Posts Tagged ‘Uncategorized’

నేరగాళ్లకు నేతల అండదండ

నేరగాళ్లకు నేతలు అండదండలు ఇస్తారన్న విషయం తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. నేతలు కన్నెర్రజేస్తే పారిపోయే విలేకరులుంటారన్న నిజం అందరికీ విపులంగా తెలియకపోవచ్చేమో బహూశా. అయితే ఈరెండూ మిళితమైన ఓ సంఘటనను చెప్పనీయండి.
పదేళ్ల క్రితంవరకూ గూండాలకూ, ప్రత్యేకించి కిరాయి హంతకులకు ఒంగోలు నిలయంగా ఉండేది. అంటే ఇప్పుడు లేరని కాదు. ఆనాడు పట్టణం పూర్తిగా గూండాల చేతుల్లో ఉండేదంటే నిజం. నేను చెప్పబోయే సంఘటన హంతకులుగా ముద్రపడినవారంతా ఒకరిచేతుల్లో మరొకరు రాలిపోయిన తర్వాత చోటుచేసుకుంది.
ఒంగోలు సుందరయ్యభవన్‌రోడ్డు నందున్న ఓ ప్రైవేటు
పాఠశాల బుజ్జాయిల్ని ఓ స్థానిక యువ గూండాగాడు రోజూ ఏడిపించటం ప్రారంభించాడు. విరామ సమయంలో ఆడుకుంటున్న ఆడపిల్లల్ని ఏదో ఒక నెపంతో తాకటం, వక్రంగా మాట్లాడటంతో కొందరిలో భయం ఏర్పడింది. ఆడుకుంటున్న సమయంలో చిన్నారులు రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తుంటే వీడు తొంగి చూడటం, వంగి రాళ్లు విసరటమూ నిత్యకృత్యంగా సాగించాడు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే స్థానిక మహిళ ఒకరు ఈ తతంగాన్నంతా గమనించింది. మూత్రవిసర్జన చేస్తున్న ఓ చిన్నారిపైకి గూండాగాడు గులకరాయి విసరటం ఓ రోజు ఆమె కంటబడింది. ఏ పిసరంతయినా మానవత్వమున్న ఎవ్వరినయినా గుండెలు పిండేసే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక గూండాగాడిని కూకలేసింది. అంతేవాడు తిరగబడ్డాడు. చంపుతానంటూ బెదిరించాడు. దీంతో చేసేదిలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతో ఇంతో ప్రజల్లో పలుకుబడి ఉన్న మహిళ కావటంతో పోలీసులకు స్పందించక తప్పలేదు. వాడిని వెంటనే అదుపులోకి తీసుకుని ఊచలు లెక్కపెట్టేపని పెట్టారు. అయితే అదెంతో సేపు కొనసాగలేదు. ఒంగోలు ప్రజాప్రతినిధిగారి వ్యక్తిగత కార్యదర్శిగారిని గూండాగారి బంధువులు కలిసి వాడ్ని విడిపించమని వేడుకున్నారు. నాయకుడి గెలుపు కోసం తామెంత కష్టపడిందీ చిలవలు- పలవలు కలగలిపి చెప్పుకున్నారు. అంతే కార్యక్రమం మొదలయింది. పోలీసుస్టేషనకు ఫోను ఆదేశం పోయింది. గూండాగాడిని తక్షణమే విడుదల చేయమని హూకూం జారీ అయింది. ఫలితం గూండాగాడు బయటికొచ్చాడు. బాధితుల కోసం నిత్యం శ్రమించే ఆ మహిళ భయపడటంతో కొందరు ఈ సమాచారాన్ని నా చెవినబడేశారు. నేను వెంటనే రంగంలోకి దిగాను. చకచకా సమాచారాన్ని సేకరించాను. ఈ వ్యవహారం మొత్తం వారివారి సూటి మాటల పొందికతో ప్రత్యేక వార్తాకథనంగా రూపుదిద్దుకుంది. తెల్లవారేసరికల్లా ‘నేరగాళ్లకు నేతల అండదండ’ శీర్షికతో రంగురంగుల్లో పాఠకులందరికీ వడ్డన జరిగింది. ఆ ప్రజాప్రతినిధి అక్రమాలపై ఎవ్వరూ నోరు, కలమూ విప్పని నేపథ్యంలో సాహసించావంటూ పలువురి నుంచి నాకు ఫోన్లు అందాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్టాఫ్‌ రిపోర్టరు నుంచి కూడా ఆకాశం ఎత్తున అభినందనలు అందాయి. తాను అప్పటికే ఆ వార్తను 17సార్లు చదివాననీ, అయినా తనివి తీరలేదని చెప్పుకొచ్చాడు. ఉదయం 10 గంటల వేళ తీరిగ్గా నిద్రలేచి, ఆ తర్వాత మరింత తీరిగ్గా పత్రికా పఠనం చేస్తుండగా తనపై రాసిన అండదండ వార్తను చూసిన సదరు ప్రజాప్రతినిధికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన ఇంటి పంచలో చేరిన అనుయాయులయితే విలేకరిగాడి కాళ్లు విరగ్గొట్టాలంటూ ప్రతినలు బూనారు. ఆయనగారి కార్యదర్శిగారి నుంచి స్టాఫ్‌ రిపోర్టరుకు తొలిఫోను వచ్చింది. ఆయనగారి భయంకర ఘర్జనలకు రిపోర్టరు బెదిరిపోయాడు. ఫోను పెట్టేసిన తర్వాత అతని స్వరం మారిపోయింది. పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్లు ముఖం మాడిపోయింది. వణుకు ప్రారంభమయింది. డోసు కొంత తగ్గించి రాసినట్లయితే బాగుండేదేమో సుబ్బారావు అన్నాడు నాతో. ఆ తర్వాత ప్రజాప్రతినిధి ఇంటినుంచి మళ్లీ మళ్లీ ఫోన్లు. దీంతో గుడ్లు తేలేసిన విలేకరి ఆయనింటికెళ్లి క్షమాపణలు చెప్పుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే నేను లేకుండా వెళ్లలేనంటాడు. క్షమాపణ చెప్పి వెంటనే వెనుదిరుగుదామని వేడుకున్నాడు. చేయని తప్పుకు క్షమాపణలు కాదుగదా, పొరబాటున కాలో, చెయ్యో తగిలితే వెంటనే నాలుక స్పందించి చెప్పే సారీ అని కూడా చెప్పబోనని తేల్చిచెప్పాను. అసలు వారి ఇంటి ఛాయలకు కూడా రాబోనని ఎదురుతిరిగాను. నేను పనిచేసే పత్రికలో తొలినాళ్లలో సబ్‌ఎడిటరుగా బాధ్యతలు నిర్వర్తించిన ఓ పెద్దమనిషిని ప్రజాప్రతినిధి దగ్గరకు రాయబారం చేసేందుకు పంపారు. మా పెద్దాయన చనువుగా ఆయన కోపం తగ్గించి వచ్చేసినా రిపోర్టరుగారి వణుకు మాత్రం తగ్గలేదు. పూర్తిగా చేతులెత్తేసి అలాంటి వార్తలు రాయొద్దనీ, రాస్తే తన ఉద్యోగం ఊడుతుందనీ కన్నీళ్లపర్యంతం అయ్యాడు.
కొసమెరుపు : నెల్లూరు జిల్లాకు చెందిన జాతీయనాయకుడూ, ఒంగోలు ప్రజాప్రతినిధి కలిసి వెళ్లి హైదరాబాదులో పత్రికాధిపతికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందే నా వార్తలపై పత్రికాధిపతిని రెండుసార్లు కలిసినట్లు నాకు పక్కా సమాచారం ఉంది. తనపై కక్షకట్టి లేనిపోని అబద్ధాలతో వార్తలు ప్రచురిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డెస్క్‌ ఇన్‌ఛార్జి దీనికంతటికీ కారణమని ఆరోపించారు. ఆయన చెబితే కావూరి వార్తలు రాసి తనను భ్రష్టు పట్టిస్తున్నారని వివరించారు. దీంతో పత్రికాధిపతి స్పందించి డెస్క్‌ ఇన్‌ఛార్జిని ప్రకాశం నుంచి కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు. అయితే రాజకీయనాయకుల మాటలు విని తన మచ్చలేని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిన పద్థతికి నొచ్చుకున్న డెస్క్‌ ఇన్‌ఛార్జి రాజీనామా చేశారు. ఇప్పుడాయన వ్యాపారం చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు. అయితే సుబ్బారావు కారణంగా తాను రాజీనామా చేయవలసి వచ్చిందని ఆయన ఏనాడూ, ఎవరిదగ్గరా వ్యాఖ్యానించకపోవటం ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను కూడా విధిలేక ఆ పత్రిక నుంచి కొన్నాళ్ల తర్వాత బయటకు రాక తప్పలేదు. ఆ విషయాలు మరోసారి….

