Archive for ఆగస్ట్ 29th, 2012

దీపావళి కల్లా బంగారం ధర రూ.32వేలు

దీపావళి కల్లా 10 గ్రాముల బంగారం ధర రూ.32,000కు చేరుకునే అవకాశాలున్నాయని బాంబే బులియన్‌ అసోసియేషన్‌ (బిబిఎ) తెలిపింది. దక్షిణాసియాలో నెలకొన్న డిమాండ్‌, పెట్టుబడులకు బంగారం ఉత్తమ మార్గం కావడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్‌లో బంగారం ధర పెద్ద ఎత్తున పెరుగుతుందని, భారత్‌, చైనాలు కూడా అదే మార్గంలో ఉన్నాయని బిబిఎ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పృత్వీరాజ్‌ కొథారి అన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ద్రవ్యసమీక్ష్లలో ఆర్‌బిఐ ఆర్థిక పునఃర్జీవానికి చర్యలు తీసుకుంటుందని, దీంతో దీపావళి కల్లా బంగారం ధర పెరుగుతుందని పేర్కొన్నారు

పాల కల్తీ.. నియంత్రణ

పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తున్నాం. కానీ, భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ 2011లో జరిపిన సర్వేలో దాదాపు 70 శాతం పాల నమూనాల్లో కల్తీ జరిగిందని గుర్తించింది. ఏడు రాష్ట్రాల్లో నూరు శాతం, మరో తొమ్మిది రాష్ట్రాల్లో 80 శాతం పైగా నమూనాల్లో కల్తీ జరిగింది. మన రాష్ట్రంలో ఇది 6.7 శాతం మాత్రమే. ఒక్క గోవా, పాండిచ్ఛేరిల నమూనాల్లో కల్తీ గుర్తించబడలేదు. ఇంత పెద్దమొత్తంలో జరుగుతున్న పాల కల్తీ ఆందోళన కలిగిస్తోంది. కల్తీకి వాడే కొన్నిపదార్థాలు ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఇదీ ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా కల్తీ నివారణకోసం ఏర్పర్చిన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది.

మన దేశంలో ఆహారభద్రత ప్రమాణాలను 2006లో ఏర్పర్చిన ‘భారత ఆహారభద్రత, ప్రమాణాల చట్టం’ నిర్దేశిస్తుంది. ఈ చట్టం ద్వారా భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ ఢిల్లీలో ఏర్పాటైంది. మనదేశ ఆహార ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా పెంచడం దీని లక్ష్యం.

పాలల్లో అత్యధికంగా (46.8 శాతం నమూనాలు) నీటితో కల్తీ అవుతున్నాయి. దీనివల్ల పాల పోషకవిలువలు తగ్గిపోతాయి. ఇలాంటి కల్తీలో పరిశుభ్రమైన నీటిని వాడకపోతే సూక్ష్మజీవులు, ఇతర కాలుష్యాలు చేరే అవకాశం ఉంది. ఇవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మరో 44.7 శాతం మేర వెన్నతీసిన పాలపొడిని (స్కిమ్‌ పాలపొడి) కలిపినట్లు గుర్తించబడింది. అంటే, కల్తీ పాలల్లో 91 శాతం పైగా నీరు, స్కిం పాలపొడి కలపడం ద్వారా అవుతుందన్న మాట!

నీరు కలిపినప్పుడు పాలు పలుచగా కనిపించకుండా గ్లూకోజ్‌ లేక యూరియా లేక పిండిపదార్థాలు (స్టార్చ్‌) ను కలుపుతున్నారు.

డిటర్జెంట్‌ పౌడర్‌తో కల్తీ 8.4 శాతం పాల నమూనాల్లో గుర్తించబడింది. పాల సేకరణలో వినియోగించిన పాత్రలు శుభ్రంగా కడగకపోవడం లేక కృత్రిమ పాలను అసలుపాలల్లో కలిపినందువల్ల ఈ కల్తీ కనిపిస్తుంది.

నాణ్యతా లోపం అవకాశాలు..

సామాన్యంగా చిన్న ఉత్పత్తిదారుల స్థాయిలో కల్తీ జరగదు. ఒకవేళ జరిగినా వీరు నీటినీ కలుపుతారు. దీనిని తేలికగా లాక్టోమీటరుతో గుర్తిస్తారు. ఇలాంటి కల్తీ ఆరోగ్యానికి అంతగా హానికరం కాదు.

