Archive for నవంబర్, 2012

మరో టీవీ – 420 (?!?!?!)


ఈ దేశం ఎటు పోతోందో ? !
భవితన్నది ఏమవుతుందో ? ? ! !
చూడబోతే ప్రస్తుతం టీవీ ఛానళ్ల పేరిట కొందరు దోపిడి ా దగాలకు తెర లేపుతున్నట్లు కన్పిస్తోంది. మైనారిటీ ఆర్థిక సహాయ సంస్థ సొమ్మును దోచుకుని ఏబీసీ పేరిట టీవీ నెలకొల్పే ప్రయత్నంలో పట్టుబడిన నీచ నికృష్టుల వ్యవహారం తెరమరుగు కాకముందే మరి కొందరు కొంచెం అటూ ఇటుగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆచూకీలు కనపడుతున్నాయి.
దినపత్రికల క్లాసిఫైడ్స్‌లో యాంకర్లు కావాలంటూ కనీసం రోజుకొక టీవీ ప్రకటనన్నా కన్పిస్తున్నది చూడండి. కనీసం సంస్థ పేరు కూడా అందులో ఉండదు. కేవలం సెల్‌ నంబరు ఇచ్చి సంప్రదించమంటున్నారు. న్యూస్‌ చానలు పెట్టాలంటే తక్కువలో తక్కువ రూ. 20 కోట్లయినా ఉండాలి. అంటే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన మగోడికి కనీసం ఒక డొక్కు కారయినా ఉండి తీరుతుంది. సొంత భవనం లేకపోతే పోనీ, అద్దెదయినా కార్పొరేట్‌ స్టెయిలు ఉండి తీరుతుంది. కాసింత మట్టూ మర్యాద తెలిసి, రాయటం, తీయటం తెలిసిన కొందరు సహచరుల్ని ముందే ఎంపిక చేసుకునిగానీ ఎవడయినా మిగతా సిబ్బంది కోసం ప్రకటన చేస్తాడు. అదీ రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ప్రకటన ఉంటుంది.
అయితే ప్రస్తుతం హైదరాబాదులో ప్రకటనల స్థాయిలో ఉన్న కొన్ని టీవీ ఛానళ్ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అందుకనే అనుమానం కలుగుతోంది. టీవీ – 420 అన్నది కూడా అందుకే. ఈ టీవీల కార్యాలయాలు నేడో రేపో కూలిపోతాయన్నట్లుగా గోచరిస్తోన్న భవనాల్లో ఉండటం పరిశీలనార్హం. అందులోనూ మరుగుదొడ్డి, స్నానాల గదుల మాదిరి గదుల్లో ఓ మేజా బల్ల, నాలుగు కుర్చీలు, కంప్యూటరు, ఓ సహాయకుడు అంతే. రంగుల జెరాక్స్‌లో తీయించిన ఒకటి రెండు పోస్టర్లు కూడా దర్శనమివ్వటం కద్దు.
ఇక ఇరుకిరుకు మేజా బల్ల వెనుక ఓ నక్కో, తోడేలో ఎవరొస్తారా? ఎప్పుడొస్తారా? నంజుకు తిందామన్నట్లుగా కాచుకుని ఉంటుంది. ఖర్మగాలి ఏ దినపత్రికలోనో ఉద్యోగం కోసం వెదుకుతూ వెదుకుతూ యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి ఉబలాటపడ్డ ఆడపిల్లలు కమ్మటి కలలు కంటూ వీళ్ల పాలిట పడుతున్నారు. గట్టి పిండాలయితే సరేగానీ, బలహీనతలున్న వారయితే అంతే చెల్లు. టీవీ ఎమ్డీలమంటూ ఫలకాలు కట్టుకున్న నక్కలకూ, తోడేళ్లకూ బలవ్వాల్సిందే.
నిజమైన కథ
అనగనగా కాదు … ప్రస్తుతమే. అదీ 29 నవంబరు 2012. ఉదయం నా మిత్రుడొకరు ఈనాడులో క్లాసిఫైడ్స్‌ చూశారా? అంటూ ఫోను చేశాడు. ”లేదు ా నేను.
న్యూస్‌ ఎడిటర్లు కావలంటూ రెండు టీవీ ఛానళ్ల ప్రకటనలు వచ్చాయి చూడండి అన్నాడు.
ఆ… నిజంగా ప్రారంభమయ్యే టీవీలయితే క్లాసిఫైడ్‌లో ప్రకటనలు ఇస్తాయా? అనుమానం వ్యక్తం చేశాను.
ఏ పుట్టలో ఏ పాము ఉందో? ఎవరు చూశారు గురువుగారూ! ఒక్కసారి ప్రయత్నించండి. అసలే ఖాళీగా ఉంటున్నారు. మిత్రుడి సలహా.