డాక్టర్‌ రావెళ్లకు అభినందన మందారమాల

రావెళ్ల శ్రీనివాసరావు … వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా వ్యంగ్య చిత్రకారుడు, వ్యంగ్య రచయిత, బాలల సాహిత్యకారుడు, రేడియో ప్రసంగీకుడు, తెలుగు భాషా పండితుడు, మాతృభాషకు వీరాభిమాని, సాహితీ స్రవంతి విజయవాడ విభాగం ప్రధాన కార్యదర్శి, (అ)రాజకీయ విన్యాసాలపై ఉన్నత పట్టాదారుడు (ఎంఏ) వీటన్నింటికీ మించి మంచి, మామంచి, అందరి మంచీ కోరే మహా మిత్రుడు.
ఒక్కసారి గతంలోకి వెళ్తే… నేను పనిచేసిన ప్రతిచోటా మా పత్రికలో వ్యంగ్య చిత్రకారుడిని నియమించటం నా అభిరుచి. ఒంగోల్లో లంక, విజయవాడలో రావెళ్ల, రాజమండ్రిలో ప్రముఖ కార్టూనిస్టు శేఖర్‌ను వ్యంగ్య చిత్రకారులుగా ప్రజాశక్తి దినపత్రికలో భాగస్వాముల్ని చేశానని చెప్పుకునేందుకు ఒకింత గర్వంగానే భావిస్తాను.
ఒంగోలు నుంచి విజయవాడ వచ్చిన కొత్తల్లో వ్యంగ్య చిత్రాలను గీసే సాహసాన్ని కొనసాగించిందికాక, ప్రజాశక్తి జిల్లా పేజీలో వేసుకున్న ఘనుడ్ని నేను. వాటిని రోజూ చూడలేక, చూసి కళ్లు కడప బాంబుల్లా పేల్చేసుకోలేక ఓ వ్యంగ్య చిత్రకారుడు తన బాధను కొందరు మిత్రుల దగ్గర వ్యక్తం చేశారు. ఆ చిత్రకారుడి బాధ పరోక్షంగా నాకు చేరకముందే తానే ఓచోట తారసపడ్డారు. పైగా అన్నాడూ… ”అబ్బో మీ అద్భుతమైన గీతల్ని (శీర్షిక పేరు ‘గీతో’పదేశాలు) ఇంకా అద్భుతమైన ఉపదేశాల్నీ రోజూ చూడలేక, చదవలేక ఛస్తున్నాను బాబూ, మమ్మల్ని రక్షించకూడదూ? అంటూ నన్ను వేడుకున్నారు. పోనీలే పాపం అనుకుని, నేను సరే పొమ్మన్నాను. అంతలోనే తేరుకుని ఆ గీతోపదేశాలు ఏవో మీరే చేయకూడదా? అని నేనూ వేడుకున్నాను. ఆ కళాకారుడు ఏ కళనున్నాడోగానీ, సరేనన్నాడు. మరుసటి రోజునుంచే గీతలు గీస్తూ ఉపదేశాలు విన్పించటం ప్రారంభించారు. ఆయనే రావెళ్ల శ్రీనివాసరావు. తెలుగు, రాజకీయాలు ప్రధానాంశాలుగా రెండు ఎంఏలు పుచ్చుకున్నారాయన. అంతేనా… టిటిసి, బిఎడ్‌ పూర్తిచేసి కృష్ణా జిల్లాలో ప్రథమ శ్రేణి తెనుగు పండితునిగా బహుబాగా బతుకేస్తున్నాడు లెండి. అన్నట్లు ఆయన సగం విజయవాడ నగరంలో ఉపాధ్యాయిని. ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే రావెళ్ల డాక్టరు కూడా అయ్యారు. అదీ సంగతి. అంటే ఏమీ లేదండి.. బాలబంధు అలపర్తి వేంకటసుబ్బారావు రచనలపై శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ అందుకున్నారంతే. ఆ శుభసందర్భం ఇది. అన్నట్లు ఆయనను సాహితీ స్రవంతి శనివారం రాత్రి విజయవాడలో సన్మానించింది. మిత్రుడి ఎదుగుదలను మిత్రుల రోజు సందర్భంగా బ్లాగీకరించాలని అనుకున్నా సమయం చాలలేదని సరిపెట్టిన మిత్రద్రోహిని రావెళ్లలాంటి ఉత్తమ మిత్రులు క్షమించేస్తారని నాకు గట్టి నమ్మకం లెండి. రావెళ్ల గీసిన వ్యంగ్య చిత్రాలు ఇప్పటి వరకూ ఏడు వేలదాకా వివిధ పత్రికల ద్వారా పాఠకుల్ని ‘నవ్వుల”పాలు’ చేశాయంటే నిజ్జంగా నమ్మాల్సిందే. మల్లెతీగ, ప్రజాశక్తి, రుషిపీఠం, సహస్రార, హాస్యానందం, ఈనాడు, హిందూ పాఠకులకు శ్రీనివాసరావు సుపరిచితుడే. ఆయనను రాష్ట్రస్థాయి పురస్కారాలు పది వరించాయి. అంతేనా, ఆయన ప్రతిభ చైనాదాకా పాకటంతో (ఆయన పాకలేదండీ!) 2006లో లింగ్‌మీ చైనా ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని అందజేయటం విశేషం. ఇంకా ఇంకా చాలానే ఉన్నాయిగానీ ఈ పోస్టు కోండవీటి చాంతాడంత పెరిగిపోతే వీక్షకులకు విసుగుపుట్టి నా బ్లాగుపై అప్రకటిత నిషేధం విధిస్తారన్న కూసింత స్వార్ధంతో ఇంతటితో ముగించక తప్పటం లేదు. మరొక్కసారి మిత్రుడు రావెళ్లకు గుండె (హృదయం…. ఇది సంస్కృతం కదా మరి.) పూర్వక అభినందనలు.