ఉత్పత్తిదారుని స్థాయిలో పాలు తీసేప్పుడు, తీసిన తర్వాత పశువుల పొదుగు సరిగ్గా కడగకపోయినా, దాని చర్మ ఆరోగ్యం బాగోకపోయినా, పాలుతీసే పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, పాలు తీసి నిల్వ వుంచే పాత్రలు శుభ్రంగా ఉంచకపోయినా, పాలు తీసేవారు వ్యక్తిగతంగా శుభ్రంగా లేకపోయినా, దాణా నాణ్యత, క్రిమి కీటకాదులు పాలను కలుషితం చేస్తాయి. పాల సేకరణ కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత, పాలను సేకరించే పరికరాల పరిశుభ్రత, పాలు పితకడం, సేకరణ కేంద్రానికి సరఫరాచేసే మధ్య కాలం, పరీక్షించేటప్పుడు, ఇతర పదార్థాలు వున్నప్పుడు, రోగకారక పశువుల నుండి పాలను సేకరించినప్పుడు, కృత్రిమ పాలను సేకరించినప్పుడు, ఉదయం, సాయంత్రం పాలను వేర్వేరుగా ఉంచలేనప్పుడు పాల నాణ్యత లోపిస్తుంది. కలుషితమవుతాయి.

పాల రవాణా సమయంలో వాహనం ట్యాంకు శుభ్రంగా లేకున్నా, ఉష్ణోగ్రత ఎక్కువగా వున్నా, పాలశుద్ధి పరిశ్రమ నిల్వ చేసే ట్యాంకు (సైలోలోకి) ల్లోకి సేకరించి తెచ్చిన పాలను పోసేటప్పుడు జాగ్రత్తలు పాటించకున్నా వీటి నాణ్యత లోపిస్తుంది.

నియంత్రణ..

వ్యవస్థీకరించిన పాల సరఫరాలో నాణ్యతా నియంత్రణకు పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. ఉదా: ‘విజయ’ సహకార పాల సరఫరా వ్యవస్థలో రోజుకు 4.65 లక్ష లీటర్లను సేకరించి, హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. వీటిలో కేవలం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌లలో రోజుకు 3.8 లక్షల లీటర్లను అమ్ముతున్నారు. అయితే, మండల స్థాయిలో సేకరించిన పాలను నిల్వ వుంచి, రవాణా చేయడానికి 203 ‘బల్క్‌ కూలింగ్‌’ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇలాంటి ప్రతి కేంద్రానికి 25 గ్రామాలను అనుసంధానం చేశారు. ఇటువంటి అన్ని కేంద్రాల్లో ఆటోమాటిక్‌ ‘పాల పరీక్షా యంత్రం’ ఏర్పాటు చేశారు. వీటితో పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్షిస్తారు. గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో కూడా ఇలాంటి యంత్రాలనే ఏర్పాటు చేశారు. వాటితో కూడా సేకరించే పాల నాణ్యతను అక్కడికక్కడే పరీక్ష చేస్తారు. ఇలాంటివి 1109 గ్రామ పాలసేకరణ కేంద్రాల్లో ఉన్నాయి. ఈ యంత్రం ఖరీదు సుమారు రూ.30 వేలు ఉంటుంది. అన్ని ప్రైవేటు పాల సరఫరా కంపెనీల్లో ఈ విధంగా పటిష్టమైన నాణ్యతా నియంత్రణ ఉంటుందని చెప్పలేం.

పరిశుభ్రమైన పాల ఉత్పత్తి..

నాణ్యతా నియంత్రణకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి కీలకం. దీనికోసం పాడి పశువులను శుభ్రమైన ప్రదేశాల్లోనే కట్టి ఉంచాలి. ఆరోగ్యవంతమైన పాడి పశువుల నుండి మాత్రమే పాలను సేకరించాలి. పొదుగు వాపు మొదలగు వ్యాధులు సోకిన పశువుల నుండి పాలను తీయరాదు. ఇట్టి పాలను ఇతర ఆరోగ్యవంతమైన పశువుల పాలతో కలపకూడదు. పాలు తీసేముందు పాడి పశువు పొదుగును ఒక్క శాతం పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణం (లీటరు నీటికి అరచెంచా పొటాషియం పర్మాంగనేట్‌ కలిపిన ద్రావణం) తో కడగాలి. తలవెంట్రుకలు పాలల్లో కలవకుండా జాగ్రత్త పడాలి. పరిశుభ్రంగా కడిగిన పాత్రలోనే పాలను పితకాలి. పాత్రలను క్లోరిన్‌ ద్రావణంతో (200 పిపిఎమ్‌) మొదట శుభ్రంగా కడగాలి. ఈ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి ఒక చెంచా బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి, తయారుచేయవచ్చు. ఈ పాత్రలపై దుమ్మూ, ధూళి, క్రిమికీటకాలు పడకుండా ఎప్పుడూ మూతలు పెట్టి ఉంచాలి.

