Archive for ఆగస్ట్ 27th, 2012

దేశీయ కంపెనీలను చిదిమేస్తున్నాయి

Image

 

బహుళ జాతి కంపెనీలు ప్రవేశించిన ప్రతి చోటా దేశీయ కంపెనీలను చిదిమేసినట్లుగానే భారత్‌లోనూ చిదిమేస్తున్నాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే వంటి కంపెనీలు ఈహవాలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఏరంగంలో వేలు పెడితే ఆరంగంలోని దేశీయ కంపెనీ కన్నా ఈ బహుళ జాతి కంపెనీలే అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఔషధాలు, ఆటోమొబైల్‌ ఉపకరణాలు, కేపిటల్‌ గూడ్స్‌ తదితర రంగాల్లో బహుళ జాతి కంపెనీల జోరుతో దేశీయ కంపెనీల వ్యాపారాలు పడిపోయి డీలాపడుతున్నాయి. గడచిన మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యంతాధునిక సాంకేతికత, ఉత్పత్తి, బ్రాండ్‌ ఈక్విటీలతో మార్కెట్‌ను అవి కబళిస్తున్నాయి. ఈ క్రమంలో హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే, కాల్గేట్‌-పామోలివ్‌లు వరుసగా 95శాతం, 110శాతం, 150శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇదే సమయంలో డాబర్‌, గోద్రెజ్‌ లాంటి దేశీయ కంపెనీల లాభాలు కుదించుకుపోతున్నాయి. ఔషధ రంగంలో బాగా పేరున్న సిప్ల, సన్‌ఫార్మా లాంటి పెద్ద కంపెనీలను జిఎస్‌కె ఫార్మా, అబోట్‌ ఇండియాలాంటి బహుళ జాతి కంపెనీలు అధిగమించాయి. గత మూడేళ్ల పెట్టుబడులకుగాను దేశీయ కంపెనీలు 25శాతం లాభాలను చవి చూడగా బహుళజాతి కంపెనీల లాభదాయకత 41శాతంగా నమోదైంది.

బహుళ జాతి కంపెనీల పనితీరును అంచనా కట్టే సిఎన్‌ఎక్స్‌ ఎంఎన్‌సి నిఫ్టీ తన అంచనాల్లో భారతీయ కంపెనీలు 19శాతం ఆదాయాలను పొందగా అదే కాలంలో బహుళ జాతి కంపెనీలు 45శాతం లాభాలను ఆర్జించాయి. బ్రాండ్‌ ఈక్విటీ బలంగా ఉండటం, పోటీకి సాటిరాని సాంకేతికతతో తయారైన ఉత్పత్తులు, ఆదాయాలు నిలకడగా కొనసాగడం, ఆస్థి అప్పుల పట్టీల స్థిరత్వం బహుళజాతి కంపెనీలజోరుకు ముఖ్య కారణంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు. అనేక విభాగాల్లో స్పష్టమైన నాయకత్వ సామర్ధ్యంతో పోటీని అధిగమించి విదేశీ కంపెనీలు దూసుకుపోగలుగుతున్నాయని కెఆర్‌ చోస్కీ దళారీ సంస్థలో సీనియరు విశ్లేషకుడు హర్దీప్‌షా అన్నారు. ఎన్నో ఏళు ్లగా ప్రపంచ మంతటా పాతుకుపోయిన ఎంఎన్‌సిల బ్రాండ్‌ ఈక్విటి పోటీనీ ఎదుర్కోవడం భారతీయ కంపెనీలకు కష్ట సాధ్యమవుతోందన్నారు. జాకీ బలమైన బ్రాండ్‌ ఇమేజి పేజ్‌ ఇండిస్టీస్‌కు బాగా ఉపయోపడటమే ఇందుకు చక్కని ఉదాహరణ.