పచ్చ నోటు చాలు ఎర్రనోటుకు ఎసరు పెట్టు … అదే మనీ మేనేజిమెంట్‌

”అన్నం తిని మూడు రోజులయింది బాబయ్యా, ఒక్క రూపాయి దానం చేసి పుణ్యం కట్టుకోండి నాయనలారా!, అమ్మలారా!” సికిందరాబాదు రైల్వేస్టేషను రోడ్డులో బిక్షగాడు బిచ్చమయ్య అడుక్కుంటూ నడుస్తున్నాడు. కిటకిటలాడుతోన్న వాహనాలు, జనసందోహం మధ్య ఎదురొచ్చినవారి ముందు దీనంగా ముఖం పెట్టి చేయిచాస్తున్నాడు. ఎవరో ఒకరిద్దరు తప్ప లేదనకుండా బిచ్చమయ్య చేతిలో అంతో ఇంతో చిల్లరపడేసి పోతున్నారు. స్టేషను ఇన్‌గేట్‌ సమీపంలోకి చేరిన బిచ్చమయ్యకు అక్కడ ఒంటికాలు బక్కోడు అడుక్కుంటూ కన్పించాడు. బిచ్చమయ్య అటుకేసి నడిచాడు.
”రామయ్య తండ్రీ, ఓ రామయ్య తండ్రి” అంటూ చేయిచాచగానే వృద్ధ ప్రయాణికురాలు రెండు రూపాయల బిళ్ల తీసి బక్కోడు చేతిలో పడేసి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలతో ఓ యువ జంట అటు రావటం చూసిన బక్కోడు, ముందు వారి ముఖాలను పరికించి చూస్తూనే ” నడిపించు నా నావ, నడి సరద్రమునా దేవా” అంటూ గొంతెత్తాడు. యువకుడు ఐదు రూపాయలు తీసి తన కుమారుడితో బక్కోడికి ఇప్పించాడు. అప్పుడు ఓ బురాఖా మహిళ చంకన ఓ బుడుగుతో కన్పించగానే ”అల్లాహె అకబర్‌” అంటూ ఆకాశానికి దండం పెడుతూ చేతులు చాచాడు. ఆ మహిళ రూపాయి దానంచేసి ముందుకు కదిలింది. ఈ చోద్యాన్నంతా చూస్తో బక్కోడి దగ్గరకు చేరి ” ఏందిరో బక్కోడా! మహా రంజురంజుగా నడిపించేత్తన్నావు కత” అంటూ ఆకాశానికెత్తేశాడు.
”ఆ, నాదేవుందిలే బిచ్చాలు, అంతా అతివుట్టి, అనావుట్టి” చంకనున్న పంగాల ఊతం కర్రల్ని గోడకానించి అక్కడే కూలబడ్డాడు బక్కోడు.
”ఉరేయ్‌, బక్కోడా అట్టుండగూడదురా! బుర్రెట్టి పనిచేసకపోవాల. అయినా మనీ మేనేజిమెంటని ఉండాదిరా. దాని దుంపతెగ దాన్నడ్డంబెట్టుకుని రోజూ పండగలెక్కన అనబగించాల్రా రోజుల్ని.” బిక్షోపదేశం ప్రారంభించాడు బిచ్చమయ్య.
”మనీ మానేజిమెంటా?, అదేమి ఆయింటుమెంటన్నా” ఆకాశమెత్తున ఎదిగిన కృష్ణుడిలా నిలబడున్న బిచ్చమయ్యను ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని, తలెత్తి అర్జునుడిలా ప్రశ్నించాడు బక్కోడు.
”అట్టడుగు చెబతా!” అంటూ తానూ బక్కోడి పక్కనే కూలబడ్డాడు. సిగెరెట్‌ తీసి వెలిగించాడు. గుప్పుగుప్పున రెండుసార్లు పొగొదిలి మళ్లీ ప్రారంభించాడు బిచ్చమయ్య. ”ఇప్పుడు నిన్న జరిగిన సంగతే సెబుతా ఇను. ఎవడో పెద్దోడొకడు తారసపడ్డాడురా. ట్యాపిక్‌లో కారు ఆగితే పోయి చెయ్యిచాచానో లేదో, ఆ పెద్దమడిసి ఏ కలనున్నాడోగానీ, పరుసులోనుంచి వంద రూపాయల కాకితం తీసి చేతిలో పెట్టాడురా. మనకు దిమ్మతిరిగిందినుకో. ఎందుకోగానీ మొదటిసారిగా ఇక అడుక్కో బుద్ధికాలేదురా. ఆవుంతున ఆలోసించి, ఆలోసించి తాజుమహలొటేలుకుపోయాన్రా. కోరి కోరి అన్నీ తినేశా.”
”అమ్మో, వందకే అన్నీ ఎట్ట తిన్నావు బిచ్చాలూ?” అడ్డుపడ్డాడు బక్కోడు.
”ఇనెహా!, వందకెవడు పెతడాడు? అన్నీ, రెండేలయింది బిల్లు”
”మరి ఏమిజేసావు?”
”నేరుగా కవుంటరు దగ్గరకెల్లి డబ్బుల్లేవని సెప్పేసినాను మరి. వాడూరుకుంటాడా? పోనుగొట్టి పోలీసోడ్ని పిలిసి వాడికి అప్పగించినాడు మనల్ని. సరేనని పోలీసోడితో కలిసి బయటకొచ్చి, ఒరే, ఒరే నీకు వందిత్తాను వదిలిపెడతావా? అనడిగినాను. వాడు, కూసింతాలోసించి సరే అని సేతులు సాసాడు. ఇంకేవుంది వంద వాడిసేతిలో పెట్టి దరజాగా వచ్చేసినాను. అదేరా! మనీ మేనేజిమెంటు అంటే.”
”ఓయమ్మో! గొప్పదే మరి” ఆశ్చర్యపోయాడు బక్కోడు.
”ఓరి పిచ్చోడా! ఇట్టాంటి ఇసయాల్నే మేనేజిమెంటు కిల్స్‌ అంటార్రా బక్కోడా? మన బంజరాఇల్సులో అదేదో కంపూటర్ల కంపనీ ఉందిరా. అక్కడకు కోటేసుకుని వచ్చే సాములు ఈటినే కుర్రోల్లకి చెబుతుంటార్రా, ఆ కంపనీ కుర్రోల్లు ఎంతమంది ఇంటారో నాకు తెలవదుగానీ, నేను మాత్తరం వారంవారం ఇదిగా ఆ ఆపీచుబయట గోడపక్కన కూచ్చుని చద్దగా ఇంటాన్రా.” ముగించాడు బిచ్చమయ్య.
(మిత్రుడు అనిల్‌ పంపిన మెయిల్‌ మెసేజ్‌ ఆధారంగా)

(లో)పాలు

ప్రైవేటు డెయిరీ ఏజంట్ల మాటేమోగానీ, హైదరాబాదు నగరంలో విజయ డెయిరీ ప్రతినిధులు మాత్రం వినియోగదారులతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధర వసూలు చేయటం, కోరిన ఎస్‌ఎన్‌ఎఫ్‌ పాలు లేవనటం, 200 మిల్లీ లీటర్ల ప్యాకింగ్‌ అడిగితే ఊరు పేరూ లేని డెయిరీవి ఇవ్వటం, అదేమని అడిగితే తిట్లకు దిగటం మామూలయింది. రాంనగర్‌ చౌరాస్తా ఏజంటు విజయడెయిరీతోపాటు అన్ని రకాల పాలూ విక్రయిస్తాడు. వాస్తవానికి ఇలా అన్ని రకాలూ అమ్మటం నిబంధనలకు విరుద్ధం. సరే చూసీచూడనట్లు పోదామనుకుంటే విజయ పాలకు బదులు వేరు రకం అంటగడుతుంటాడు. ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల విజయ డెయిరీ ప్యాకెట్లను దాచిపెట్టి సుగుణ పాలు అమ్మటం కద్దు. ఎవరయినా విజయపాలు కావాలని అడిగినా, లేవంటాడు. చూసి అడిగితే వాటిని దుకాణాల వాళ్లకోసం తెప్పించానని తప్పుకోజూస్తాడు. విజయపాల ప్యాకెట్లు పగిలిపోతున్నందున తెప్పించటం లేదంటాడు. దీనికితోడు రూ. 4.50కు బదులు రూ. 5 వసూలు చేస్తాడు. అడిగితే చిల్లర లేదంటాడు. గట్టిగా అడిగితే చిల్లర తెచ్చుకుని తీసుకుపొమ్మంటాడు. అదే ఇతర డెయిరీల 200 మిల్లీలీటర్ల పాలకు మాత్రం రూ. 5.50 తీసుకుని చిల్లర ఇస్తాడు. ఇదంతా విజయ డెయిరీ యాజమాన్యం అనుసరిస్తోన్న దివాలాకోరు విధానాల ఫలితంగానే జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, అక్రమార్కుల నుంచి సొంత లబ్ధి పొంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందునే వినియోగదారుల మన్నన పుష్యలంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఇలా ఏడుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనన్న జ్ఞానం విజయ డెయిరీ సిబ్బందికి ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. ఎవరన్నా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, చర్య తీసుకోకపోగా ఫలానావాడు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడని ఏజంట్లకే ఉప్పందిస్తారు. దీంతో ఆ ఏజంటు ఆ వినియోగదారుడిని ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తాడు. చిల్లరలేదంటాడు ఒకసారి, స్టాకు లేదంటాడు మరోరోజు, అవసరమయి అడిగితే రోజూకన్నా ఎక్కువ పాలు ఇవ్వనంటూ పేచీలకు దిగుతాడు. ఇదీ విజయ డెయిరీ (లో)పాల కథ.

అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర

కీర్తిశేషులు నార్ల వెంకటేశ్వరరావు అంటారూ – అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. ప్రజాస్వామ్య మహాసౌథానికి నాలుగో స్తంభమని భావించే పత్రికారంగం నిజాయితీగా వ్యవహరిస్తే … అదే సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర.
దీనికి ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో నేను ఈనాడులో రాసిన ప్రత్యేక కథనం నిలువుటద్దం …. ఆ వార్తా కథనంతోపాటు ఆనాడు చోటుచేసుకున్న సంఘటల్నీ ఈ రోజు మీతో పంచుకోనీయండి!
పాపయ్య, పెద్ద పాపాలభైరవుడు. ఒంగోలు పురపాలక సంఘంలో కమిషనరుగా పనిచేసిన ఈయన ఆచరణలో క’మీ’షనరు. అంటే చీటికీ మాటికీ కమీషన్లు కొడుతుంటాడనేగా. ”ముడుపులు ముట్టను – పర్సంటేజీలు పట్టను” … పాపయ్య కమిషనరుగా ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నేను రాసిన వార్తకు శీర్షిక. ప్రజా సేవలో నిమగ్నమయి తాను వైవాహిక జీవన మాధుర్యాన్ని కూడా అనుభవించలేకపోతున్నానని తొలిరోజే ఆయన నాతో నేరుగానే చెప్పటం విశేషం. నా కథనంలో ఇది కూడా ఓ ముఖ్యమయిన అంశమే అయినందున దీన్ని ప్రస్తావించాల్సి వచ్చినందుకు క్షమించండి.
ఈ పాపి అందరిమాదిరిగానే వారంరోజులు అదరగొట్టాడు. ఇతర అధికారుల్నీ, సిబ్బందినీ పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత చూడండి పాపయ్య పాపాలకు అంతేలేకుండా సాగటం మొదలయింది. దానికి అనుగుణంగానే నేనూ నిత్యం వెంటబడి కలం కదిలించాను. ముడుపులు మూటగట్టుకోవటంతోపాటు, కార్యాలయంలోనే రోజుకొకరితో పడకేసేవాడు పాపి. ఓ రోజు పాపి సహా నలుగురు అధికారులు కార్యాలయం తలుపులు బిగించుకుని మరీ బండబూతులు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. సమగ్ర మరుగుదొడ్ల నిర్మాణ పథకం గుత్తేదారు నుంచి ముట్టిన ముడుపులన్నింటినీ (16 శాతం) కమీషనరు మూటగట్టుకుని తీసుకోవటమే దీనికి కారణం. నాలుగు గోడల మధ్య సాగిన ఈ వ్యవహారం కూడా యధాతథంగా మరునాడే రంగులు పూసుకుని ప్రకాశం మినీ మొదటి పేజీలో పాఠకులకు దర్శనమిచ్చింది. దీంతో కలకలం చెలరేగింది. నాలుగు గోడల మధ్యసాగిన వ్యవహారం ఈనాడు విలేకరి కావెసురా( వెంకట సుబ్బారావు కావూరి)కి ఎలా తెలిసింది???? ఇదీ చర్చ. ఆ నలుగురూ మళ్లీ తలుపులు బిగించుకుని, కావూరికి నువ్వు చెప్పావంటే, నువ్వు చెప్పావంటూ మళ్లీ చెంపలు వాయించుకున్నారు గుట్టుగా. అదీ మళ్లీ మరునాడే పత్రికకు ఎక్కింది. మున్సిపాలిటీతో సంబంధమున్న అందరికీ మతి పోయింది. ఇచ్చినవాడు చెప్పడు, తిన్నవాడు చెప్పడు, అడిగినవాడు చెప్పడు, కొట్టినవాడు చెప్పడు, కొట్టించుకున్నవాడు చెప్పడు…. మరి విలేకరికి పూసగుచ్చినట్లు ఎలా తెలుస్తోంది? సమాధానం దొరక్క చివరకు ఒక నిర్ధారణకు వచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన మైక్రో కెమెరాలను కావూరి ఎక్కడో బిగించాడు. వాటి ఆధారంగానే రహస్యాలు రాబడుతున్నాడని ఒకరికొకరు చెప్పుకున్నారు. విలేకరులు అదే నమ్మారు. నాతోనూ అదే చెప్పారు. నేను నవ్వి ఊరుకున్నాను. వాస్తవానికి నా దగ్గర ఏ కెమెరాలూ లేవు. ఉన్నదల్లా కమీషనరు అటెండరుతో స్నేహం, కారు డ్రైవరుతో అనుబంధం. అంతే. ఎంత రహస్యమయినా అటెండర్లను బయటకు పంపరు. డ్రైవరుకు తెలియకుండా కారులో ఏదీ జరగదు. అదీ అసలు రహస్యం. అటెండరు మిత్రులు, డ్రైవరు సాబ్‌లు ఎప్పటికప్పుడు అయినదానినీ, కానిదానినీ నాకు పూసగుచ్చేవాళ్లు. విలేకరి మిత్రులూ చూసుకోండి మరి. సరే నా వార్తల ఆధారంగా పాపిమీద ఏసీబీ దాడి చేసింది. ప్రభుత్వం సస్పెండు చేసింది. అయితే పాపి మేనమామ అధికారపార్టీలో పలుకుబడి కలవాడవటంతో (ఆర్టీసీ ఛైర్మను పదవి వెలగబెట్టేవాడు) కొద్ది రోజుల్లోనే విముక్త్తుడయ్యాడు. పాపి మామూలోడు కాదుగదా! నాలుగు రోజులకే మళ్లీ ప్రారంభించాడు పాపపు పనులన్నింటినీ. నా కలమూ కదులుతూనే ఉంది. ఓ రోజు పాపి నాకు ఫోను చేసి ఎంత కావాలో కోరుకోమన్నాడు. వద్దని సూటిగా చెప్పాను. పోనీ పత్రికకు ప్రకటనలు ఇస్తానని ఎరవేశాడు. ఆ పని నాది కాదని నిర్ధ్వందంగా తేల్చి చెప్పాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తానంటూ స్వరం పెంచాడు. నీకు చేతనయింది చేసుకోమన్నాను. గూండాల్ని పెట్టి కాళ్లూ, చేతులు తీయిస్తానంటూ ఫోను పెట్టేశాడు. ఓ అరగంట తర్వాత సాక్ష్యం కోసం కొందరు కౌన్సిలర్లను వెంటబెట్టుకుని వెళ్లి పాపిని కలిసి నీకు చేతనయింది చేసుకో, నా ప్రాణం ఉన్నంతవరకూ, నాచేతిలో కలం ఉంచినంతవరకూ దేన్నీ దాయకుండా పౌరులకు చెబుతూనే ఉంటానని నేరుగా చెప్పి వచ్చేసాను. పాపి మొదటిసారిగా వణకటం చూశాను. మనసు తీరా నవ్వుకున్నాను. ఓ అక్రమార్కుడిని అంతలా భయపెడున్నందుకు తెగ గర్వపడిపోయాను. మరో ఆరు నెలలు గడిచింది. పాపి వ్యవహారాలు రోజూ వార్తలయి పౌరులకు చేరుతుండటంతో పాలక పెద్దలకు కూడా విసుగు పుట్టింది. పాపిని పంపేసి ఆ స్థానంలో ఆంజనేయుల్ని (అసలు పేరుకాదు) తెచ్చుకున్నారు. అయితే పాపిని ఊరక పంపదలచుకోలేదు. ఒంగోలు రంగారాయుడు చెరువులో కోటి రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేయదలచిన బోట్‌క్లబ్‌ పనుల్ని పార్టీ విధేయుడొకరికి అక్రమంగా కట్టబెట్టేందుకుగాను చీకటి పనుల్ని పాపి చేతుల మీదుగా పూర్తి చేయించుకున్నారు. దీనికిగాను పాపికి ఏక మొత్తంగా ఓ లకారందాకా ఇచ్చారు. మందు, బిర్యానీ సరేసరి. అర్ధరాత్రి వేళ కార్యాలయంలోనే తలుపులేసుకుని పాపి ఈ వ్వవహారాన్నంతా చక్కబెట్టాడు. బోటుక్లబ్బు టెండర్ల ప్రచురణ కోసం ఎప్పుడూ కనపడని ఓ స్థానిక పత్రికను ఎంచుకున్నారు. పత్రికను డీటీపీ చేయించి కంప్యూటరులోనే రెండు, మూడు ప్రతుల్ని తీయించారు. రెండో పత్రికగా ఒంగోలులో అంతగా కొనుగోలుదారులు లేనిదానిని ఎంచుకున్నారు. ప్రకటన ప్రచురితమయిన రోజున అక్కడికి వచ్చే 50 ప్రతుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా పనులన్నీ ఒకేరాత్రి పూర్తి చేశారు. కొత్త కమిషనరుతో సంతకం చేయించి ఊపిరిపీల్చుకున్నారు. ఈ వ్యవహారమంతా రెండో రోజున ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో పాఠకులకు చేరింది. అంతే గుత్తేదార్లు, ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. కొందరు గుత్తేదార్లు వార్త ప్రతుల్ని ఏసీబీ మొదలు ముఖ్యమంత్రిదాకా గుట్టుగా పంపారు.
పాలకులు పట్టించుకోలేదుగానీ, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర అధికారులు కన్నేశారు. వివరాలన్నింటినీ సేకరించారు. ఇద్దరు కమిషనర్లు, ఎంఈ, డిఈ, ఏఈ ఇలా ఐదుగురిపై ఒకేసారి వేటేస్తూ డిసెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పౌరులంతా నూతన సంవత్సర వేడులు జరుపుకుంటున్న వేళ పాపి అండ్‌కోకు ఈ ఉత్తర్వులు చేరాయి. కాలం మార్పుతో (క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా) బతుకులు మారబోవన్న ఇంకిత జ్ఞానం ఉన్నవాడిగా నూతన సంవత్సర వేడుకలకు సాధారణంగా దూరంగా ఉండే నాకు ఆ రోజు వార్త సాధించిన స్పందనతో నిజమయిన పండుగ జరుపుకున్నాను. ఆనాటి నుంచీ నా బీటుకు సంబంధించిన అధికారులు, నాయకులు కంటారా ఏ రోజూ నిద్రపోలేదంటే నిజ్జంగా నిజం. మద్యం గురించి నాకు ఈనాటికీ ప్రాథమిక విషయాలు కూడా తెలియవుగానీ, తాము సాధారణంగా సేవించేదానికి రెట్టింపు తాగినా కిక్కురాక, నిద్రపట్టక అల్లాడిపోతున్నామని కొందరు నాతోకూడా అప్పుడప్పుడూ వాపోయేవారు. కాస్త చూసీచూడనట్లు పొమ్మని అభ్యర్థించేవారు. అయినా నా కలానికి ఎన్నడూ పదును పోగొట్టి చూసీచూడనట్లు పోలేదు. అదే నాకు సంతృప్తి. దాంతోనే నా జన్మ ధన్యమయిందని నమ్ముతాను. ‘పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యమ్ము’ అని అందుకేగదా పెద్దలన్నది.

