”లైఫ్‌బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందీ” పాట నాలుగు దశాబ్దాల క్రితం వరకూ రేడియోలో మారుమోగుతుండేది. హిందూస్తాన్ లివర్స్ సంస్థ ఉత్పత్తి లైఫ్‌బాయ్ సబ్బుకు సంబంధించిన ప్రకటన ఇది. లైఫ్‌బాయ్ సబ్బు వాడకపోతే ఆరోగ్యం కల్ల అన్న భావన అత్యధికుల్లో ఈ ప్రకటన కల్పించింది ఆనాడు. దీన్ని ఎర్రసబ్బు అని పిలిచేవాళ్లు. ఆనాడు పట్టణాల్లో ఏమోగానీ పల్లెల్లో మాత్రం ఈ సబ్బు తప్ప మరొకటి దొరికేది కాదు. 1960 మొదలు దశాబ్ద కాలం వరకూ పావలా నుంచి నలభై పైసలదాకా ఈ సబ్బు ధర ఉండేదని గుర్తు. అయితే కర్నాటక ప్రభుత్వం మైసూర్ శాండిల్ పేరుతో తయారు చేసే ఉత్పత్తి కూడా కాస్త పెద్ద గ్రామాల్లో దొరుకుతుండేది. లైఫ్‌బాయ్ సబ్బుతో పోలిస్తే దీని ఖరీదు రెండు మూడు రెట్లు ఎక్కువ. ముప్పావలా నుంచి రూపాయిదాకా ఉండేదని జ్ఞాపకం. అందువలన దాన్ని డబ్బులున్నవాళ్లు మాత్రమే కొనేవాళ్లు. ఆనాటి కాలేజీ కుర్రోళ్లు కూడా కొంటుండేవాళ్లు. దీని వాసన కమ్మగా మల్లెపూలలా ఘుమాయించేది.
ఇక ఇప్పటి సంగతికొస్తే ఇది బుల్లితెర ఆదేశిత రాజ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఈ బుల్లిపెట్టె ఎవర్నీ వదిలిపెట్టని సంగతి అందరికీ స్వీయానుభవమే కదా. ఈ ఇంటి దెయ్యప్పెట్టె ప్రకటనల పుణ్యమా అని హిందూస్తాన్ లివర్స్ వారి లైఫ్‌బాయ్ సబ్బు కొనమని మనస్సు గోలపెట్టటంతో ఆదివారంనాడు హైదరాబాదు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బిగ్‌బజార్ సందర్శించక తప్పలేదు. మూడు సబ్బులున్న పెట్టె ఖరీదు రూ. 130. అదే విడిగా కొంటే ఒక్కొక్క సబ్బు రూ. 45.
సరే, మళ్లీ ఆ… పాత మధురాలు కాసిన్ని గుర్తు చేయనీయండి!
లైఫ్‌బాయ్ సబ్బుబిళ్ల ఖరీదు పావలా అని చెప్పాను కదూ. అయితే అప్పట్లో ఒక్కొక్క కుటుంబం మొత్తం కొనుగోలే పావలా కూడా ఉండేది కాదు. అర్ధణా (మూడు పైసలు) చొప్పున నూనె, ఎండు మిర్చి, బెల్లం, చింతపండు తదితర సరకుల్ని కొనుక్కునేవాళ్లు. పలు వస్తువులు పైసా (చాక్లెట్లు, బలపం) రెండు పైసలు, మూడు పైసలు (అర్ధణా) ఖరీదే ఉండేవి. అందుకని పావలా ఖరీదు ఉండే వస్తువుల్ని మొత్తం కొనేవాళ్లు కాదు. ఉదాహరణకు సబ్బును నాలుగు ముక్కలు చేసి ఒక్కొక్కదానిని పది పైసలకు కోమట్లు అమ్మేవాళ్లు. దీనివలన వాళ్లకు పావలాకు బదులు నలభై పైసలు వచ్చేది. అంటే పదిహేను పైసలు అదనపు లాభం అన్నమాట. హిందూస్తాన్ లివర్స్ వాళ్లదే సన్‌లైట్ అని లేత పసుపు రంగులో బట్టల సబ్బు ఉండేది. దాన్ని కూడా పేద కుటుంబాలు ముక్కల రూపాన ఐదు పైసలకో, పది పైసలకో కొనేవాళ్లు.