సరే, చూస్తాను అంటూ హామీ ఇవ్వటంతో మిత్రుడు సంతోషించాడు.
ఈనాడు క్లాసిఫైడ్స్‌ను పరికించి రెండు ప్రకటనల్నీ పట్టుకున్నాను. టపటపా ఫోన్లు కొట్టాను. మనకు దూరమయిన తెలుగు విస్లవ రచయిత పేరులో ఒక అక్షరాన్ని పెట్టుకున్న ఓ సంస్థ నుంచి ఓ ఆడ గొంతుక బదులు పలికి కొన్ని ప్రశ్నలు వేసిన తదుపరి, రెజ్యూమ్‌ పంపమంటూ మెయిల్‌ చిరునామా అందజేశారు. కొంతలో కొంత నయం.
ఇక రెండో ఛానలు వాడు. నేరుగా యజమానే బదులు పలికాడు. వెంటనే బయలుదేరి రమ్మంటూ చిరునామా పంపాడు.
సరేకదా పోయేదేముందని సదరు చిరునామాకు పోయాను.
బేగంపేట స్టాపర్స్‌స్టాప్‌ దగ్గరే ఉందది. శిథలావస్తకు చేరుతోన్న ఓ భవనం. కార్యాలయం జాడ చెబుతూనే పెద్ద మనిషి ఒకాయన నవ్వుకుంటుంటేనే నాకు అనుమానం వచ్చింది. పోయి చూద్దును కదా… ముస్తాబు చేసుకున్నా ముసలి వాసన కొడుతోన్న మూడు గదులు. అప్పటికే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఎదురు చూస్తున్నా, నాకే ముందు పిలుపు వచ్చింది. మేజా బల్ల ముందు నక్క … అహహ తోడేలు కూడా కావచ్చని అన్పించింది. మరో మాట పలుకు లేకుండానే ఓ క్లిప్పుంగుకి స్క్రిప్టు రాయమంటూ పురమాయించాడు. ఇరవై ఏళ్ల అనుభవజ్ఞుడికి పరీక్ష. కాదనలేక పాతబడిన కంప్యూటరు ముందు కూర్చోగానే ఆఫీసు సహాయకుడు వచ్చి, దాన్ని తెరిచాడు. ఏదో స్ధానిక నాయకులు పాల్గన్న శంకుస్థాపన కార్యక్రమం. గుసగుసల ఆడియో. అదీ ఉరుదు. నాకు పొట్ట కోస్తే ఒక్క ఉరుదూ పదమయినా అర్ధం కాదు కాబట్టి కదలికలను బట్టి చూస్తే అటుపో – ఇటు రా – జరగండి – జరగండి – పక్కకు తప్పుకోండి అని అనుకున్నాను. దీంతో దానికి స్క్రిప్టు ఎలా రాయాలో తెలియక అమాయకంగా పెట్టిన నా ముఖం చూసి నా పెన్ను తెగ నవ్వుకుందనుకోండి.
అక్కడ నుంచి లేచొచ్చి నక్క ముందు కూర్చుని చేతులేత్తేశాను. నాకు ఉరుదూ రాదని గొణిగాను.
ఉరుదూనా ఉరుదూ ఎక్కడుంది. మీరు మేఠావి అయితే కావచ్చుగానీ అలా మాట్లాడకండి. అంటూ ఉరిమాడు.
నేను మేథావిని కాదు. అందులోనూ ఉరుదో గిరుదో నాకు తెలియదు. అలాంటి ముక్కూ ముఖం, మొదలు చివర, గుర్తింపు లేని వాళ్లకు సంబంధించిన క్లిప్పింగుకు వార్త రాయగలిగిన సత్తా నాకు లేదు మహా ప్రభో అంటూ దండం పెట్టాను.
తోడేలుకు కోపం వచ్చింది. ఏదేదో వాగటం ప్రారంభించాడు.
నాకూ కోపం వచ్చింది…. అహా ఆపెహా, బోడి టీవీ ఒకటి పెడతావో? లేదో?గానీ తెగ నీలుగుతున్నావు. నువ్విచ్చిన క్లిప్పింగుకి వార్త రాయటం బుర్ర లేనోడు సంగతేమోగానీ, తలకాయ ఉన్నోడెవడూ చేయలేడు. నీ వ్యవహారం చూస్తుంటే ఏదో దొంగ పనుల కోసం కాచుకుకూర్చున్నట్లుంది. నిజంగా టీవీ ప్రారంభించేవాడెవడూ ఈ తీరున ఉండడు. ఈ చీకట్లి కొట్లో టీవీ పెడితే చూసేవాళ్లకు అసలు కళ్లు ఉంటాయా? ఊడతాయా? అంటూ అరిచేశాను. వాడు తెల్లబోయి చూస్తుండగా బయటకు వచ్చేశాను. బాయ్‌ లోపలికి పోయాడు. తోడేలు తెగ మొరగటం విన్నాను బూట్లు తొడుక్కుంటూ. అన్నట్లు దాని పేరు రెండును రెండుసార్లు విరిస్తే వస్తుంది.
మిత్రులారా! జాగ్రత్తహో… జాగ్రత్త.