సొసంత్ర దినాన మా ఊళ్లో ఉచిత వైద్యశిబిరం

ఇప్పటి బుడుగులు, సీగానపెసూనాంబలూ ఇండిపెండెంట్స్‌ డే అంటూ పలికే ఆంగ్ల పలుకుల్ని మేము చిన్నప్పుడు నాలుక తిరక్క సొసంత్ర దినమని అనేవాళ్లం. కేవలం చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకునేందుకే స్వాతంత్య్ర దినోత్సవాన్ని వికృతిగా రాశాను.
సరే అసలు విషయానికొస్తాను.  మా నాన్న కావూరి కోటేశ్వరరావు ప్రథమ వర్థంతి సందర్భంగా గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మా గ్రామంలో (ఈదుమూడి, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా)  ఉచిత వైద్యశిబిరం తదితర కార్యక్రమాల్ని నిర్వహించాను. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15న ‘కాకోరాజ్ఞాసం’ (కావూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థ సంస్థ) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఈ శిబిరంలో కన్ను, దంత, మధుమేహం, సాధారణ వైద్య నిపుణులు పాల్గొంటారు. మధుమేహూలతోపాటు, వచ్చే అవకాశం ఉందని గుర్తించినవారికి కూడా రక్త పరీక్షలు చేయిస్తాము. బరువు, బీపీ, ఎత్తు కొలిచి కాకోరాజ్ఞాసం ప్రచురించిన చేతి పుస్తకంలో నమోదు చేసి వారికి అందజేస్తాము. అన్నట్లు ఈ పుస్తకంలో మధుమేహ సంబంధిత సమాచారాన్ని ప్రచురిస్తున్నాము. తమ ఆరోగ్య పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేందుకు వీలుగా పట్టికల్ని కూడా ఇస్తున్నాము. ఉచితంగా మందులు అందజేస్తాము. పిల్లలకు టూత్‌పేస్ట్‌, బ్రష్‌ ఇస్తాము. అవసరమయినవారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించేందుకు ఒంగోలులో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఫిబ్రవరిలో తొలుత గ్రామంలో ఆరోగ్య సర్వే నిర్వహించాము. గ్రామంలో 400 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. కుటుంబ నేపథ్యం, ఊబకాయం తదితర అంశాల ఆధారంగా మరొక 300 మంది త్వరలో మధుమేహం బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆహార అలవాట్లను మార్చుకుని, రోజూ అరగంటపాటు నడిస్తే మధుమేహం సమస్యను మూడేళ్ల నుంచి పదేళ్ల వరకూ వాయిదా వేసేందుకు అవకాశం ఉందని నిపుణలు వారికి సూచించారు. గ్రామంలో 600 మందికి రక్తపోటు ఉంది. ఇక 45 ఏళ్లు దాటిన వారందరూ ఏదో ఒక స్ధాయిలో కాళ్లనొప్పులబారిన పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రతినెలా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని ఆనాడు భావించాను. అయితే హైదరాబాదులో ఉంటున్నందున దూరాభారం రీత్యా నా కోరికను అమలు చేయలేకపోయాను. అందుకనే ముఖ్యమయిన సందర్భాలలోనయినా వైద్య సేవలు అందించేందుకు సమాయత్తమవుతున్నాను. పలువురు మిత్రుల సహకారంతో వేలాది రూపాయల విలువయిన సేవల్ని నా జన్మభూమికి అందజేస్తున్నాను. ఇది నా కనీస ధర్మంగా భావిస్తున్నాను. ఉపాధ్యాయుడిగా పేరుగడించిన మా నాన్నకు నేనిచ్చే నివాళి ఇది.