ఈ సంస్థ తమ సరుకును అమ్ముకునేందుకుగాను తొలినుంచీ అబద్ధాల ప్రకటనలు జారీ చేస్తూనూ ఉంది. లైఫ్‌బాయ్‌తో ఆరోగ్యాన్ని కలగలిపిన ఈ సంస్థ సినీ నటులంతా తమ లక్స్ సబ్బును వాడుతున్నారంటూ తర్వాతి కాలంలో సొమ్ము చేసుకుంది. అంతెందుకు రెండేళ్ల క్రితం తమ లక్స్ శాండల్ సబ్బును అమ్ముకునేందుకుగాను పెద్ద మోసానికి పాల్పడింది. ఈ సబ్బులో బంగారు నాణాలను పొదిగామంటూ ప్రచారం చేసింది. కోట్ల టన్నుల సబ్బును అమ్ముకుంది. జనం దానికి అలవాటు పడగానే రూ. 13 సబ్బును ఇప్పుడు 32 రూపాయలకు పెంచి అంటగడుతోంది.
కొన్ని రకాల సూక్ష్మజీవులను చంపేదుకుగాను సబ్బు (ఖరీదుతో, వాసనతో సంబంధం లేని ఏదో ఇక బ్రాండు) అవసరమేగానీ, అదే సర్వరోగ నివారిణి కాదని ప్రజా వైద్యులు అంటున్నారు.
హిందూస్తాన్ (దేశవాళి పేరుతో ముసుగేసుకున్న విదేశీ సంస్థ)కు మోసాలు అలవాటు. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు విడుదల చేసిన లైఫ్‌బాయ్ పనితనం కూడా అనుమానమే. అరుదయిన చెట్టు బెరడు నుంచి తీసిన పదార్ధంతో దీనిని తయారు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నది. దీన్ని వాడితే పలు చర్మరోగాలు మటుమాయమేనట. సబ్బుకే ఆ శక్తి ఉంటే, హిందూస్తాన్ ప్రకటనలే నిజమయితే ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల మంది చర్మవ్యాధుల నిపుణులు ఉండేవారా? కోట్లాది రూపాయల విలువయిన చర్మరోగ నివారిణులు అమ్ముడుపోయేవా??
26 ఆగ
Posted by K Rajendra Prasad on ఆగస్ట్ 26, 2012 at 3:07 సా.
ఔను నిజమేనండి ఒక్క లైఫ్ బాయె కాదు వాణిజ్య ప్రకటనలతొ ప్రజలను మోసం చేస్తున్న కంపెనీలు చాలనే వున్నయి.
Posted by చిలమకూరు విజయమోహన్ on ఆగస్ట్ 26, 2012 at 11:40 సా.
ఈ వ్యాపార ప్రకటనలు ఎలా ఉంటాయంటే ..ఒక ఉదా. అదేదో షాంపూ ప్రకటనలో ఇరుక్కున్న లారీని లాగడానికి మూరెడు జుట్టుతో ఓ అమ్మడొస్తుంది మూరెడు జుట్టుతో లారీకి ఎలా కడతారో అర్థం కాదు మనకు
Posted by Snkr on ఆగస్ట్ 27, 2012 at 12:29 ఉద.
ముఖ, దేహ సౌందర్యానికి, పరిమాళానికి మైసూర్ శాండల్, మట్టి పిసికిన కాళ్ళు,చేతులకు లైఫ్‌బాయ్ సిపార్సు చేయబడేది.
చవకైన లైఫ్‌బాయ్‌లో వుండే phenol ప్రభావవంతమైన, disinfectant, అని మా కెమిస్ట్రీ మాస్టారు చెప్పేవారు. అంచేత, నే చెప్పేదేమంటే “చర్మరోగ నివారిణి లైఫ్‌బాయ్ వాడండి” డింగ్! డింగ్!! :))