రక్తం లేకుండా మధుమేహ పరీక్ష..! – డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

ఇకపై మధుమేహ పరీక్షలకి రక్తాన్నే ఇవ్వనక్కర్లేదట! దీనికి వీలుగా పరిశోధకుడు అనురాగ్‌ కుమార్‌ ప్రస్తుతం పర్డ్యూ యూనివర్శిటీలో పరిశోధన చేస్తూ ఒక కొత్త ‘బయో సెన్సార్‌’ని రూపొందించాడు. దీనిద్వారా లాలాజలం, మూత్రం, చివరికి కన్నీళ్లలో కూడా సూక్ష్మస్థాయిలో ఉన్న గ్లూకోజ్‌ మోతాదుని కనుక్కోవచ్చట. శరీరంలో గ్లూకోజ్‌ మోతాదుని అంచనా వేయడానికి ఇప్పటివరకు రక్తాన్నే తీయాల్సి వస్తుంది. ఈ పరికరం గ్రాఫ్‌ను ఆధారం చేసుకుని పనిచేస్తుం దట. అతి సూక్ష్మ మోతాదులో కూడా గ్లూకోజ్‌ను అది పసిగడు తుందట! ఒక పేషంట్‌ కన్నీటి చుక్కను పరీక్షించి అతనికి మధు మేహం ఉందో లేదో తెలుసుకోవడం మంచి వెసులుబాటే కదా!

మూఢనమ్మకాలు – కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక

జ్యోతిష్యం గురించి పరిశీలిద్దాం..

ఆంధ్రజ్యోతి దినపత్రిక 13.4.2012 నాటి సంచికలో ప్రచురింపబడిన ‘నాకు పెళ్ళెప్పుడవుతుందో చెప్పరూ?’ అనే శీర్షికతో వచ్చిన ఒక వ్యాసాన్ని చూపిం చాను. ఆ వ్యాస రచయిత ఎమ్‌.టెక్‌; ఎమ్‌.బి.ఏ. చదివాడు. వయస్సు 36. అతనికి 26వ ఏటి నుంచి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా ఇంకా పెళ్ళికాలేదు. దానికి కారణం అతని మాటల్లోనే విందాం. ‘నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది. అందరిలా బతకాలని ఉంది. అలా బతకటానికి అవసరమైన ఉద్యోగమూ ఉంది. దాచుకున్న డబ్బుంది. అయినా నాకు జాతకాల వల్ల పెళ్ళి కావడం లేదు.’ అతని తండ్రి జాతకాలు చూస్తాడట. ఆయనకు తన పిల్లవాడికి సరిజోడీ జాతకంగల పిల్ల దొరకలేదట. అదీ అసలు విషయం. ఇలా జాతకాల పిచ్చివల్ల చదువూ, ఉద్యోగం ఉన్న ఎంతోమందికి పెళ్ళికావడం లేదు. ఇదంతా జ్యోతిష్యం అనే మూఢనమ్మకం వల్లనే గదా?

 మూఢ నమ్మకాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న అనేకమందికి సంబంధించిన వార్తలు ఇప్పుడు చెప్తాను. విను.

(1) గ్రామ దేవతకు తనయుడిని బలిచ్చిన తండ్రి (వార్త 23-11-1999)

కొడుకు వల్ల తమ కుటుంబానికి కీడు ఉందని నమ్మి, మూఢ విశ్వాసంతో కన్న కొడుకునే ఒక తండ్రి బలిచ్చాడట.

(2) మూఢనమ్మకానికి ఒకరి బలి (ఆంధ్రజ్యోతి 23-9-1994)

వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో బాధపడు తుంటే, స్థానిక ఆర్‌.ఎమ్‌.పి. డాక్టరు భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సలహా ఇచ్చినా, రోగి బంధువులు రోగిని భద్రాచలం తీసుకెళ్ళకుండా తమ గ్రామానికి తరలించి భూతవైద్యం చేయించగా పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు.

(3) మంత్రగాడనే నెపంతో హత్య (ఈనాడు 1-7-1996)

చేతబడి చేసి కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని చంపి శవాన్ని పాతిపెట్టిన సంఘటన గార్ల మండలం పుల్లూరులో జరిగింది.

(4) అమ్మాజీ ముసుగులో కోట్లు శఠగోపం (ప్రజాశక్తి 6-6-2008)

మంత్రాలకు చింతకాయలు రాలతాయంటూ ఓ మహిళ అమ్మాజీ పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు దండుకుంది.

(5) గుప్త నిధుల కోసం భర్త హత్య (సాక్షి 29-5-2009) గుప్త నిధులపై ఆశతో ఓ ఇల్లాలు భర్తనే హత్య చేసింది.

(6) వివాహితను కొట్టి చంపిన భూతవైద్యుడు (ఈనాడు 28/2/2002)

ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన ఒక వివాహితను దయ్యం వదిలించే నెపంతో భూతవైద్యుడు, అతని అనుచరులు తీవ్రంగా కొట్టగా ఆమె మరణించింది.

(7) వాస్తుపేరిట లక్షలు ఖర్చు చేస్తున్న సింగరేణి (ఈనాడు 12-3-1998)

సింగరేణిలో ఇటీవలి కాలంలో వాస్తుపేరిట గదుల కిటికీలను, తలుపులను, అవసరమైతే విలువైన కట్టడాలను సైతం కూల్చివేసి లక్షల రూపాయలను దుబారా చేస్తున్నారని పత్రికా వార్త తెలియజేస్తోంది.

(8) 16.2.2007 నాటి ప్రజాశక్తిలోని ఈ వార్త..