జున్ను పాలను మామూలు పాలతో కలపరాదు. ఈనిన 15 రోజుల తర్వాత మాత్రమే తీసినపాలను కేంద్రాల్లో పోయాలి. నిల్వ వున్న పాలను అప్పుడే తీసిన పాల తో కలపకూడదు. పాలు తీసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా కేంద్రాలకు చేర్చాలి.

(ఆంధ్రప్రదేశ్‌ సహకార డైరీ డెవలప్‌మెంటు సమాఖ్య మేనేజర్‌ మధుసూధనరావు, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి హెచ్‌.కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగా…)

కృత్రిమ పాలు..

పైకి చూడటానికి ఇవి అసలు పాలలాగానే కనిపిస్తాయి. కానీ, పాలల్లో వుండే ఏదీ దీనిలో వుండదు. చారెడు చక్కెర, దోసెడు యూరియా, పావులీటరు మంచినూనె, అరలీటరు అసలు పాలు, కొంత సర్ఫ్‌ మిశ్రమాన్ని 20 లీటర్ల మంచినీళ్లలో కలిపి కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. వీటికి ఏవిధమైన వాసనా వుండదు. వేరుగా ఉంటే, వీటిని గుర్తించడం తేలిక. అసలు పాలల్లో కలిపితే మాత్రం గుర్తించాలంటే పరీక్షల్లో తేలాల్సిందే.

అయితే, కల్తీ పాలకు ‘ఈ పాలు’ భిన్నమైనవి. కల్తీ పాలల్లో అసలు పాలు ఎక్కువగా వుంటాయి. కల్తీ వస్తువులు తక్కువగా వుంటాయి. కానీ, కృత్రిమ పాలల్లో వుండే ఏ పదార్థమూ దీనిలో వుండదు.

తాజాగా వున్నప్పుడు కృత్రిమ పాలు సబ్బు వాసనను కలిగి వుంటాయి. నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చల్లబరిస్తే ఏ వాసనా ఉండవు. రుచికి ఇవి చాలా ‘చేదు’గా వుంటాయి. వీటిని అసలు తాగలేం. సాంద్రత మామూలు పాలల్లాగానే వుంటుంది. నిల్వ వుంచితే పసుపురంగుకు మారతాయి. వేడిచేసినప్పుడు ఇవి సబ్బు వాసనతో పసుపురంగులోకి మారతాయి. గది ఉష్ణోగ్రతలో నిల్వ వుంచి నప్పుడు కూడా ఇవి పసుపురంగులోకి మారతాయి. వేళ్లను దీనిలో ముంచినప్పుడు సబ్బును తాకినట్లు అన్పిస్తుంది. ఉదజని సూచిక (పిహెచ్‌) అతిక్షార గుణం (10.5) తో ఉంటాయి. పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందిస్తాయి. వీటికి విరుద్ధంగా మామూలు పాలు ఆమ్లగుణం లేక తటస్థస్థాయిలో పిహెచ్‌ 6..4 నుండి 6.8గా వుంటూ పంచదార, తటస్థీకరణ పరీక్షలకు స్పందించవు.

కృత్రిమ పాలల్లోని కొవ్వు (కలిపే నూనె) క్యాన్సర్‌ను కలిగించగలదంట. డిటర్జెంట్‌ వల్ల కడుపులో తిప్పినట్లవుతుంది. విరోచనాలు అవుతాయి. దీనిలో కలిపే యూరియా, ఒక మోస్తరు విషపదార్థంగా పనిచేస్తుంది. తటస్థీకరణ పదార్థాల వల్ల (ఆమ్ల, క్షారాలు) కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.

