈ గ్రామం మొత్తాన్ని ఓ నాయకుడు కొన్నారు. భూమినిబట్టి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ రైతులకిచ్చి గ్రామ పరిధిలోని 500 ఎకరాలను కొనుగోలు చేశారు. పొలాలన్నింటినీ చదును చేసి 15 చోట్ల బోర్లు వేసి సూక్ష్మ బిందు సేద్యం ద్వారా సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు ఎకరాల్లో వంకాయ, పది ఎకరాల్లో టొమాటో, 15 ఎకరాల్లో ఖర్బూజా సాగు చేశారు. పొలం అంతటికీ ‘డ్రిప్’ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం చూసి చిన్న, సన్నకారు రైతులు నోరెళ్లబెడుతున్నారు.
బత్తలపల్లి మండలం వసంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆగ్రహారం గ్రామాన్ని ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. సుమారు 350 ఎకరాలు ఒక్కడే కొనేసి చుట్టూ కంచె వేశాడు. నంబుల పూలకుంట, చెరువువాండ్లపల్లి గ్రామాలనూ ఇలాగే కొనుగోలు చేశారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు వచ్చి భూములు కొంటున్నారు. సోమందేపల్లి మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని రెండు వేల ఎకరాలను ఒక ఉత్తరాది వ్యాపారి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 500 నుంచి రెండు వేల ఎకరాల వరకూ కొనేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల నుంచి 20 వేల ఎకరాల వరకూ ఇప్పటికే కొనుగోలు చేసినట్టు అంచనా. వంద ఎకరాల్లోపు కొనుగోలు చేస్తున్న వారు లెక్కలో లేదు. వీరందరూ ‘అగ్రి ఫామ్’ పేరుతో రిజిస్టరు చేయించుకుని ఎగుమతికి అవసరమైన పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
కరువు ప్రాంతంలో కార్పొరేట్ వ్యవసాయ బీజాలు
దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా. సగటున 552 మిల్లిమీటర్లు వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతుంది. రెండేళ్లుగా 400 మిలిమీటర్లకు మించి సగటు వర్షపాతం దాటడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి రైతులు వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి బీడు పడింది. జిల్లాలో 25 లక్షల ఎకరాలకుపైగా సాగుభూమి ఉన్నా పదిశాతానికి కూడా సాగునీటి వసతిలేని ప్రాంతమిది. ఇలాంటి జిల్లాలో పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికొచ్చి వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తామని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు ప్రాంతంలో కార్పొరేట్ వ్యవసాయానికి బీజాలు ప్రారంభమవడం చర్చనీయాంశంగా మారింది.
Posted by jayadev on ఆగస్ట్ 24, 2012 at 4:10 సా.
vry informative post rao garu..
Posted by Sudhakar on ఆగస్ట్ 25, 2012 at 8:10 ఉద.
రాయల సీమ ‘ రతనాల సీమ ‘ గా ప్రసిద్ధి గాంచినది. ఫ్యాక్షనిస్టు రాజకీయాల లో కుళ్ళు కంపు కొడుతూ , ఇప్పటి వరకూ , అభివృద్ధి పరం గా కుంటు పడింది. అది తెలిసిన ఆంద్ర రాష్ట్రం లోని మిగతా ప్రాంత భూస్వాములు అక్కడకు వెళ్ళ డానికి జంకు తున్నారేమో !
ఉత్తరాది నుంచి ఈ బడా భూస్వాముల రాక తో , కొంతైనా బాగు పడుతుందనీ , ఈ బడా భూస్వాములు
( తమకు ఉత్తరాదిన ఉన్న అనుభవం తో ) ప్రాంతీయ రాజకీయాలను సమర్ధ వంతం గా ఎదుర్కొ గలరనీ ఆశిద్దాం ! ఏది ఏమైనప్పటికీ , ఆ ప్రాంత ప్రజలకు కావలసింది, కడుపు నిండా తిండి ! ఇంకో పరిష్కార మార్గం : ఆ ప్రాంతీయ ప్రజలు కొన్ని సంఘాలు గా ఏర్పడి కూడా , ఈ ‘ నూతన వలస దారుల ‘ తరహాలో సేద్యం చేసుకోవచ్చు ! అది బ్రహ్మ విద్య కాదు కదా! బహుశా అక్కడ లోపించింది , ఆ ప్రాంత రైతుల లో చైతన్యం !
మంచి విషయాలు వివరం గా రాస్తున్నారు. మీ కృషి అభినంద నీయం !
Posted by Snkr on ఆగస్ట్ 26, 2012 at 12:53 ఉద.
రైతులు చేసుకోలేక అమ్ముకుంటున్నారు. చేసుకోగలిగిన సత్తా వున్నవారు కొంటున్నారు. వర్షాభావ ప్రాంతాల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఏవో కొంత లాభసాటి వ్యవసాయం కొంతమంది భూస్వాములు చేస్తుంటే, ఇందులో ఆందోళన చెందాల్సిన అంశమేమిటో వివరించలేదు. సిగ్గుపడాల్సింది ఎవరైనా వుంటే .. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రవసాయ, ఆర్థిక మంత్రులు, ముఖ్యమంత్రి.
రైతులు అమ్మివేయకుండా, 25, 50 ఏళ్ళ లీజ్‌కు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకునేలా విధివిధానాలు ప్రభుత్వ శాఖలు రూపొందించాలి. వీళ్ళు చేస్తే, వ్యవసాయం అక్కడ లాభసాటి ఎలా అవుతోందో స్టడీ చేసి, వివరించాలి. ఇది వ్యవసాయం కాదు కాని, బ్లాక్ మనీ దాచుకునే పద్ధతి అయివుంటుంది. ఆదాయం మీద ఇంకం టాక్స్, భూమి శిస్తు చట్టాల్లో తగు మార్పులు చేసి ముక్కుపిండి ప్రభుత్వం వసూలు చేయాలి.
Posted by Sudhakar on ఆగస్ట్ 26, 2012 at 10:44 ఉద.
మంచి ఆలోచన. భారత దేశం లో ఈ విషయాల నన్నింటినీ , పరిశీలించి , పరిష్కారాలు కనుక్కోవడానికి ఒక విస్తృతమైన వ్యవస్థ ఇప్పటికే ఉంది. కానీ చాలా అస్తవ్యస్తం గా ఉంది. ఆ ప్రాంత ఎం ఎల్ ఏ లూ , ఎం పీ లూ కేవలం అసెంబ్లీ కూ , పార్లమెంటు కూ పరిమితమై పోయిన ‘ సంఖ్య లు ‘ గా నే ఉండి పోవడం , చాలా విచార కర పరిణామం.