ఓ 29 ఏళ్ళ యువతి ఇల్లు కొనాలనుకుంది. తన జాతకం తీసుకొని ఓ పండితుడనే మోసగాడి దగ్గరకు వెళ్ళింది. అతను ‘మనమిద్దరం క్రితం జన్మలో భార్యా భర్తలం. నీవు ఆత్మహత్య చేసుకున్నావు. అందుకే ఇలా మనిద్దర్నీ ఆ దేవుడు కలిపాడు. నీ భర్తకు విడాకులిచ్చి నాతోరా!’ అన్నాడు. నా మాట వినకపోతే, నీవు పూర్తిగా నాశనమౌతావు’ అని భయపెట్టాడు. ఆమె అతని వల్ల గర్భవతి అయి అబార్షన్‌ చేయించుకుంది. ఇది ఎక్కడో పల్లెటూర్లో జరిగింది కాదు. వారిద్దరూ భారతీయులే. ఆమె తమిళ వనిత. లండన్‌లో జాబ్‌ చేస్తోంది. అతను లండన్‌లో ఒక గుడి పూజారి. ఈ సంఘటన లండన్‌లో జరిగింది.

కిషన్‌! బాగా చదువు, మంచి ఉద్యోగం ఉన్నా, మూఢనమ్మకాలతో ఎన్ని నష్టాలున్నాయో తెలుసు కున్నావు గదా? మూఢనమ్మకాలున్న వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇతరుల జీవితాలు నాశనం చేస్తాడు. లక్షలాది రూపాయల ధనం నాశనం చేసుకుంటాడు. ఇతరుల ధనం నాశనం చేస్తాడు. అందుకే మూఢనమ్మకాలకు సంబంధించి సైన్సు చెప్పే సమాధానాలను చదివి, అర్థంచేసుకుని, నీకూ, నీ సమాజానికీ మేలు చేకూరేట్లు నడుచుకోమని కోరాను. అర్థమైందా?’ అని ముగించాను.

‘అర్థమైంది అంకుల్‌!’ అంటూ కిషన్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

అమ్మ పలుకు – చరిత్రనూ, భవితనూ పట్టిచూపిన ‘తెలుగు వెలుగు’


రామోజీ విజ్ఞాన కేంద్రం నుంచి వెలువడిన ‘తెలుగు వెలుగు’ మాసపత్రిక తొలి పత్రికను తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న విడుదల చేయటం దాని లక్ష్యాన్ని పట్టిచూపుతోంది.
బ్రహ్మాండంగా ఉంటుందని ఊహించుకున్నందునేమోగానీ పత్రిక ఆశించినమేర ఆకట్టుకోలేక పోయింది. అయితే బాగుందనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి తెలుగు భాషాభివద్ధికి దిశానిర్ధేశం చేస్తుందన్న నమ్మకం కుదిరింది.
తెలుగు తొలి అక్షరం ‘అ’ చుట్టూతా వెలుగులు నింపి, రంగవల్లులు అద్ది ముఖచిత్రంగా ముద్రించటం ముదావహం.
తెలుగు వెలుగు కోసం … అంటూ రామోజీరావు సంతకంతో తొలి పేజీలో సాక్షాత్కరించిన సంపాదకీయంలో తాము చేయదలచుకున్నది చెబుతూనే తెలుగువాళ్లందరూ ఈ బృహత్‌ యజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరటం ఆహ్వానించదగినది. అయితే ఈనాడు తొలిపేజీలో ఆయనే రాసిన సంపాదకీయంలో వచ్చిన కొన్ని విషయాలు దీన్లో లేకపోవటం లోటుగా భావించాలి. పిల్లల కోసం పత్రిక, పుస్తకాలు త్వరలో రానున్నాయని దాన్లో వివరించారు. వెబ్‌సైట్‌ కూడా త్వరలో మనముందుకు రానున్నదన్న విషయం సంతోషదాయకం.
తెలుగదేలయన్న అంటూ సినారే సమీక్షకు పెద్ద పీట వేయటం సరైనదే. తెలుగు భాషను కాపాడుకునేందుకు పాఠశాలల్లో అమ్మ భాషను నిర్బంధం చేయాలన్న ఆయన చేసిన సూచనను వెంటనే అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయటం తెలుగువారందరు ముఖ్యమైన కార్యక్రమంగా స్వీకరించాలన్నది నా కోరిక. ”నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుంది” అన్న ఆంగ్ల కవి ఈట్స్‌ మాటల్ని సినారే గుర్తుచేయటం బాగుంది.
అమ్మ భాషల విషయంలో గాంధీజీ అభిప్రాయాలను బాపూ బోధను విని ఉంటే! శీర్షిక బోధపరిచింది.
రాచపాళెం ‘కాలానికి ముందుమాట గురజాడ బాట’ వ్యాసం అప్పారావు రచనలన్నింటినీ చదివించేందుకు పురికొల్పుతున్నది.
వ్యంగ్య చిత్ర సంపాదకుడు శ్రీధర్‌ రచన పరభాషా పరాయణత్వం … తెలుగు పదాల వేట కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించింది.
”తెలుగు నేర్చుకుంటే నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి” అంటూ ‘పోటీకి రాని తెలుగు’లో ద్వానా శాస్త్రి సశాస్త్రీయ విషయాలను బహుచక్కగా పొందుపరిచారు. పోటీ పరీక్షలలో తెలుగు వినియోగం ఎలా ఉండాలో అనుభవపూర్వక సూచనలు చేశారు.
వేటూరి ‘తెలుగువాడా కళ్లు తెరు” అంటూ చేసిన ఆదేశాన్ని మనమంతా వినాలి.
”అమ్మ భాష కాదుకానీ … (తనకు) అన్నం పెట్టిన భాష” తెలుగును తెగ మెచ్చుకున్నారు చలనచిత్ర నటుడు ప్రకాష్‌రాజ్‌.
ప్రధానోపాధ్యాయుడు కొమ్మోజు శ్రీధర్‌ రాసిన మన భాష పద్యాలను పాడించి అందరికీ విన్పించేవాళ్లు ఎవ్వరో ముందుకు రావాలి!
పెద్దాపురంలో తరచూ కన్పించే ఫ్రాన్సీయుడు నెజర్స్‌ సంగతులు చదివితేనన్నా మన జాతికి సిగ్గు వస్తుందేమో? చూడాలి. మన భాష దుస్థితిపై ఆయన విశ్లేషణ స్వీకరించాల్సిందే.
ఒక్క అక్షరంతోనే గొప్ప భావాలు పలికించే గొప్పదనం తెలుగులో ఉందంటూ అయ్యగారి శ్రీనివాసరావు గుర్తుచేశారు.
భాషా బోధకుల బాధల్ని రవిచంద్రకుమార్‌ చక్కగా పరిచారు.
రాజకీయ ఒత్తిడితో తెలుగు భాషను  రక్షించుకోవలసిన ఆవశ్యకతను మండలి బుద్ధప్రసాద్‌ వివరించారు.
గురువు చలువ శీర్షికతో ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక వ్యాసంలో గురువు చిత్రాన్ని నల్లగా తీర్చిదిద్దిన వైనం నేటి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
రవిశంకర్‌ తనదైన శైలిని కొంత పక్కనబెట్టి ప్రధానంగా ఈనాడు పద్ధతుల్లో అలంకరించిన 100 పత్రాల ఈ పత్రిక 20 రూపాయలకే అందించటం విశేషమే.
అన్నట్లు పత్రికతోపాటు అందించిన ‘వైకుంఠపాళి’ ఆట వరకూ అయితే పర్వాలేదుగానీ వివరణతో నేను విబేధిస్తున్నాను. ఎందుకంటే అసురులు ద్రావిడులు. అంటే భూమి పుత్రులు. అలాంటి సారాయి తాగని వారిని తుచ్చులుగా అభివర్ణించటం పుక్కిటి పురాణాలను వల్లెవేస్తూ ఉపాధి పొందే గరికపాటి నరసింహారావు లాంటివారికి తగునేమోగానీ, ద్రావిడం నుంచి పుట్టిన తెలుగును సశాస్త్రీయంగా పాఠకులకు అందించేందుకు ప్రారంభమయిన తెలుగువెలుగుకు అవసరం లేదేమో!
నిజమైన చరిత్ర తెలిసిన తెలుగువాళ్లెవ్వరూ అసురులను తప్పుపట్టటాన్ని ఆమోదిస్తారని అనుకోను. ముందు ముందు ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా తెలుగువెలుగు ప్రచురణకర్తలు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశించటంలో తప్పులేదనుకుంటాను.