దేశీయ విఐపి బ్రాండ్‌ తయారీదారు మాక్స్‌వెల్‌ ఇండిస్టీస్‌ను అధిగమించి జాకీ విక్రయాలు 38శాతం పెరిగాయి. కేవలం వినియోగదారుని కేంద్రంగా చేసుకుని వ్యాపార వ్యూహాలు నడపడం వల్లనే ఎంఎన్‌సిలకు ఇది సాధ్యం కాలేదని చెప్పాలి. ఆటోమేటివ్‌ ఉపకరణాల సరఫరాదారు బోష్‌ దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడే సత్తా ప్రపంచంలో మరే ఇతర కంపెనీకి లేదనే అభిప్రాయం ఒకటివుంది. దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలనబడే ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రోలతో పోల్చితే ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పది శాతం అదనంగా లాభాలను దండుకుంటోంది. కేపిటల్‌ గూడ్స్‌ రంగంలో దేశీయ దిగ్గజం గ్రీవ్స్‌కాటన్‌ను కమిన్స్‌ ఇండియా అధిగమించేసింది. ఆటోమొబైల్‌ రంగంలో భారత దిగ్గజాలు టాటా మోటార్‌, మహీంద్ర 0.9 శాతం ఈక్విటీ నిష్పత్తిలో రుణాలు వుండగా మారుతి సుజుకికి పైసా రుణ భారం లేకపోవడం గమనార్హం. పాదరక్షల రంగంలో బాటా ఇండియాకు అప్పులు లేవు. అదే ఇతర పాదరక్షల కంపెనీలు రిలాక్సో ఫుట్‌వేర్‌, లిబర్టీషూస్‌ సుమారు 0.9 శాతం నంచి 1.4 ఈక్విటీ నిష్పత్తిలో రుణాలున్నాయి. డివిడెండ్ల చెల్లింపుల్లోనూ కాస్ట్రోల్‌, కాల్గేట్‌, నెస్లే, బోష్‌లు అత్యధికంగా డివిడెండ్‌ చెల్లిస్తున్నాయి. ఇందులో కాస్ట్రోల్‌ గత సంవత్సరం తన ఆదాయంలో 88 శాతం మేర డివిడెండ్‌ వాటాదారులకు చెల్లించించడం విశేషం.

