నా పనిలో వెసులుబాటు దొరకటంతో బ్లాగ్రాతల్ని వారం క్రితం తిరిగి ప్రారంభించిన నేను నా మిత్రుల కోసం మరో పథకానికి కూడా శ్రీకారం చుట్టాను. అదే పొట్టి సమాచార చేరవేత (ఎస్‌ఎంఎస్) పథకం. అంటే ఏమీ లేదండీ, నేను చెప్పదలచుకున్న సమాచారాన్ని నా మిత్రులకు ప్రతిరోజూ ఉదయమే సెల్‌ఫోను ద్వారా పంపుతున్నాను,
ఈ పథకం అనుకున్నప్పుడు రోజూ కనీసం 400 మందికి సమాచారం పంపాలని అనుకున్నాను. అయితే అసోం అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం సెల్ పొట్టి సమాచారాలపై పరిమితి విధించినందున ప్రస్తుతం కేవలం 40 మందికి మాత్రమే నా సందేశం చేరుతోంది.
పథకం లక్ష్యం ఇదీ
– నాకు తెలిసిన సమాచారాన్ని నలుగురికీ పంచాలి.
– ఆ సమాచారాన్ని ఏ విధంగా స్వీకరించాలో వారిష్టం
– రోజూ నాలుగు వందలమందిని పలకరించేందుకు వీలు కలుగుతున్నది.
– నా సందేశం వెళ్లగానే కొందరు తిరిగి వారు పంపదలచుకున్న సందేశాన్ని నాతో పంచుకుంటున్నారు.
– మరికొందరు నేరుగా ముచ్చట్లాడుతున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిచెడ్డలు తెలిసొచ్చాక
దీనిని విస్తరించాలన్న ఆలోచన ఉంది. అదేమంటే నా సందేశాన్ని అందుకున్న మిత్రులు, వారి మిత్రులలో కొందరికి దానిని పంపాలి. అలా ఒక మంచి సందేశం కొన్ని వేల మందికి చేరాలన్న తాపత్రయం దీన్లో ఉంది. అయితే నా మిత్రులు కొందరు మరి కొందరికి కూడా సందేశం పంపాలంటూ వారి నంబర్లను నాకే పంపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి విస్తరణకు అవకాశం లేదుమరి.అన్నట్లు ఈ సందేశాలను తెంగ్లీషులో పంపుతున్నాను.
ఒకటో సందేశం
మీకు తెలుసా!
ప్రభుత్వం ఇచ్చే తప్పుడు లెక్కల ప్రకారమే దేశంలో ఏటా 18 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
శుభోదయం
రెండో సందేశం
1960 ప్రాంతంలో విదేశీ సంస్థ హిందూస్తాన్ లివర్స్‌కు చెందిన లైఫ్‌బాయ్ సబ్బు పావలాకు అమ్మేవాళ్లు. అయితే నాలుగు ముక్కలుగా కోసి ఒక్కొక్క దానిని పది పైసల చొప్పున గ్రామాల్లో విక్రయించేవాళ్లు. ఆ సబ్బు ఖరీదు ఇప్పుడు రూ. 45 పలుకుతోంది. అంటే అర్థ శతాబ్దంలో 180 రెట్లు అధికంగా లైఫ్‌బాయ్ సబ్బు ధర పెరిగింది. అంతమేర ఎంతమంది గ్రామీణుల ఆదాయాలు పెరిగాయి?
మూడో సందేశం
చదువులమ్మ ఒడి
మనదేశంలో బడిలో చేరుతోన్న ప్రతి 100 మంది పిల్లల్లో 65 మంది ఐదో తరగతిలోనే మానుకుంటున్నారు. మిగిలిన 35 మందిలో 10 మంది మాత్రమే ఎనిమిదో తరగతిదాకా చేరుతున్నారు. పదో తరగతి లోపే మరొక ఐదుగురు మానుకుంటున్నారు. అంటే కేవలం చదువుకునే వయస్సు పిల్లల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే పదో తరగతి దాకా చేరగలుగుతున్నారు.
గుడ్ మార్నింగ్ ఎవ్వరిబడీ.