నేటి పొట్టి సమాచారం (ఎస్సెమ్మెస్‌) ఇదిగో


నేడు తెలుగు భాషాదినోత్సవం
తెలుగు వెలుగు గిడుగు 150వ జయంతోత్సవం
చదువు భాష మీ ఇష్టం
అమ్మ భాషకు వద్దు కష్టం
– శుభాకాంక్షలు
మీ కావూరి
స్పందన : గత నాలుగురోజులుగా నా నుంచి పొట్టి సమాచారాన్ని అందుకుంటోన్న నా మిత్రుడు జెట్టి వీరాంజనేయులు (పెద్దోడు) ఈ రోజు స్పందించారు. ఆయన ఓఎన్‌జీసీ (గుజరాత్‌)లో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. సందేశాలు చాలా బాగుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చాన్నాళ్ల తర్వాత చానా విషయాలు మాట్లాడుకుందామనుకుంటుండగానే, నా సెల్‌ శక్తి (బ్యాటరీ పవర్‌) కోల్పోయి తుస్సుమంది. అయినా మిత్రుడి నుంచి ప్రశంసలు అందుకున్నందుకు సంతోషం – సంతోషం

పొట్టి సమాచార చేరవేత (ఎస్సెమ్మెస్‌) పథకాన్ని ప్రారంభించానహో!

నా పనిలో వెసులుబాటు దొరకటంతో బ్లాగ్రాతల్ని వారం క్రితం తిరిగి ప్రారంభించిన నేను నా మిత్రుల కోసం మరో పథకానికి కూడా శ్రీకారం చుట్టాను. అదే పొట్టి సమాచార చేరవేత (ఎస్‌ఎంఎస్‌) పథకం. అంటే ఏమీ లేదండీ, నేను చెప్పదలచుకున్న సమాచారాన్ని నా మిత్రులకు ప్రతిరోజూ ఉదయమే సెల్‌ఫోను ద్వారా పంపుతున్నాను,
ఈ పథకం అనుకున్నప్పుడు రోజూ కనీసం 400 మందికి సమాచారం పంపాలని అనుకున్నాను. అయితే అసోం అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం సెల్‌ పొట్టి సమాచారాలపై పరిమితి విధించినందున ప్రస్తుతం కేవలం 40 మందికి మాత్రమే నా సందేశం చేరుతోంది.
పథకం లక్ష్యం ఇదీ
– నాకు తెలిసిన సమాచారాన్ని నలుగురికీ పంచాలి.
– ఆ సమాచారాన్ని ఏ విధంగా స్వీకరించాలో వారిష్టం
– రోజూ నాలుగు వందలమందిని పలకరించేందుకు వీలు కలుగుతున్నది.
– నా సందేశం వెళ్లగానే కొందరు తిరిగి వారు పంపదలచుకున్న సందేశాన్ని నాతో పంచుకుంటున్నారు.
– మరికొందరు నేరుగా ముచ్చట్లాడుతున్నారు.