ఈ కల్తీ పాలు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో బాగా తయారవుతున్నాయి. కానీ, ఇటీవల మన రాష్ట్రంలోనూ తయారుచేస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి పాల సేకరణ కేంద్రాల ద్వారా ‘సరఫరా’ వ్యవస్థలోకి చేరుతున్నాయి. అందువల్ల, ఈ కల్తీ నివారణకు అన్ని సేకరణ కేంద్రాలలో కచ్ఛితమైన నిఘా ఏర్పాటుచేయాలి.

రాష్ట్రంలో..

మొత్తం 120.08 లక్షల టన్నుల పాల ఉత్ప త్తితో 2011-12లో జాతీయంగా మూడోస్థానంలో రాష్ట్రం కొనసాగుతుంది. ఇంతకుముందు 2008-09లో 95.7లక్షల టన్నుల పాల ఉత్పత్తిలో రెండోస్థానంలోనే ఉండేది.

ఉత్పత్తవుతున్న పాలల్లో సుమారు మూడోవంతు గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా వినియోగ మవుతుంది. మిగతావి సుమారు 80 లక్షల టన్నులు వ్యవస్థీ కృతంగా చిన్న, పెద్ద పట్టణాల్లో అమ్ముతున్నారు. అయితే, దీనిలో కేవలం, 20 లక్షల టన్నుల పాలు మాత్రమే సహకారవ్యవస్థ ద్వారా అందుతున్నాయి. మిగతావి ప్రయివేటు శుద్ధి కంపెనీల నుండి, అమ్మకందార్ల (వెండర్ల) ద్వారా అమ్ముడుపోతున్నాయి. పాలను తేలికగా కల్తీ చేయగలగటంతో పాల కల్తీ నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఇప్పుడున్న వ్యవస్థను పటిష్టపరచాలి. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ను రాష్ట్ర ఆహారభద్రత కమిషనర్‌గా ప్రకటించారు. ఏ కంపెనీ అమ్మే పాలల్లోనైనా కల్తీ జరుగుతుందని అనుమానం కలిగితే దాని గురించి ఆ కంపెనీ దృష్టికి తీసుకొచ్చినా నివారణ చర్యలు తీసుకోకపోతే, ఆహారభద్రతా కమిషనర్‌, నారాయణగూడ, హైదరాబాద్‌కు తెలియజేయాలి. వీరి టెలిఫోన్‌ నెంబర్ల (040-27560191, 27552203) కు ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలోని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను ఆహారభద్రతా అధికారులుగా ప్రభుత్వం ప్రకటిం చింది. పాలు కల్తీ అవుతున్నట్లు అనుమానం వచ్చినప్పుడు, సమీప ‘ఆహారభద్రతా అధికారి’ దృష్టికి తీసికెళ్లాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో విజయ డైరీ వారు పాలను మహిళా స్వయంసహాయక గ్రూపుల ద్వారా సేకరిస్తున్నారు.

* హైదరాబాద్‌లోని విజయడైరీ వారు ‘ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం’ సహకారంతో డైరీ టెక్నాలజీలో ఒక డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ డిప్లొమాను విశ్వవిద్యాలయం ఇస్తుంది.

 జాగ్రత్తలు..

* కాచిన తర్వాతే తాగాలి.

* ప్యాకెట్‌ పాలు క్షేమం. వీటి పాల నాణ్యతపై నియంత్రణ ఉంటుంది.

* విడిగా అమ్మే పాలను కొనకూడదు. వీటి నాణ్యతపై ఏ నియంత్రణా ఉండదు.

* ప్యాకెట్‌పై సూచించిన గడువులోనే వాడాలి.

* ఫ్రిజ్‌లో ఎక్కువకాలం నిల్వ వుంచకూడదు.

* అనుమానం వచ్చినప్పుడు విజయ పాల విషయంలో 27019851- ఎక్స్‌టెన్షన్‌ – 224 / 260కు ఫిర్యాదు చేయాలి. మిగతా కంపెనీల పాలప్యాకెట్లపై కూడా ఇలాంటి నెంబరు వుంటుంది. ఆయా నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

శుద్ధి కర్మాగారంలో పరీక్షలు..

* ముడిపాలు రాగానే దాని వాసన, రుచిని చూస్తారు. పాలు సామాన్యంగా, రుచిగా వుండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల కన్నా తక్కువగా ఉండాలి. తటస్థీకరణ పదార్థాలు, కల్తీ పదార్థాలు ఉండకూడదు. ఆ తర్వాత ప్యాశ్చరైజేషన్‌ చేస్తారు.