నిన్న సొమరిపోతు నేడు రామదూత బాబా

అవును. మొన్నటి సోమరిపోతు ఎంకటేసుల్లు నేడు రామదూతగా వెలుగొందుతున్నాడు. వీధులెంట అడుక్కుతిన్న ఎంకటేసుల్లు బాబాగా ఎదిగి 110 ఎకరాల సాగునీటి చెరువును ఆక్రమించాడు. మరోపక్కనున్న అటవీభూమిని కబ్జాచేసి కట్టడాలు నిర్మించాడు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్రమంత్రి బాలు, రాష్ట్ర డిజిపి గిరీష్‌కుమార్‌, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సునీల్‌శర్మ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు, మరెందరో ఉన్నతాధికారులు ఇప్పుడు ఆయన శిష్యులు. వీళ్లంతా తరచూ రామదూత ఆశ్రమాన్ని సందర్శిస్తుండటం బహిరంగ రహస్యం. గిరీష్‌కుమార్‌ అయితే ఎంకటేసుల్లు ఉరఫ్‌ రామదూత ఉరఫ్‌ కబ్జాదారు కాళ్లమీద బహిరంగంగా బోర్లాపడటం వ్యక్తిగా ఆయనిష్టమేగానీ, ఓ ఉన్నతాధికారిగా చేయకూడని నేరం, ఘోరం.
శాస్త్రీయతపట్ల మక్కువగల పౌరుడిగా, పాత్రికేయుడిగా నేను ఈ ఎంకటేసులుపై 2002లోనే అందరికన్నా ముందు కలంతో పోరాటానికి తెరలేపాను. అన్నట్లు ఈ ఎంకటేసుల్లు ఆశ్రమం ప్రకాశం జిల్లా చాగల్లు గ్రామం చెంత ఓ వైపు కొల్‌కతా – చెన్నయ్‌ రైలు మార్గానికీ ఐదో నంబరు జాతీయ రహదారికి నడుమన విస్తరిస్తోంది. తిరుపతి, చెన్నయ్‌కు రైల్లోనో, బస్సులోనే వెళ్లే ప్రయాణికులు సింగరాయకొండ దాటిన తర్వాత కావలికి చేరబోతున్నామనగా ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు. ఐదో నంబరు రహదారి వెంట 60 – 70 అడుగుల ఎత్తున దేవతా విగ్రహాలు ఉన్నదే రామదూత ఆశ్రమం.
అప్పుడప్పుడే ఆశ్రమం మొగ్గతొడుగుతున్న సమయంలో నేనూ, నా సహచర పాత్రికేయుడు ఎస్‌వీ బ్రహ్మంతో కలిసి రామదూతను 2002 ప్రథమార్ధంలోనే ఓ ఆటాడించాను. ఓ చక్కటి ఉదయాన రామదూతను ఆశ్రమంలో కలిసి పేరుసహా అన్నీ అబద్ధాలే చెప్పి నా సమస్యలకు పరిష్కారం కోరాను. ఎవ్వరి భవిష్యత్తునయినా తాను ముందే రంగరించి చెబుతానని చెప్పుకునే ఎంకటేసుల్లు ఒక్కటంటే ఒక్క అబద్ధాన్నీ పట్టుకోలేకపోవటంలో ఆశ్ఛర్యం ఏముంది. ఆశ్రమానికి పది వేలు సమర్పించుకుంటే చాలు డిఎస్‌సీలో నాకు ఉపాధ్యాయ ఉద్యోగం రాకుండా అడ్డగిస్తోన్న శని బలహీన పడుతుందని నాతో రామదూత బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేని పేదవాడినని వేడుకోగా, కనీసం ఐదు వేలన్నా ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఎక్కువ ఇచ్చు కుంటే నా భవిష్యత్తు అంత బాగుంటుందని భరోసా ఇచ్చాడు. ఉపాధ్యాయ ఉద్యోగం రావటం మాట అంటుంచండి, నాకు డిఎస్సీ రాసేందుకు అవసరమయిన డీఎడ్‌గానీ, బీఎడ్‌గానీ లేదు. నిరుద్యోగిలాగా నటించి, డిఎస్సీలో ఉద్యోగం వస్తుందో? రాదో? రాకుంటే ఏమి చేయాలో? చెప్పమనగానే ఓ తమలపాకుపై పిచ్చిగీతలు గీసి పదివేలకు ఎర వేశాడు. నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ రాయాలంటే  చాట భారతమే అవుతుందని నమ్మండి. చెరువు భూమిని కాపాడుకోవటానికి రాజకీయనాయకుల్ని బుట్టలో వేసుకున్న ఎంకటేసుల్లు, అటవీ భూమి అక్రమణ కేసుల్నుంచి తప్పించుకోవటానికి ఆ శాఖాధికారి భార్యనే బుట్టలో వేసుకున్న ఘనుడు. ఆమె కూడా ఈ ఆశ్రమంలోనే శాంభవీమాతగా పూజలందుకుంటోంది. ఆమెగారి భర్తగారికి ప్రభుత్వం ఇచ్చిన వాహనం నిత్యం ఆశ్రమంలోనే కొలువుదీరి ఉంటుంది. అయ్యగారితో ముఖాముఖి పూర్తయిన తర్వాత రోజునుంచీ వరుసగా ఆరు రోజులపాటు ప్రజాశక్తి దినపత్రికలో ప్రత్యేక కథనాలు రాశాను. దీంతో ఎంకటేసుల్లు, ఆయన పరివారమూ భయపడిపోయి పెద్దల్ని రోజూ రాయబారం పంపేవాడు. అన్ని రకాలుగా సహకరిస్తానని మొదలు పెట్టి చివరకు బెదిరింపులకూ దిగాడు. అంతకు మునుపే అదే ప్రాంతంలో తిష్టవేసిన బండ్లమాంబతో పోరాటం చేసిన నేను రామదూత శాపనార్ధాలకు లొంగటం అసంభం కదా?. ఆసక్తిదాయకమయిన బండ్లమాంబపై పోరాటం మరోసారి చెబుతానూ! కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో కృష్ణస్వామిపై నేను చేసిన కలం యుద్ధంలో డాక్టర్‌ సమరం కూడా నేరుగా పాలుపంచుకోవటం ఎన్నడూ మరచిపోలేనిది.
సరే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే…. మొక్కై వంగనిది మానయి వంగదని పెద్దలన్నట్లుగా ఈ బాబాలు, అమ్మలు పుట్టేందుకు మన సమాజంలో బోలెడు, బోలెడు అవకాశాలున్నాయి. ప్రశ్నకు తావులేని సమాజంలో ఎంకటేసుల్లు, బండ్లమాంబలూ పుట్టగొడుగుల్లా పుడతారంతే. కనీసం ఎవడయినా ప్రశ్నించినప్పుడయినా ఆరా తీసి మద్దతిస్తే, శిక్షిస్తే…. అప్పుడు చాగల్లు సాగునీటి చెరువులు కబ్జా కావు. అటవీ భూములు ఈ తీరున ఆక్రమణలకు గురికావు. అమ్మాయిల జీవితాలు బండ్లమాంబ ఆశ్రమంలో అర్ధాంతరంగా ముగిసిపోవు. కృష్ణస్వామి అక్రమ శృంగారానికి యువకులు బలయిపోరు. సర్వే జన సుఖినోభవంతు అంటూ దీవిస్తే సుఖాలు వళ్లో వాలవు. సర్వ జనులకూ ప్రశ్నించటం నేర్పితే ఈ సమాజం అభివృద్ధి పథం పడుతుంది. ఆసక్తి ఉన్న మిత్రులను చర్చకు ఆహ్వానిస్తున్నాను.

కొణిజేటి రోశయ్య – కన్పించేంత అమాయఁడు కాదండోయ్‌!