ఈ కార్యక్రమంలో మంచిచెడ్డలు తెలిసొచ్చాక
దీనిని విస్తరించాలన్న ఆలోచన ఉంది. అదేమంటే నా సందేశాన్ని అందుకున్న మిత్రులు, వారి మిత్రులలో కొందరికి దానిని పంపాలి. అలా ఒక మంచి సందేశం కొన్ని వేల మందికి చేరాలన్న  తాపత్రయం దీన్లో ఉంది. అయితే నా మిత్రులు కొందరు మరి కొందరికి కూడా సందేశం పంపాలంటూ వారి నంబర్లను నాకే పంపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి విస్తరణకు అవకాశం లేదుమరి.అన్నట్లు ఈ సందేశాలను తెంగ్లీషులో పంపుతున్నాను.
ఒకటో సందేశం
మీకు తెలుసా!
ప్రభుత్వం ఇచ్చే తప్పుడు లెక్కల ప్రకారమే దేశంలో ఏటా 18 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
శుభోదయం
రెండో సందేశం
1960 ప్రాంతంలో విదేశీ సంస్థ హిందూస్తాన్‌ లివర్స్‌కు చెందిన లైఫ్‌బాయ్‌ సబ్బు పావలాకు అమ్మేవాళ్లు. అయితే నాలుగు ముక్కలుగా కోసి ఒక్కొక్క దానిని పది పైసల చొప్పున గ్రామాల్లో విక్రయించేవాళ్లు. ఆ సబ్బు ఖరీదు ఇప్పుడు రూ. 45 పలుకుతోంది. అంటే అర్థ శతాబ్దంలో 180 రెట్లు అధికంగా లైఫ్‌బాయ్‌ సబ్బు ధర పెరిగింది. అంతమేర ఎంతమంది గ్రామీణుల ఆదాయాలు పెరిగాయి?
మూడో సందేశం
చదువులమ్మ ఒడి
మనదేశంలో బడిలో చేరుతోన్న ప్రతి 100 మంది పిల్లల్లో 65 మంది ఐదో తరగతిలోనే మానుకుంటున్నారు. మిగిలిన 35 మందిలో 10 మంది మాత్రమే ఎనిమిదో తరగతిదాకా చేరుతున్నారు. పదో తరగతి లోపే మరొక ఐదుగురు మానుకుంటున్నారు. అంటే కేవలం చదువుకునే వయస్సు పిల్లల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే పదో తరగతి దాకా చేరగలుగుతున్నారు.
గుడ్‌ మార్నింగ్‌ ఎవ్వరిబడీ.

దేశీయ కంపెనీలను చిదిమేస్తున్నాయి

Image

 

బహుళ జాతి కంపెనీలు ప్రవేశించిన ప్రతి చోటా దేశీయ కంపెనీలను చిదిమేసినట్లుగానే భారత్‌లోనూ చిదిమేస్తున్నాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే వంటి కంపెనీలు ఈహవాలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఏరంగంలో వేలు పెడితే ఆరంగంలోని దేశీయ కంపెనీ కన్నా ఈ బహుళ జాతి కంపెనీలే అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఔషధాలు, ఆటోమొబైల్‌ ఉపకరణాలు, కేపిటల్‌ గూడ్స్‌ తదితర రంగాల్లో బహుళ జాతి కంపెనీల జోరుతో దేశీయ కంపెనీల వ్యాపారాలు పడిపోయి డీలాపడుతున్నాయి. గడచిన మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యంతాధునిక సాంకేతికత, ఉత్పత్తి, బ్రాండ్‌ ఈక్విటీలతో మార్కెట్‌ను అవి కబళిస్తున్నాయి. ఈ క్రమంలో హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే, కాల్గేట్‌-పామోలివ్‌లు వరుసగా 95శాతం, 110శాతం, 150శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇదే సమయంలో డాబర్‌, గోద్రెజ్‌ లాంటి దేశీయ కంపెనీల లాభాలు కుదించుకుపోతున్నాయి. ఔషధ రంగంలో బాగా పేరున్న సిప్ల, సన్‌ఫార్మా లాంటి పెద్ద కంపెనీలను జిఎస్‌కె ఫార్మా, అబోట్‌ ఇండియాలాంటి బహుళ జాతి కంపెనీలు అధిగమించాయి. గత మూడేళ్ల పెట్టుబడులకుగాను దేశీయ కంపెనీలు 25శాతం లాభాలను చవి చూడగా బహుళజాతి కంపెనీల లాభదాయకత 41శాతంగా నమోదైంది.

బహుళ జాతి కంపెనీల పనితీరును అంచనా కట్టే సిఎన్‌ఎక్స్‌ ఎంఎన్‌సి నిఫ్టీ తన అంచనాల్లో భారతీయ కంపెనీలు 19శాతం ఆదాయాలను పొందగా అదే కాలంలో బహుళ జాతి కంపెనీలు 45శాతం లాభాలను ఆర్జించాయి. బ్రాండ్‌ ఈక్విటీ బలంగా ఉండటం, పోటీకి సాటిరాని సాంకేతికతతో తయారైన ఉత్పత్తులు, ఆదాయాలు నిలకడగా కొనసాగడం, ఆస్థి అప్పుల పట్టీల స్థిరత్వం బహుళజాతి కంపెనీలజోరుకు ముఖ్య కారణంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు. అనేక విభాగాల్లో స్పష్టమైన నాయకత్వ సామర్ధ్యంతో పోటీని అధిగమించి విదేశీ కంపెనీలు దూసుకుపోగలుగుతున్నాయని కెఆర్‌ చోస్కీ దళారీ సంస్థలో సీనియరు విశ్లేషకుడు హర్దీప్‌షా అన్నారు. ఎన్నో ఏళు ్లగా ప్రపంచ మంతటా పాతుకుపోయిన ఎంఎన్‌సిల బ్రాండ్‌ ఈక్విటి పోటీనీ ఎదుర్కోవడం భారతీయ కంపెనీలకు కష్ట సాధ్యమవుతోందన్నారు. జాకీ బలమైన బ్రాండ్‌ ఇమేజి పేజ్‌ ఇండిస్టీస్‌కు బాగా ఉపయోపడటమే ఇందుకు చక్కని ఉదాహరణ.