* శుద్ధి తర్వాత, ప్యాకింగ్‌కు ముందు కూడా రుచి మామూలుగానే ఉండాలి. ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోనే ఉండాలి. ఆమ్ల శాతం 0.13 నుండి 0.14 శాతం మధ్య ఉండాలి. ఉష్ణ స్థిరత్వం 0.5 మి.లీ. నెగటివ్‌ ఉండాలి. ఫాస్ఫేటిక్‌ పరీక్ష నెగటివ్‌గా ఉండాలి. మిథిలిన్‌ బ్లూ రిడక్షన్‌ టెస్ట్‌ (ఎంబిఆర్‌టి) కనీసం ఐదుగంటల వరకూ రంగు కోల్పోకూడదు. గ్రేడ్‌ ప్రకారం కొవ్వు, కొవ్వుకాని కరిగిన ఘనపదార్థాలు (చక్కెరలాంటివి) ఉండాలి. బ్యాక్టీరియా ఉండకూడదు. పరీక్ష చేస్తారు. ‘ప్లేటు’ గణింపు (ప్లేట్‌ కౌంట్‌) లో ఒక మిల్లీలీటరు పాలకు 30 వేలకు మించకూడదు. అదేవిధంగా వీటిలో కోలీఫార్మ్‌ మిల్లీలీటర్‌కు పదికి మించకూడదు.

మొక్కతో కాన్సర్‌ నివారణ..! – డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

మనదేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ లభించే ఒక మొక్కతో కాన్సర్‌ను అరికట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ‘వర్జిన్‌ మాంటిల్‌’ అనే మొక్క కాన్సర్‌ కణాలను ఏకంగా చంపేస్తుందట! ఈ మొక్క ఆకులతో చేసిన టీని బ్రెస్ట్‌ కాన్సర్‌ ఉన్న మహిళలు సేవించడం గ్రామీణ పాకిస్తాన్‌లో మామూలే. ఆ మొక్కలోని పదార్థాలు కేవలం ఐదు గంటలలో కాన్సర్‌ కణాలను నిలువరించడమే కాకుండా 24 గంటలలో వాటిని చంపగలవని పరిశోధనల్లో గుర్తించారు. విశేషమేమిటంటే, కీమోథెరిపీ (మందుతో చేసే చికిత్స) లాగా ఇది మామూలు కణాలకు ఎటువంటి హానీ చేయదు. ఆఫ్రికా, యూరప్‌లో కొన్ని ప్రదేశాలలో కూడా కనిపించే ఈ దివ్య ఔషధమొక్కల శాస్త్రీయ నామం ‘ఫాగోనియా క్రేతికా’.

రక్తం లేకుండా మధుమేహ పరీక్ష..! – డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

ఇకపై మధుమేహ పరీక్షలకి రక్తాన్నే ఇవ్వనక్కర్లేదట! దీనికి వీలుగా పరిశోధకుడు అనురాగ్‌ కుమార్‌ ప్రస్తుతం పర్డ్యూ యూనివర్శిటీలో పరిశోధన చేస్తూ ఒక కొత్త ‘బయో సెన్సార్‌’ని రూపొందించాడు. దీనిద్వారా లాలాజలం, మూత్రం, చివరికి కన్నీళ్లలో కూడా సూక్ష్మస్థాయిలో ఉన్న గ్లూకోజ్‌ మోతాదుని కనుక్కోవచ్చట. శరీరంలో గ్లూకోజ్‌ మోతాదుని అంచనా వేయడానికి ఇప్పటివరకు రక్తాన్నే తీయాల్సి వస్తుంది. ఈ పరికరం గ్రాఫ్‌ను ఆధారం చేసుకుని పనిచేస్తుం దట. అతి సూక్ష్మ మోతాదులో కూడా గ్లూకోజ్‌ను అది పసిగడు తుందట! ఒక పేషంట్‌ కన్నీటి చుక్కను పరీక్షించి అతనికి మధు మేహం ఉందో లేదో తెలుసుకోవడం మంచి వెసులుబాటే కదా!

మూఢనమ్మకాలు – కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక

జ్యోతిష్యం గురించి పరిశీలిద్దాం..

ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన ‘నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?’ అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపిం చాను. ఆ వ్యాస రచయిత ఎమ్‌.టెక్‌; ఎమ్‌.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. ‘నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందరిలా బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగమూ ఉంది. దాచుకున్న డబ్బుంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడం లేదు.’ అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకంగల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?

 మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చెప్తాను. విను.

(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)

కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.

(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)

వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడు తుంటే, స్థానిక ఆర్‌.ఎమ్‌.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.

(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)

చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.

(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)

మంత్రాలకు చింతకాయలు రాలతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.

(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.

(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)

ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.

(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)

సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.

(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని ఈ వార్త..

ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను ‘మనమిద్దరం క్రితం జన్మలో భార్యా భర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!’ అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు’ అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్‌ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్‌ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.

కిషన్‌! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాలతో ఎన్ని నష్టాలున్నాయో తెలుసు కున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకే మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?’ అని ముగించాను.

‘అర్థమైంది అంకుల్‌!’ అంటూ కిషన్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

అమ్మ పలుకు – చరిత్రనూ, భవితనూ పట్టిచూపిన ‘తెలుగు వెలుగు’


రామోజీ విజ్ఞాన కేంద్రం నుంచి వెలువడిన ‘తెలుగు వెలుగు’ మాసపత్రిక తొలి పత్రికను తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న విడుదల చేయటం దాని లక్ష్యాన్ని పట్టిచూపుతోంది.
బ్రహ్మాండంగా ఉంటుందని ఊహించుకున్నందునేమోగానీ పత్రిక ఆశించినమేర ఆకట్టుకోలేక పోయింది. అయితే బాగుందనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి తెలుగు భాషాభివద్ధికి దిశానిర్ధేశం చేస్తుందన్న నమ్మకం కుదిరింది.
తెలుగు తొలి అక్షరం ‘అ’ చుట్టూతా వెలుగులు నింపి, రంగవల్లులు అద్ది ముఖచిత్రంగా ముద్రించటం ముదావహం.
తెలుగు వెలుగు కోసం … అంటూ రామోజీరావు సంతకంతో తొలి పేజీలో సాక్షాత్కరించిన సంపాదకీయంలో తాము చేయదలచుకున్నది చెబుతూనే తెలుగువాళ్లందరూ ఈ బృహత్‌ యజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరటం ఆహ్వానించదగినది. అయితే ఈనాడు తొలిపేజీలో ఆయనే రాసిన సంపాదకీయంలో వచ్చిన కొన్ని విషయాలు దీన్లో లేకపోవటం లోటుగా భావించాలి. పిల్లల కోసం పత్రిక, పుస్తకాలు త్వరలో రానున్నాయని దాన్లో వివరించారు. వెబ్‌సైట్‌ కూడా త్వరలో మనముందుకు రానున్నదన్న విషయం సంతోషదాయకం.