టీవీ – 9 పక్క చూపులు


ప్రపంచంలో బోలెడు బోలెడు సమస్యలు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా పరిష్కారం కాక ఈతి బాధలు. నాలుగేళ్లుగా ప్రపంచాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం – ఇప్పుడు కరువు. అమెరికా, జపాను, చైనా తదితర దేశాల్లో తుపాన్లు, వరదలు. వీటన్నింటి ఫలితంగా లక్షల సంఖ్యలో ఊడిపోతున్న ఉద్యోగాలు. ఆ కారణంగా కోపతాపాలు… తుపాకి కాల్పులు. అసలు వాళ్లు కాకుండా అమాయకులు బలి.
ఇక దేశం సంగతి సరేసరి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని రాసి నేలమీద పరిస్తే ఆమడ దూరానికి ఒక్క అంగుళం కూడా తక్కువగా ఉండదు.
– రెస్పిరేటర్లు తదితర కనీస అవసరాలు లేక ఆసుపత్రుల్లో పిట్టల్లా రాలిపోతోన్న పసికందులు.
– ప్రాణం పోతే దానికి బాధ్యతంతా వైద్యులదేనన్నట్లుగా వారిపై బాధితుల దాడులు.
– దోమల విజృంభణ … జ్వరాలతో మంచం పట్టిన గ్రామాలు, గిరిజన గూడేలు.
– కరువు, అరకొరగా సాగు.
– కనీసం మూడు గంటల మొదలు 15 గంటలదాకా రోజూ విద్యుత్తు కోత.
– బీటీ పత్తిని ఆవరించిన లద్దె పురుగు
– దొరకని ఎరువులు, చేతబడని రుణాలు, కాలుతోన్న మోటార్లు, తప్పని విద్యుదాఘాతాలు.
– ఆకాశాన్నంటుతోన్న నిత్యావసరాలు ా బియ్యం రూ. 40, సెనగపప్పు రూ. 100, కందిపప్పు రూ. 80, అరటి కాయలు రూ. 40, ఆపిలు రూ. 30.
– ఫీజు చెల్లింపు వ్యవహారంలో అయోమయం.
– ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఉంటుందో ఊడుతుందో తెలీని దుస్థితి. ఫలితంగా రాష్ట్రంలో అసలు పాలన ఉందో? లేదో?? ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి
అయితే గియితే ….
ఈ సమస్యల్ని పైపైన తడుముతోన్న మీడియా ా దేనికీ కొరగాని విషయాను చర్చించేందుకు మాత్రం గంటలకు గంటల మేర సమయాన్ని ఖూనీ చేస్తోంది.
అందులోనూ టీవీ – 9 దే అగ్రస్థానం.
ఆదివారంనాడు ప్రసారమవుతుండగా మధ్యలో కొద్దిసేపు చూసి, పూర్తిగా చూడలేక మధ్యలోనే కట్టేసిన ఓ కార్యక్రమం ఈ రాతకు స్ఫూర్తి.
పాండవుల పద్మవ్యూహానికి సంబంధించిన కార్యక్రమం ఇది.
హర్యానా రాష్ట్రంలో మనుషులు సాధారణంగా పోలేని కొండలు కోనల్లో ఉన్న పాండవుల పద్మవ్యూహ శిల్పం శిథిలమవుతున్నా దేశం పట్టించుకోవటం లేదట!
అది ఘోరం ! నేరం!! అంటూ నాటకీయ వ్యాఖ్యానాలు.
సమర్పించిన టీవీ యాజమాన్యం మాటేమోగానీ ఈ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసిన దీప్తీ వాజ్‌పేయి మాత్రం తెగ తెగ బాధపడిపోయింది. వాయిస్‌ ఓవరీశుడు కూడా గొప్పగా నటించాడు లెండి.
విషయానికొస్తే భారత యుద్ధానికి ముందు కాలంలో పాండవులు ఇక్కడ చేరి శిక్షణ పొందారట. అందులోనూ పద్మవ్యూహం పన్ని కౌరవుల్ని దుంపనాశనం చేసే లక్ష్యంతో రోజూ తెగ కష్టపడిపోయారట. శిక్షణ కోసం పద్మవ్యూహాన్ని కొండ శిలను చెక్కి రూపమిచ్చారట. వేల సంవత్సరాలు గడిచినా పాండవులు చెక్కించిన ఆ శిల్పం నిలిచి ఉండటం అద్భుతమట. అయితే ఆ శిల రూపం కోల్పోతున్నా దేశానికి ఏ మాత్రం పట్టకపోవటం క్షంతవ్యం కాదట. ఇలా ఇలా సాగింది. టీవీ – 9 కన్నీటి గాథ.
ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజలు అనుభవిస్తోన్న ఈతి బాధలు ఏమిటో? దానికి కారణం ఏమిటో? పరిష్కారానికి మార్గం ఏమిటో? చెప్పి ఉంటే….
ఔషద సంస్థలు, సెజ్‌ల యజమాని చేతిలో ఉన్న ఓ టీవీ ఛానలు ద్వారా నా కోరిక నెరవేరాలని కోరుకోవటం అతేనేమో!
అందులోనూ ఈ ఛానలు ఓ కార్పొరేట్‌ మీడియా సంస్థ చేతిలోకి పోయిందనీ, పోనున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అందువలన నా కోరిక తీరే అవకాశం లేనేలేదు.
అన్నట్లు
ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన గురజాడ వారి వ్యాఖ్యలతో నా స్పందనను ముగిస్తాను.
”ఈ దేశంలో పాండవులు నివశించని గుహలూ లేవు – సీతమ్మ తానమాడని మడుగులూ లేవు”

ఈ ప్రశ్నలకు బదుళ్లేవి???
అన్నట్లు అన్నేళ్లూ పద్మవ్యూహ రచనలో కష్టపడి కూడా పాండవులు తీరా యుద్ధంలో ఎందుకని దానిని ఉపయోగించుకోలేదు?
పాండవులంతా శిక్షణ పొందితే, మరి కృష్ణార్జునలకు మాత్రమే పద్మవ్యూహ రహస్యాలు తెలియటం ఏమిటి?
ఏ శిక్షణా  లేకుండానే కౌరవులు పద్మవ్యూహాన్ని పన్నగా, పాండవులు ఏమీ చేయలేకపోవటం ఎందుకని?