దేశీయ విఐపి బ్రాండ్‌ తయారీదారు మాక్స్‌వెల్‌ ఇండిస్టీస్‌ను అధిగమించి జాకీ విక్రయాలు 38శాతం పెరిగాయి. కేవలం వినియోగదారుని కేంద్రంగా చేసుకుని వ్యాపార వ్యూహాలు నడపడం వల్లనే ఎంఎన్‌సిలకు ఇది సాధ్యం కాలేదని చెప్పాలి. ఆటోమేటివ్‌ ఉపకరణాల సరఫరాదారు బోష్‌ దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడే సత్తా ప్రపంచంలో మరే ఇతర కంపెనీకి లేదనే అభిప్రాయం ఒకటివుంది. దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలనబడే ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రోలతో పోల్చితే ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పది శాతం అదనంగా లాభాలను దండుకుంటోంది. కేపిటల్‌ గూడ్స్‌ రంగంలో దేశీయ దిగ్గజం గ్రీవ్స్‌కాటన్‌ను కమిన్స్‌ ఇండియా అధిగమించేసింది. ఆటోమొబైల్‌ రంగంలో భారత దిగ్గజాలు టాటా మోటార్‌, మహీంద్ర 0.9 శాతం ఈక్విటీ నిష్పత్తిలో రుణాలు వుండగా మారుతి సుజుకికి పైసా రుణ భారం లేకపోవడం గమనార్హం. పాదరక్షల రంగంలో బాటా ఇండియాకు అప్పులు లేవు. అదే ఇతర పాదరక్షల కంపెనీలు రిలాక్సో ఫుట్‌వేర్‌, లిబర్టీషూస్‌ సుమారు 0.9 శాతం నంచి 1.4 ఈక్విటీ నిష్పత్తిలో రుణాలున్నాయి. డివిడెండ్ల చెల్లింపుల్లోనూ కాస్ట్రోల్‌, కాల్గేట్‌, నెస్లే, బోష్‌లు అత్యధికంగా డివిడెండ్‌ చెల్లిస్తున్నాయి. ఇందులో కాస్ట్రోల్‌ గత సంవత్సరం తన ఆదాయంలో 88 శాతం మేర డివిడెండ్‌ వాటాదారులకు చెల్లించించడం విశేషం.

టీవీ – 9 పక్క చూపులు


ప్రపంచంలో బోలెడు బోలెడు సమస్యలు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా పరిష్కారం కాక ఈతి బాధలు. నాలుగేళ్లుగా ప్రపంచాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం – ఇప్పుడు కరువు. అమెరికా, జపాను, చైనా తదితర దేశాల్లో తుపాన్లు, వరదలు. వీటన్నింటి ఫలితంగా లక్షల సంఖ్యలో ఊడిపోతున్న ఉద్యోగాలు. ఆ కారణంగా కోపతాపాలు… తుపాకి కాల్పులు. అసలు వాళ్లు కాకుండా అమాయకులు బలి.
ఇక దేశం సంగతి సరేసరి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని రాసి నేలమీద పరిస్తే ఆమడ దూరానికి ఒక్క అంగుళం కూడా తక్కువగా ఉండదు.
– రెస్పిరేటర్లు తదితర కనీస అవసరాలు లేక ఆసుపత్రుల్లో పిట్టల్లా రాలిపోతోన్న పసికందులు.
– ప్రాణం పోతే దానికి బాధ్యతంతా వైద్యులదేనన్నట్లుగా వారిపై బాధితుల దాడులు.
– దోమల విజృంభణ … జ్వరాలతో మంచం పట్టిన గ్రామాలు, గిరిజన గూడేలు.
– కరువు, అరకొరగా సాగు.
– కనీసం మూడు గంటల మొదలు 15 గంటలదాకా రోజూ విద్యుత్తు కోత.
– బీటీ పత్తిని ఆవరించిన లద్దె పురుగు
– దొరకని ఎరువులు, చేతబడని రుణాలు, కాలుతోన్న మోటార్లు, తప్పని విద్యుదాఘాతాలు.
– ఆకాశాన్నంటుతోన్న నిత్యావసరాలు ా బియ్యం రూ. 40, సెనగపప్పు రూ. 100, కందిపప్పు రూ. 80, అరటి కాయలు రూ. 40, ఆపిలు రూ. 30.
– ఫీజు చెల్లింపు వ్యవహారంలో అయోమయం.
– ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఉంటుందో ఊడుతుందో తెలీని దుస్థితి. ఫలితంగా రాష్ట్రంలో అసలు పాలన ఉందో? లేదో?? ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి
అయితే గియితే ….
ఈ సమస్యల్ని పైపైన తడుముతోన్న మీడియా ా దేనికీ కొరగాని విషయాను చర్చించేందుకు మాత్రం గంటలకు గంటల మేర సమయాన్ని ఖూనీ చేస్తోంది.
అందులోనూ టీవీ – 9 దే అగ్రస్థానం.
ఆదివారంనాడు ప్రసారమవుతుండగా మధ్యలో కొద్దిసేపు చూసి, పూర్తిగా చూడలేక మధ్యలోనే కట్టేసిన ఓ కార్యక్రమం ఈ రాతకు స్ఫూర్తి.
పాండవుల పద్మవ్యూహానికి సంబంధించిన కార్యక్రమం ఇది.
హర్యానా రాష్ట్రంలో మనుషులు సాధారణంగా పోలేని కొండలు కోనల్లో ఉన్న పాండవుల పద్మవ్యూహ శిల్పం శిథిలమవుతున్నా దేశం పట్టించుకోవటం లేదట!
అది ఘోరం ! నేరం!! అంటూ నాటకీయ వ్యాఖ్యానాలు.
సమర్పించిన టీవీ యాజమాన్యం మాటేమోగానీ ఈ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసిన దీప్తీ వాజ్‌పేయి మాత్రం తెగ తెగ బాధపడిపోయింది. వాయిస్‌ ఓవరీశుడు కూడా గొప్పగా నటించాడు లెండి.
విషయానికొస్తే భారత యుద్ధానికి ముందు కాలంలో పాండవులు ఇక్కడ చేరి శిక్షణ పొందారట. అందులోనూ పద్మవ్యూహం పన్ని కౌరవుల్ని దుంపనాశనం చేసే లక్ష్యంతో రోజూ తెగ కష్టపడిపోయారట. శిక్షణ కోసం పద్మవ్యూహాన్ని కొండ శిలను చెక్కి రూపమిచ్చారట. వేల సంవత్సరాలు గడిచినా పాండవులు చెక్కించిన ఆ శిల్పం నిలిచి ఉండటం అద్భుతమట. అయితే ఆ శిల రూపం కోల్పోతున్నా దేశానికి ఏ మాత్రం పట్టకపోవటం క్షంతవ్యం కాదట. ఇలా ఇలా సాగింది. టీవీ – 9 కన్నీటి గాథ.
ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజలు అనుభవిస్తోన్న ఈతి బాధలు ఏమిటో? దానికి కారణం ఏమిటో? పరిష్కారానికి మార్గం ఏమిటో? చెప్పి ఉంటే….
ఔషద సంస్థలు, సెజ్‌ల యజమాని చేతిలో ఉన్న ఓ టీవీ ఛానలు ద్వారా నా కోరిక నెరవేరాలని కోరుకోవటం అతేనేమో!
అందులోనూ ఈ ఛానలు ఓ కార్పొరేట్‌ మీడియా సంస్థ చేతిలోకి పోయిందనీ, పోనున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అందువలన నా కోరిక తీరే అవకాశం లేనేలేదు.
అన్నట్లు
ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన గురజాడ వారి వ్యాఖ్యలతో నా స్పందనను ముగిస్తాను.
”ఈ దేశంలో పాండవులు నివశించని గుహలూ లేవు – సీతమ్మ తానమాడని మడుగులూ లేవు”