పదిహేన్నేళ్లకు పైగా పత్రికా రంగంలో పనిచేస్తోన్నందున ఆ రంగం విశేషాల్ని మీతో పంచుకోనివ్వండివాళ. మీడియాలో పాత్రికేయుల సమావేశాలకు ప్రాధాన్యత తెలియందికాదు. అందులోనూ రాజకీయ నాయకులు, వేదికలు ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్ల తీరును కనుక పరిశీలిస్తే, ఆయా పార్టీల నడవడికను మనం అర్ధం చేసుకునే అవకాశముంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో ఒకనాటి అనుభవాన్ని ముందుగా ప్రస్తావించటం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను. అది 1998. అప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదుర్కోబోతోన్న తొలి ఎన్నికలు అవి. తెలుగుదేశానికే వాతావరణం అనుకూలంగా ఉందన్న భావన నెలకొని ఉంది. ఆ సమయంలో కాంగ్రెసు నాయకుడు కొణిజేటి రోశయ్య ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చారు. ప్రకటించిన ఆనాటి కార్యక్రమం మాత్రం ఒంగోలు బస్సుస్టాండు పక్కనే నిర్మించిన వైశ్యా భవన్‌ ప్రారంభం. కానీ అంతర్గతంగా ఎన్నికల సంబంధిత వ్యవహారం విధిగా ఉండే ఉంటుందని అప్పట్లో ఒంగోలు పట్టణంలో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న నేను ముందే ఊహించాను. కీడెంచి మేలెంచటం విలేకరులు అనుసరించాల్సిన విధానమని నా నమ్మకం. ఆ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి రోశయ్య పోటీబడుతున్నారు. అందులోనూ మా గురువు (కీర్తిశేషులు) బీసీ నారాయణరావు ఎప్పుడూ అంటారూ, ”పోటీచేసినా, చేయకపోయినా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రోశయ్య కొత్త కోటీశ్వరుడవుతాడయ్యా”. ఇదీ నా మనస్సులో ఉంది. ఈ నేపథ్యంలో నేను అప్రమత్తంగా ఉన్నాను. వైశ్యా భవన్‌ ప్రారంభ కార్యక్రమం, అనంతరం సభకూడా ముగిసింది. ఇంకేముంటుందని విలేకరులంతా పుస్తకమూ, పెన్నూ సర్దుకుని వెళ్లిపోయారు. వాళ్లకు కనపకుండా పక్కకు తప్పుకుని, బహిరంగంగా ఏర్పాటు చేసిన సభలోకి ప్రవేశించాను. గుంపు మధ్య ఆసీనుడయ్యాను. అక్కడున్నవాళ్లంతా మాట్లాడుకుంటుండటంతో వాతావరణం గందరగోళంగా ఉంది. కొద్ది నిమిషాల్లోనే ప్రారంభమయింది అసలు వ్యవహారం. జిల్లా నలుమూలల నుంచీ అరుదెంచిన వాణిజ్య ప్రముఖులు ఒక్కొక్కరుగా వేదికమీదున్న రోశయ్య వద్దకు చేరటం… తొలుత దండ వేయటం … చెవిలో గుసగుస … ఎవరికి తగిన విధంగా వాళ్లు మూట అందజేసి కిందకు దిగటం. దాన్నంతా ఆసక్తిగా గమనిస్తూ అవసరమయిన సమాచారాన్ని బుర్రలో ముద్రేసుకుంటున్నాను. రాసుకుంటుంటే బయట పడతాను కదా మరి!. అలా అలా గంటకు పైగా గడిచింది. ఆ సమయంలో నన్ను గమనించిన వాళ్లెవరో ఎవరికో ఉప్పందించినట్లుంది. అంతే ఒక్కసారిగా నా వైపు చేతులు చూపిస్తూ నలుగురయిదుగురు, ”ఒరేయ్‌, ఈనాడోడురా, పట్టుకోండి – పట్టుకోండి” అంటూ అరుపులు, కేకలతో నావైపు దూసుకు రావటం కన్పించింది. అంతే… నేనూ అప్రమత్తమయ్యాను. లేస్తూనే పరుగందుకున్నాను. సమీపంలోని రోడ్డును దాటి అవతలున్న రెండు నక్షత్రాల హోటల్లో దూరాను. నా వెంట పడ్డవాళ్లు స్ధానికులు కానందున రోడ్డు దాటి వచ్చేందుకు సాహసించలేదు కాబట్టి బతికిపోయాను. కాసేపు అక్కడే గడిపి చల్లగా ఆఫీసుకు చేరిపోయి వార్త రాసేశాను. ఆ వార్త పూర్తి పాఠం ప్రచురణకు నోచుకోకపోవటం వేరే విషయమనుకోండి. మరోసారి పాత్రికేయుల సమావేశంలో రోశయ్యను ప్రశ్నించటాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుయాయులు బూతులతో నన్ను ఎదుర్కోవటం ఎన్నటికీ మరచిపోలేను. ఇదండీ సౌమ్యుడని అత్యధికులు భావించే మన ముఖ్యమంత్రి రోశయ్య(అనుయాయుల)తో నా (భయంకర) అనుభవం.

రేడియో పెట్టటం తప్ప ఆపటం తెలియక దుప్పట్లు కప్పిన తాత

మొన్నటి తరం తీరూతెన్నుల్ని నేటి తరానికి పరిచయం చేయాలన్న ఆశయంతో మా వేలువిడిచిన తాతగారి సంగతిని గుర్తుచేయనీయండి.! ల్యాప్‌ట్యాప్‌ను సైతం మూడు క్షణాల్లో విప్పేసి, ఆరు క్షణాల్లో బిగించే ఈనాటి సాంకేతిక నైపుణ్య తరానికీ స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి తరానికీ – నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ూంది.
మా నాన్న ద్వారా నేను విన్న ఈ సంఘటనకు స్వతంత్ర భారతదేశమంత వయస్సు ూండి ూంటుందని నా ఊహ. అన్నట్లు ఈ సంఘటనతో సంబంధంలేదుగానీ మా నాన్నను స్వతంత్రపార్టీ నాయకుడు ఆచార్య ఎన్‌జి. రంగా (అత్యధికులకు ఆయన కాంగ్రెసు నాయకుడిగానే తెలుసేమో?) ూపాధ్యాయ ఉద్యోగం వేయించారు. రాజకీయాలంటేనూ, సాహిత్యం అంటేనూ చెవికోసుకునే మానాన్న, రేడియో కార్యక్రమాల్ని ఇంట్లో ఉన్న అత్యధిక సమయం వెచ్చించి బీరుపోకుండా (ఈ పదానికి అర్ధం ఒక్కటీ వదలకుండా అని) వింటుండేవాడు. రేడియో అంటే అంతిష్టం ఉన్నందునేమో, ఆ రోజుల్లోనే రూ. 500 వెచ్చించి జపాను తయారీ శాన్యో రేడియోను కొనుగోలు చేశారు. మొన్నమొన్నటిదాకా కూడా ఉన్న ఆ రేడియోతో నాకు కూడా చెప్పుకోదగిన అనుబంధమే ఏర్పడింది. అసలు కథనంతో సంబంధం లేని మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించనీయండి…. దాదాపు అన్ని పాటల్నీ ఘంటసాల, పీ సుశీల పాడినట్లు చెప్పటం రేడియోలో వినీవిని వాళ్లిద్దరూ భార్యాభర్తలని అనుకునేవాడ్ని నేను. ఆ రేడియో శబ్ధం జగ్గయ్య కంఠంలా ఖణఖణలాడేది.
ఓ రోజు మానాన్న పాఠశాల జీతాల సొమ్ము తెచ్చేపనిలో ఒంగోలు వెళ్లాడు. మా ఊళ్లో పంచాయతీది కాక మా ఇంట్లో మాత్రమే ఆ రోజుల్లో రేడియో ఉండేదట. అందువలన సాయంత్రం అయ్యేసరికి ఊరి పెద్దలంతా రేడియో వినేందుని మా ఇంటికి వేంచేసేవారు. రేడియో కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా మా నాన్న ఊళ్లో లేకపోవటంతో ఆ సాయంత్రం ఇంటికొచ్చిన పెద్దలు రేడియో పెట్టమంటూ మా ఇంట్లోనే ఒక భాగంలో  ఉండే మా చిన్న నాయనమ్మ భర్త కోటయ్యను కోరారు. మా నాన్న రేడియో పెడుతుండగా రోజూ చూసిన తాత సులభంగానే మోత మోగించాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో ఏడు గంటలకల్లా భోజనాలు పూర్తిచేసి పడుకుంటుండేవారు. అందువలన ఆ సమయానికల్లా రేడియో శ్రోతలు ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఆ ఆనవాయితీ ప్రకారమే శ్రోతలంతా వెళ్లిపోగానే రేడియోను ఆపేయాల్సి వచ్చింది. అదిగో, అప్పుడొచ్చిపడింది అసలయిన చిక్కు. తాత రేడియో ఆపటం చూడకపోవటంతో ఏమి చేయాలో తెలియక తికమకపడ్డాడు. చేతికందిన వాటినీ, వీటినీ తిప్పాడు. ఎంతకీ రేడియో  ఆగిపోలా. చివరకు ఆయనకు ఒక విచిత్రమయిన ఆలోచన తట్టింది. ఇంకేమంది దాన్ని అమలు చేశాడు. ఇంట్లో అదనంగా ఉన్న ఒక్కొక్క దుప్పటినీ రేడియోపై కప్పి చూశాడు. ఉన్న బట్టలన్నీ కప్పినా పాటలో, మాటలో విన్పిస్తూను ూన్నాయి. అప్పుడు గోనె సంచులన్నీ తీయించి వాటిపై కప్పించాడు. మొత్తం మీద రేడియో మీద కొండలా కప్పుపడిన తర్వాత దాని పలుకులు బయటకు వినపడఁండా పోవటంతో తాతతోపాటు ఇంట్లోవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాశాఖ కార్యాలయంలో పని ూండటంతో ఆ రోజంతా ఒంగోలులోనే ఉండి మరుసటి రోజు బడి సమయానికి ఇంటికి తిరిగొచ్చిన మా నాన్న రేడియో స్థానంలో గోనె సంచుల కుప్ప కనపడి అదేమని అడగటంతో అసలు విషయం బయట పడింది. ఎంతో ఇష్టంతో, శక్తికి మించి వ్యయం చేసి కొన్న రేడియోకు తాత పట్టించిన గతిని చూసిన ఆయనకు కోపం తారాస్థాయికి చేరింది. తనదైన పద్ధతిలో తాతపై కోపం వ్యక్తం చేశాడు మా నాన్న. ఆనాటి నుంచీ తాత రాచపుండు వ్యాధితో చనిపోయేదాక కూడా ఆయనతో మాట్లాడలేదంటే మా నాన్న ఏస్థాయిలో రేడియోను ప్రేమించాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజులు అలాంటివి మరి. పాత తరం పంతాలూ, పట్టింపులూ అలా ఉండేవి. సంప్రదాయాల్నీ, నమ్మకాల్ని కూడా అదేతీరున అమలు చేసేవాళ్లు. అవి మంచివయినా, చెడువయినా!