నరుడు కాదు సింహుడే

నాకొక మిత్రుడు(?) ఉండేవాడు. అతగాడి పేరులో నరుడూ, సింహమూ కలిసుంది. ఆ! పేరులో ఏముంది … వాడు మనిషేననుకున్నాను. వాడి మాటలు నమ్మి మానవత్వం పుష్కలంగా ఉందనుకున్నాను. అయినదానికీ కానిదానికీ వాడికి అండదండలు ఇచ్చాను. వెంట నడిచాను. మద్దతిచ్చాను. జైకొట్టాను. ఇదంతా ఒక కోణం. మరో కోణం మరోలా ఉండటం వలనే ఈ రాతకు పూనిక అయింది మరి. నాకు ఓ పనిబడింది. పెద్దోళ్ల మాట సాయం అవసరం వచ్చింది. సరే, మిత్రుడు గుర్తుకొచ్చాడు. మాట సాయం చేయమని విన్నవించాను. అదెంత పని అన్నాడు. అంటే అతగాడు మాట సాయం చేస్తాడని గట్టిగా నమ్మాను. మానవుడి సహజ లక్షణమయిన మాట మాట్లాడుతాడనుకున్నాను. తీరా తన పేరులోని రెండో సగానికి అతగాడు పనిబెట్టాడు. సింహం వలె గాండ్రించాడు. గర్జించాడు. నాతో ఏమీ చెప్పకుండానే ఏదో చేయమని చెప్పినట్లు ఓ పెద్ద అబద్ధం చెప్పి ఎంచక్కా తప్పుకున్నాడు. వాస్తవానికి అర్హుడనే అయినా నా పని కాలేదు. సొంత శక్తినే నమ్ముకుని ఉంటే ఎలా? ఉండేదో!
ఔరా! సింహమా … బుద్ధి చూపించుకున్నావులే! నీ తప్పు ఏముంది? నా లాంటి వాళ్లంతా విడివిడిగా ఉన్నంత కాలం నీలాంటి వాళ్లకు తిరుగే ఉండదని మేము ఎప్పుడు గ్రహిస్తామో?కదా!

రోత రోత

 

విద్యుత్తు కోత – గ్యాసుకు కోత – సంక్షేమానికే కోత
నిత్యావసరాల ధరలేమో మోత – విదేశీ చిల్లర కొట్లకు ఖాతా
పంటల గిట్టుబాటుకు వాత – నేతల జాతా
జనం జీతాలు, జీవితాలు రోత రోత

తెలుగుదేశంలో ఆంగ్లం

ఆంగ్ల మాథ్యమంలో ఏడో తరగతి చదివే బంధువుల అమ్మాయి దీపావళి సెలవు సందర్భంగా మా ఇంటికి వచ్చింది. ఆమె రాసిన తెలుగు పదాల పట్టికను ఒక్కసారి పరికించండి. తెలుగుదేశంలో ఆంగ్లం జొరబడిన తీరును ఈ పట్టిక పట్టి చూపుతోంది. అంతే కాదు ఆంగ్ల పదాలను తెలుగులో రాసి అదే అమ్మ నుడి అని పలువురు భావిస్తున్నారు ఇప్పుడు. అదే ఇక్కడ కన్పించింది చూడండి. గుణింతంలో తప్పులు సరేసరి. (గోడల లోపల రా
సినవి సరైన అక్షరాలుగా గుర్తించగలరు)
కాకి – కన్ను – కమల్‌ – కమలిని – కమలం – కిటకి – కన్నీరు – క(కా)జా – కమ్యు(మ్యూ)నిటి – క్లాస్‌
మహి(హీ)ద(ధ)ర్‌ – మంజుల – మంచా(చ)ం – మామ(య్య)లు – మొ(మో)సాలు – మొ(మో)కాలు – మామ(య)బజార్‌ – మాంమ్‌(-)సాహారం – మజ్జిగా (గ)
టామ్‌ అండ్‌ జెర్రి – టమాట – టప(పా)కాయలు – టెంకాయ – టైట(టి)ల్‌ – టీచర్‌ – టాపిక్‌ – ట్రాఫిక్‌ – టి(టీ) మెంమ్‌(-)బర్స్‌ – టైమింగ్స్‌ – టికెట్‌ – టానిక్‌ – టిఫిన్‌ – టైటానిక్‌
ఇందుజ – ఇంద్రుడు – ఇంటిళ్లి(ల్లి)పాది – ఇల్లాలు – ఈజ్పెట్‌ (???) – ఈగలు – ఇనుము – ఇటి(టు)కలు – ఈనాడు – ఈరోజు – ఈలలు
పిరమిడ్‌ – పక్షలు – పంతులు – పరులు – పనిమనిషి – పిరికి – ప్రజలు – పొరిగిళ్లు – పజిల్‌ – పనులు – పిల్లులు