ఈ ప్రశ్నలకు బదుళ్లేవి???
అన్నట్లు అన్నేళ్లూ పద్మవ్యూహ రచనలో కష్టపడి కూడా పాండవులు తీరా యుద్ధంలో ఎందుకని దానిని ఉపయోగించుకోలేదు?
పాండవులంతా శిక్షణ పొందితే, మరి కృష్ణార్జునలకు మాత్రమే పద్మవ్యూహ రహస్యాలు తెలియటం ఏమిటి?
ఏ శిక్షణా  లేకుండానే కౌరవులు పద్మవ్యూహాన్ని పన్నగా, పాండవులు ఏమీ చేయలేకపోవటం ఎందుకని?

లైఫ్‌బాయ్‌ ఎక్కడ ఉందో ఆ(నా)రోగ్యం అక్కడ ఉంది!


”లైఫ్‌బాయ్‌ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందీ” పాట నాలుగు దశాబ్దాల క్రితం వరకూ రేడియోలో మారుమోగుతుండేది. హిందూస్తాన్‌ లివర్స్‌ సంస్థ ఉత్పత్తి లైఫ్‌బాయ్‌ సబ్బుకు సంబంధించిన ప్రకటన ఇది. లైఫ్‌బాయ్‌ సబ్బు వాడకపోతే ఆరోగ్యం కల్ల అన్న భావన అత్యధికుల్లో ఈ ప్రకటన కల్పించింది ఆనాడు. దీన్ని ఎర్రసబ్బు అని పిలిచేవాళ్లు. ఆనాడు పట్టణాల్లో ఏమోగానీ పల్లెల్లో మాత్రం ఈ సబ్బు తప్ప మరొకటి దొరికేది కాదు. 1960 మొదలు దశాబ్ద కాలం వరకూ పావలా నుంచి నలభై పైసలదాకా ఈ సబ్బు ధర ఉండేదని గుర్తు. అయితే కర్నాటక ప్రభుత్వం మైసూర్‌ శాండిల్‌ పేరుతో తయారు చేసే ఉత్పత్తి కూడా కాస్త పెద్ద గ్రామాల్లో దొరుకుతుండేది. లైఫ్‌బాయ్‌ సబ్బుతో పోలిస్తే దీని ఖరీదు రెండు మూడు రెట్లు ఎక్కువ. ముప్పావలా నుంచి రూపాయిదాకా ఉండేదని జ్ఞాపకం. అందువలన దాన్ని డబ్బులున్నవాళ్లు మాత్రమే కొనేవాళ్లు. ఆనాటి కాలేజీ కుర్రోళ్లు కూడా కొంటుండేవాళ్లు. దీని వాసన కమ్మగా మల్లెపూలలా ఘుమాయించేది.
ఇక ఇప్పటి సంగతికొస్తే ఇది బుల్లితెర ఆదేశిత రాజ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఈ బుల్లిపెట్టె ఎవర్నీ వదిలిపెట్టని సంగతి అందరికీ స్వీయానుభవమే కదా. ఈ ఇంటి దెయ్యప్పెట్టె ప్రకటనల పుణ్యమా అని హిందూస్తాన్‌ లివర్స్‌ వారి లైఫ్‌బాయ్‌ సబ్బు కొనమని మనస్సు గోలపెట్టటంతో ఆదివారంనాడు హైదరాబాదు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బిగ్‌బజార్‌ సందర్శించక తప్పలేదు. మూడు సబ్బులున్న పెట్టె ఖరీదు రూ. 130. అదే విడిగా కొంటే ఒక్కొక్క సబ్బు రూ. 45.
సరే, మళ్లీ ఆ… పాత మధురాలు కాసిన్ని గుర్తు చేయనీయండి!
లైఫ్‌బాయ్‌ సబ్బుబిళ్ల ఖరీదు పావలా అని చెప్పాను కదూ. అయితే అప్పట్లో ఒక్కొక్క కుటుంబం మొత్తం కొనుగోలే పావలా కూడా ఉండేది కాదు. అర్ధణా (మూడు పైసలు) చొప్పున నూనె, ఎండు మిర్చి, బెల్లం, చింతపండు తదితర సరకుల్ని కొనుక్కునేవాళ్లు. పలు వస్తువులు పైసా (చాక్లెట్లు, బలపం) రెండు పైసలు, మూడు పైసలు (అర్ధణా) ఖరీదే ఉండేవి. అందుకని పావలా ఖరీదు ఉండే వస్తువుల్ని మొత్తం కొనేవాళ్లు కాదు. ఉదాహరణకు సబ్బును నాలుగు ముక్కలు చేసి ఒక్కొక్కదానిని పది పైసలకు కోమట్లు అమ్మేవాళ్లు. దీనివలన వాళ్లకు పావలాకు బదులు నలభై పైసలు వచ్చేది. అంటే పదిహేను పైసలు అదనపు లాభం అన్నమాట. హిందూస్తాన్‌ లివర్స్‌ వాళ్లదే సన్‌లైట్‌ అని లేత పసుపు రంగులో బట్టల సబ్బు ఉండేది. దాన్ని కూడా పేద కుటుంబాలు ముక్కల రూపాన ఐదు పైసలకో, పది పైసలకో కొనేవాళ్లు.
ఈ సంస్థ తమ సరుకును అమ్ముకునేందుకుగాను తొలినుంచీ అబద్ధాల ప్రకటనలు జారీ చేస్తూనూ ఉంది. లైఫ్‌బాయ్‌తో ఆరోగ్యాన్ని కలగలిపిన ఈ సంస్థ సినీ నటులంతా తమ లక్స్‌ సబ్బును వాడుతున్నారంటూ తర్వాతి కాలంలో సొమ్ము చేసుకుంది. అంతెందుకు రెండేళ్ల క్రితం తమ లక్స్‌ శాండల్‌ సబ్బును అమ్ముకునేందుకుగాను పెద్ద మోసానికి పాల్పడింది. ఈ సబ్బులో బంగారు నాణాలను పొదిగామంటూ ప్రచారం చేసింది. కోట్ల టన్నుల సబ్బును అమ్ముకుంది. జనం దానికి అలవాటు పడగానే రూ. 13 సబ్బును ఇప్పుడు 32 రూపాయలకు పెంచి అంటగడుతోంది.
కొన్ని రకాల సూక్ష్మజీవులను చంపేదుకుగాను సబ్బు (ఖరీదుతో, వాసనతో సంబంధం లేని ఏదో ఇక బ్రాండు) అవసరమేగానీ, అదే సర్వరోగ నివారిణి కాదని ప్రజా వైద్యులు అంటున్నారు.
హిందూస్తాన్‌ (దేశవాళి పేరుతో ముసుగేసుకున్న విదేశీ సంస్థ)కు మోసాలు అలవాటు. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు విడుదల చేసిన లైఫ్‌బాయ్‌ పనితనం కూడా అనుమానమే. అరుదయిన చెట్టు బెరడు నుంచి తీసిన పదార్ధంతో దీనిని తయారు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నది. దీన్ని వాడితే పలు చర్మరోగాలు మటుమాయమేనట. సబ్బుకే ఆ శక్తి ఉంటే, హిందూస్తాన్‌ ప్రకటనలే నిజమయితే ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల మంది చర్మవ్యాధుల నిపుణులు ఉండేవారా? కోట్లాది రూపాయల విలువయిన చర్మరోగ నివారిణులు అమ్ముడుపోయేవా??