బాలారిష్టాలు తీరాయి … ఇక బ్లాగు బాగు చూడాలి

జూన్‌ 2010న ప్రారంభించిన నా తెలుగిల్లు. వర్డ్‌ప్రెస్‌. కాం బ్లాగుకు ఇప్పటికి బాలారిష్టాలు తీరినట్లనిపిస్తోంది. బ్లాగు ప్రారంభం తప్ప మరే విషయమూ తెలియని నేను కుంచెం కుంచెం నేర్చుకుంటూ ఇప్పుడు నా మానసిక విన్యాసాలకు ఎప్పటికప్పుడు అక్షరరూపమిచ్చి పోస్ట్‌ చేయగలుగుతున్నాను. రోజూ ఒకరిద్దరయినా నా విన్యాసాలు చూసి స్పందించటం నన్ను ఉత్సాహపరుత్సోంది. ముఖ్యంగా మిత్రుడు జయదేవ్‌ గారు రోజూ తన భావాలను పంచుకోవటాన్ని స్వాగతిస్తూ, వినమ్రంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా (ఈదుమూడి) ఊరి ఫొటోను బ్లాగులో పెట్టగానే స్పందించి, బాగుందని అభినందిస్తూ, దానిని తెవికీలో పెట్టేందుకు రవిచంద్ర ఎనగంటిగారు అనుమతి కోరినా, జవాబిచ్చే దారి తెలియక బాధగానే మౌనం వహించాను. రవిచంద్రగారూ – మా గ్రామ చిత్రపటం, చాన్నాళ్లుగా తెవికీలో ఉంది. మీరు స్పందించినందుకు మాగ్రామస్తులందరి ధన్యవాదాలు అందుకోండి. మీకు సమాధానం చెప్పలేకపోవటాన్ని అర్ధం చేసుకుని నన్ను మన్నిస్తారుకదూ? ఇక మీదట వెంటనే స్పందిస్తానని మిత్రులందరికీ మాటిస్తున్నాను. తర్వాత ప్రస్తావించవలసిన వారు కొత్తపాళి. బలిపీఠం కథకు సంబంధించిన పోస్ట్‌కు ఆయన స్పందించి రవిగాంచనిచో కవిగాంచునంటూ దీవించినందుకూ, నా పోస్ట్‌లో నెలకొన్న సాంకేతిక లోపాలను ఎత్తిచూపినందుకూ ధన్యవాదాలు. నా బ్లాగు చక్కగా ఉందని అభినందించిన కేవీఎస్‌వీగారికి ధన్యవాదాలు. కొడిహళ్లి మురళీమోహన్‌గారు ఈ-మెయిల్‌ చేయమని కోరారు. ఆయన ఏమి కోరారో, ఎలా చేయాలో నాకు ఇప్పటికీ తెలియనందుకు క్షమించగలరు. మా మిత్రబృందం పెట్టబోయే రాజకీయ తెలుగు వార పత్రికకు పేరు సూచించమని కోరగా, స్పందించిన మిత్రులను ఎన్నడూ మరవబోము. అందులోనూ సీనియర్‌ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావుగారు స్పందించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు. వారి సూచించిన పేరును ఉపయోగించు కుంటామో లేదోగానీ, రష్యాలో జర్నలిస్టుగా పనిచేసిన భండారుగారిని ఆయన అనుమతిస్తే మా పత్రిక కాలమిస్టుగా ఆహ్వానించాలని అనుకుంటున్నాము. కూడలికి దయకలిగేనా అని ప్రార్థించగానే రంజనిగారు ప్రత్యక్షమవటం సంతోషదాయకం. సరే ఈ చరిత్రను అవతలబెట్టి భవిష్యత్తును పరకాయించి చూస్తే ఇంకా పరిష్కారం కావలసిన సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎవరయినా చేయూత ఇస్తే సంతోషిస్తాను.
1. నా బ్లాగుకు సొంత మాస్ట్‌హెడ్‌ (టెంప్లీట్‌ అనుకుంటాను) చేర్చాలి. ఎలా?
2. పోస్ట్‌ పాంట్‌ రూపం చిన్నదిగా ఉంది. దాన్ని రెట్టింపు చేయాలంటే దారేమిటి?
3. ఉప శీర్సికలవారీగా పేజీలు ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఆయా శీర్షికల్ని ఆ పేజీల్లోనే పోస్ట్‌ చేయలేకపోతున్నాను. ఈ సమస్యను అధిగమించవచ్చా?
4. పోస్ట్‌ వర్గాల్ని ఎలా ఏర్పాటు చేయాలి?
5. వ్యాఖ్యలు నేరుగా పోస్ట్‌ కింద పడేందుకు ఏమి చేయాలి. (ఇప్పుడు నా అనుమతి కోసం వేచి చూస్తున్నాయి మరి. దానికి కొంత ధైర్యం కావాలని తెలుసు.)
ఈ సమస్యల్ని గనుక అధిగమిస్తే అంతోఇంతో బాగా రాయగలడన్న పేరున్న జర్నలిస్టుగా నేను తెలుగు బ్లాగర్ల లోకానికి శక్తివంతంగా సేవలు అందించగలనని నమ్ముతున్నాను. మిత్రులు ప్రత్యేకించి ఈ- తెలుగు మిత్రులు చేయూత అందిస్తారని ఆశిస్తున్నాను. చేయూత అంటే దూరంగా ఉండి చెప్పటం కాదు. చేయి పట్టి (చక్రవర్తిగారూ, అంత మంతమతిని మరి) బ్లాగాడించాలని వినమ్రంగా కోరుతున్నాను.
మీ స్పందనల కోసం నిజ్జంగా ఎదెరెదురు చూస్తానూ…. మీ వెంకట సుబ్బారావు కావూరి.