తెలుగదేలయన్న అంటూ సినారే సమీక్షకు పెద్ద పీట వేయటం సరైనదే. తెలుగు భాషను కాపాడుకునేందుకు పాఠశాలల్లో అమ్మ భాషను నిర్బంధం చేయాలన్న ఆయన చేసిన సూచనను వెంటనే అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయటం తెలుగువారందరు ముఖ్యమైన కార్యక్రమంగా స్వీకరించాలన్నది నా కోరిక. ”నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది” అన్న ఆంగ్ల కవి ఈట్స్‌ మాటల్ని సినారే గుర్తుచేయటం బాగుంది.
అమ్మ భాషల విషయంలో గాంధీజీ అభిప్రాయాలను బాపూ బోధను విని ఉంటే! శీర్షిక బోధపరిచింది.
రాచపాళెం ‘కాలానికి ముందుమాట గురజాడ బాట’ వ్యాసం అప్పారావు రచనలన్నింటినీ చదివించేందుకు పురికొల్పుతున్నది.
వ్యంగ్య చిత్ర సంపాదకుడు శ్రీధర్‌ రచన పరభాషా పరాయణత్వం … తెలుగు పదాల వేట కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించింది.
”తెలుగు నేర్చుకుంటే నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి” అంటూ ‘పోటీకి రాని తెలుగు’లో ద్వానా శాస్త్రి సశాస్త్రీయ విషయాలను బహుచక్కగా పొందుపరిచారు. పోటీ పరీక్షలలో తెలుగు వినియోగం ఎలా ఉండాలో అనుభవపూర్వక సూచనలు చేశారు.
వేటూరి ‘తెలుగువాడా కళ్లు తెరు” అంటూ చేసిన ఆదేశాన్ని మనమంతా వినాలి.
”అమ్మ భాష కాదుకానీ … (తనకు) అన్నం పెట్టిన భాష” తెలుగును తెగ మెచ్చుకున్నారు చలనచిత్ర నటుడు ప్రకాష్‌రాజ్‌.
ప్రధానోపాధ్యాయుడు కొమ్మోజు శ్రీధర్‌ రాసిన మన భాష పద్యాలను పాడించి అందరికీ విన్పించేవాళ్లు ఎవ్వరో ముందుకు రావాలి!
పెద్దాపురంలో తరచూ కన్పించే ఫ్రాన్సీయుడు నెజర్స్‌ సంగతులు చదివితేనన్నా మన జాతికి సిగ్గు వస్తుందేమో? చూడాలి. మన భాష దుస్థితిపై ఆయన విశ్లేషణ స్వీకరించాల్సిందే.
ఒక్క అక్షరంతోనే గొప్ప భావాలు పలికించే గొప్పదనం తెలుగులో ఉందంటూ అయ్యగారి శ్రీనివాసరావు గుర్తుచేశారు.
భాషా బోధకుల బాధల్ని రవిచంద్రకుమార్‌ చక్కగా పరిచారు.
రాజకీయ ఒత్తిడితో తెలుగు భాషను  రక్షించుకోవలసిన ఆవశ్యకతను మండలి బుద్ధప్రసాద్‌ వివరించారు.
గురువు చలువ శీర్షికతో ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక వ్యాసంలో గురువు చిత్రాన్ని నల్లగా తీర్చిదిద్దిన వైనం నేటి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
రవిశంకర్‌ తనదైన శైలిని కొంత పక్కనబెట్టి ప్రధానంగా ఈనాడు పద్ధతుల్లో అలంకరించిన 100 పత్రాల ఈ పత్రిక 20 రూపాయలకే అందించటం విశేషమే.
అన్నట్లు పత్రికతోపాటు అందించిన ‘వైకుంఠపాళి’ ఆట వరకూ అయితే పర్వాలేదుగానీ వివరణతో నేను విబేధిస్తున్నాను. ఎందుకంటే అసురులు ద్రావిడులు. అంటే భూమి పుత్రులు. అలాంటి సారాయి తాగని వారిని తుచ్చులుగా అభివర్ణించటం పుక్కిటి పురాణాలను వల్లెవేస్తూ ఉపాధి పొందే గరికపాటి నరసింహారావు లాంటివారికి తగునేమోగానీ, ద్రావిడం నుంచి పుట్టిన తెలుగును సశాస్త్రీయంగా పాఠకులకు అందించేందుకు ప్రారంభమయిన తెలుగువెలుగుకు అవసరం లేదేమో!
నిజమైన చరిత్ర తెలిసిన తెలుగువాళ్లెవ్వరూ అసురులను తప్పుపట్టటాన్ని ఆమోదిస్తారని అనుకోను. ముందు ముందు ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా తెలుగువెలుగు ప్రచురణకర్తలు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశించటంలో తప్పులేదనుకుంటాను.

నేటి పొట్టి సమాచారం (ఎస్సెమ్మెస్‌) ఇదిగో


నేడు తెలుగు భాషాదినోత్సవం
తెలుగు వెలుగు గిడుగు 150వ జయంతోత్సవం
చదువు భాష మీ ఇష్టం
అమ్మ భాషకు వద్దు కష్టం
– శుభాకాంక్షలు
మీ కావూరి
స్పందన : గత నాలుగురోజులుగా నా నుంచి పొట్టి సమాచారాన్ని అందుకుంటోన్న నా మిత్రుడు జెట్టి వీరాంజనేయులు (పెద్దోడు) ఈ రోజు స్పందించారు. ఆయన ఓఎన్‌జీసీ (గుజరాత్‌)లో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. సందేశాలు చాలా బాగుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చాన్నాళ్ల తర్వాత చానా విషయాలు మాట్లాడుకుందామనుకుంటుండగానే, నా సెల్‌ శక్తి (బ్యాటరీ పవర్‌) కోల్పోయి తుస్సుమంది. అయినా మిత్రుడి నుంచి ప్రశంసలు అందుకున్నందుకు సంతోషం – సంతోషం