రాయని భాస్కరుడు …. కాదు కాదు కలగాపులగం కామేశంగారూ

ఇక నోరు మూస్తారా?

రాయని భాస్కరులు అదేలెండి రాయలేని భాస్కరులు కాసిన్ని డబ్బులు పారేసి రాయించుకుని కింద తమ సంతకం గీకేసుకోవటం కద్దు. భాస్కర్రావులకు రాసిపెట్టే వాళ్లు బాగానే రాస్తారుగాబట్టి వాటిని నిలువుగానో, అడ్డంగానో అర్ధం చేసుకోవటం పెద్ద సమస్య కాబోదు. అయితే అసలు సమస్యల్లా కలగాపులగంగాళ్లతోనే.
ఆవేశం వీళ్లకు పెన్నుతో పెట్టిన విద్య. అందువలన వాళ్ల రాతలు అర్ధం కావటం కష్టం. పైగా వాస్తవాలను పట్టించుకోని, తర్కం తెలియని ఈ ప్రబుద్ధుల రాతలు కేవలం గందరగోళానికి పనికొస్తాయి తప్ప వాస్తవాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ఉపకరించవు.
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే … దూడ గడ్డికోసమన్నచందంగా చెబుతారు.
బుకాయింపులు – విరుచుకుపడటాలు సరేసరి.
నువ్వు చెడ్డోడివని అంటే చాలు – ”నువ్వే చెడ్డోడివి. ఆ మాటకొస్తే మీ తాత మహా చెడ్డోడు. మీ నాన్న సంగతి చెప్పనలవే కాదు” అంటూ ఎదురు దాడికి దిగుతారు. తిట్ల దండకం మొదలు పెడతారు. తప్ప తాను ఎందువలన చెడ్డవాడు కాదో చెప్పరు. తమను తిట్టినవాళ్లు, వారి ముందు తరాలవాళ్లు ఎలా తప్పుడు వాళ్లో వివరించరు. వివరించలేరు. ఒప్పించలేరు.
కాదంటారా?
24 ఆగస్టు 2012నాటి ఓ బ్లాగు భాగోతాన్ని చూడండి.
బ్లాగు పేరు :  ఇక నోరు మూస్తారా…అంతా పేరులోనే ఉందంటే ఇదేనేమో మరి!
అంశం : తెలకపల్లి రవిగారి అపసవ్య రాతలకి ప్రతిగా
విషయం ఇదీ :

కమ్యూనిష్టుల మీద ఆరోపణలు లేవా? అసలు భారత చరిత్రనే వక్రీకరించి రాశారన్న పెద్ద ఆరోపణలు ఎదుర్కుంటున్నది కమ్యూనిష్టు చరిత్రకారులే. మీ వక్రీకరణతో పోలిస్తే ఆరెస్సెస్ వక్రీకరణ ఎంత చెప్పండి. మీ ద్వంద్వనీతి ముందు వారిదెంత? వారికి కనీసం నిబద్ధత అయినా ఉంది. మీ కమ్యూనిష్టులకి అది కూడా లేదు. పెట్టుబడిదారులు ఆడవాళ్లతో కులుకుతారు అని కారల్ మార్క్సే రాసాడు. అటువంటి విషప్రచారాలు మీరు మొదలుపెట్టి అవతలివారి మీదకి నెట్టడం ఎంతవరకూ సబబు?
దీన్లో తెలకపల్లి ఏమి రాశాడో వివరం లేదు. దాడి మాత్రం బోలెడంత ఉంది. తెలకపల్లి రాతల్లో తప్పులుంటే కనీసం ముఖ్యమైన రెండు మూడు అంశాలనయినా తీసుకుని ఇది తప్పు – ఇలా తప్పు … అని వివరిస్తేగదా ఎవరికయనా అర్ధం అయేది. ఎవరయినా తప్పు తెలుసుకునేది. మరి ఈ బ్లాగరుకి అలాంటి తర్కం ఉన్నట్లు కన్పించటం లేదు. కసి మాత్రం బోలెడంత బుసుకొడుతోంది.
అందుకని కలగాపులగం భాస్కరరావుగారూ, కాదు కాదు కలగాపులగం కామేశంగారూ, అవేశం కాదు. ఆలోచనకు పనికొచ్చే సరకు ఏదన్నా ఉంటే చెప్పేందుకు ప్రయత్నించండి. మీరు గదమకుండానే మీకు నచ్చనివాళ్లు తప్పులు రాస్తే నోరు మూసేస్తారు. ఒక వేళ మూయకపోతే జనమే మూయిస్తారు. ఏమంటారు?????

‘అనంత’లో అమ్మకానికి పల్లెలు

 

 
  • గ్రామాలనే కొనేస్తున్న ‘నయా భూస్వాములు’
  • కరువు ప్రాంతంలో ‘కార్పొరేట్‌ సేద్యం’
 

నిత్య కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా నుంచి వలసలు వెల్లువెత్తుతుండటంతో.. ఖాళీ అవుతున్న ఊళ్లపై పెద్దల కన్ను పడుతోంది. వ్యవసాయం భారమై.. పూటగడవడమే కష్టమైన పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు ఊరొదిలి పోతుండటం పరాన్నభుక్కులకు వరంగా మారింది. వలసలతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతుండటంతో వ్యాపారులు, కొంతమంది రాజకీయ నాయకులు ఎగబడి పేదల భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా కరువు ప్రాంతమైన ఈ జిల్లాలో కార్పొరేట్‌ వ్యవసాయానికి బీజాలు పడుతోంది.

ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెండ్రాయునిపల్లి గ్రామాన్ని ఓ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు కొనేశారు. ఒకప్పుడు ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివాసముండేవి. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. వరుస కరువులతోపాటు, ఫ్లోరైడ్‌ సమస్య ఉండటంతో ఒక్కొక్కరు గ్రామం వదిలి ముదిగుబ్బ, కదిరి, అనంతపురం పట్టణాలకు వలస వెళ్లారు. దీంతో గ్రామం మొత్తం ఖాళీ అయింది. మొండిగోడలే మిగిలాయి. వలసలతో ఖాళీ అయిన ఈ గ్రామం మొత్తాన్ని ఓ నాయకుడు కొన్నారు. భూమినిబట్టి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ రైతులకిచ్చి గ్రామ పరిధిలోని 500 ఎకరాలను కొనుగోలు చేశారు. పొలాలన్నింటినీ చదును చేసి 15 చోట్ల బోర్లు వేసి సూక్ష్మ బిందు సేద్యం ద్వారా సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు ఎకరాల్లో వంకాయ, పది ఎకరాల్లో టొమాటో, 15 ఎకరాల్లో ఖర్బూజా సాగు చేశారు. పొలం అంతటికీ ‘డ్రిప్‌’ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం చూసి చిన్న, సన్నకారు రైతులు నోరెళ్లబెడుతున్నారు.

బత్తలపల్లి మండలం వసంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆగ్రహారం గ్రామాన్ని ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. సుమారు 350 ఎకరాలు ఒక్కడే కొనేసి చుట్టూ కంచె వేశాడు. నంబుల పూలకుంట, చెరువువాండ్లపల్లి గ్రామాలనూ ఇలాగే కొనుగోలు చేశారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు వచ్చి భూములు కొంటున్నారు. సోమందేపల్లి మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని రెండు వేల ఎకరాలను ఒక ఉత్తరాది వ్యాపారి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 500 నుంచి రెండు వేల ఎకరాల వరకూ కొనేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల నుంచి 20 వేల ఎకరాల వరకూ ఇప్పటికే కొనుగోలు చేసినట్టు అంచనా. వంద ఎకరాల్లోపు కొనుగోలు చేస్తున్న వారు లెక్కలో లేదు. వీరందరూ ‘అగ్రి ఫామ్‌’ పేరుతో రిజిస్టరు చేయించుకుని ఎగుమతికి అవసరమైన పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.

కరువు ప్రాంతంలో కార్పొరేట్‌ వ్యవసాయ బీజాలు

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం అనంతపురం జిల్లా. సగటున 552 మిల్లిమీటర్లు వర్షపాతం ఈ జిల్లాలో నమోదవుతుంది. రెండేళ్లుగా 400 మిలిమీటర్లకు మించి సగటు వర్షపాతం దాటడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి రైతులు వ్యవసాయం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి బీడు పడింది. జిల్లాలో 25 లక్షల ఎకరాలకుపైగా సాగుభూమి ఉన్నా పదిశాతానికి కూడా సాగునీటి వసతిలేని ప్రాంతమిది. ఇలాంటి జిల్లాలో పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికొచ్చి వేల ఎకరాల భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తామని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. కరువు ప్రాంతంలో కార్పొరేట్‌ వ్యవసాయానికి బీజాలు ప్రారంభమవడం చర్చనీయాంశంగా మారింది.