దేవుళ్లూ, దెయ్యాలు ఉన్నారా(యా)? లేరా(వా)? అన్నమీమాంసను పక్కకు పెట్టి చూస్తే మన పవిత్ర (?) భారత దేశంలో నేనే దేవుడిని, నేనే దేవతనంటూ వీధికొక్కడొక్కడయినా, ఒక్కతయినా తారసపడటం కద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి పక్కా దొంగల సంగతి కాదు.
”ప్రియమైన నా తండ్రీ, ఈ రాత్రి సమయమున ఇక్కడ సమావేశమైన మా అందరినీ చల్లగా చూడుము నాయనా’ అంటూ నిత్యం అభ్యర్థించే కోట్లాది మంది నిరుపేదలకు హితబోధలు చేసే అపర తండ్రుల (ఫాదర్ల)లో ఓ నమూనా గురించి నన్ను చెప్పనీయండి.
హైదరాబాదులో పాత్రికేయ వృత్తిదారుడినయిన నేను మా ఊళ్లో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలను వీక్షిద్దామన్న కుతూహలంతో 2012 జనవరి నాలుగో తేదీ నుంచే ఒంగోలులో మకాం వేశాను. డబ్బు తెగులు పట్టిన రాంకీ అనే సంస్థ నిర్వహిస్తోన్న తెలుగు తిరనాళ్లను ఐదో తేదీ రాత్రి వేళ నా మిత్రులతో కలిసి వీక్షిస్తుండగా భోజనానికి వెంటనే రావాలంటూ వారికి మలి పిలుపు అందింది. ఓ ఫాదరు పుట్టిన రోజుసందర్భపు పార్టీ అది. వాళ్లు పోతూపోతూ వాళ్ల అతిథినైన నన్ను కూడా (వెనకటి ఎవడో వాళ్ల లాంటి పిచ్చోడెవరో పెళ్లికి పోతూ పిల్లిని చంకనేసుకు పోయాడట!) వెంటబెట్టుకు పోయారు.
అన్నట్లు ఎన్నెన్నో అనుభవాలరీత్యా ఏర్పడిన భయం నేపథ్యంలో ముందే ఒక్క విషయాన్ని మనవి చేసుకుంటాను… నేను ఏ మతాన్ని నమ్మేవారినీ కించపరచనుగాక పరచను. అయితే అది మతం కావచ్చు, మతోన్మాదం కావచ్చు…పాత్రికేయ వృత్తి ధర్మంగా ఉన్నదానిని ఉన్నట్లుగా రాయటం ధర్మమని నేను నమ్ముతానని, మీరు నమ్మి తీరాలి సుమా!
బాధితుల గృహం అని నామఫలకమున్న ఓ సుందర భవన రాజం ముందు మేము వాహనం దిగీదిగగానే ఓ యువకుడు స్వాగతం పలికాడు. చేతులు పట్టుకుని ఊపాడు. విడివిడిగా అందరి చెవుల్లోనూ ఏదో రహస్యం ఊదాడు. నా పరిచయం పూర్తయిన తర్వాత ” అందరికీ బీర్ ఏర్పాటు ఉంది సార్” అంటూ ఆ రాజకోట రహస్యాన్ని నా చెవిలోనూ ఊదాడా యువకుడు. వాస్తవానికి ఆ విషయాన్ని ముందుగానే నా మిత్రులు వాసన చూపించారు. అది … ఉంటే ఉండొచ్చు. దాని జోలికి వెళ్లం కాబట్టి మనం తినేసి వద్దాం అంటూ నా మిత్రుడు ముందే వివరించాడు. ఒకటో రెండో శాకాహార పదార్ధాలూ ఉంటాయి కాబట్టి నీకూ ఇబ్బంది ఉండదు అని కూడా చెప్పాడు.
సరే, మళ్లీ అసలు విషయానికొద్దాం…. మేము లోపలికి వెళ్లే సరికే సదరు ఫాదరు మరొక ‘తండ్రి’తో కలిసి భోజనం లాగించేస్తున్నాడు. ఇక్కడ నేనే చెప్పొచ్చేదేమంటే అతిథులు రాకముందే తన పని తాను సుష్టుగా చేసేస్తోన్న ఫాదరు వైఖరి నాకు ఏ మాత్రం నచ్చలేదు. దేశానికి రాజయిన సరే సంప్రదాయాలను పాటించాలిగదా? ఇక్కడ నాకు నచ్చిన విషయం గుర్తుచేస్తాను. తండ్రులు, వారి కుమారులు పాదరక్షలను వీడకుండానే అదీ ఇంట్లో భోజనం చేసేస్తున్నారు. ఇప్పుడు విందుల్లో హిందువులు కూడా అదే పాటిస్తున్నారనుకోండి. అయితే ఇలా చెప్పులతో ఇంట్లో తిరగటం సరైనదేనా అంటే… అన్ని వేళలా, చోట్లా అందులోనూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అదీ మనదేశంలోయితే కాదనే అంటాను. అదే తీరున అన్ని చోట్లా, అన్నివేళలా దాన్ని విధిగా పాటించాల్సిన విధీ లేదంటాను. ఎక్కడికక్కడి పరిస్థితులను బట్టి చెప్పుల్ని వదిలేయటమో, వదిలేయకపోవటమో అనుసరించదగినదని భావిస్తాను. మాంసాహారం, పండ్లూ, కిల్‌డ్రింకులూ, హిమక్రీములతో షడ్రసోపేత భోజనం అవిరులు కక్కుతోందక్కడ. హోం థియేటర్ నుంచి పాశ్చాత్య సంగీతం ప్రవహిస్తోంది. సదరు ఫాదరు ఈ ఉదయమే ఘనాతి ఘనంగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకల చిత్రాలు ఓ పదివేల రూపాయల విలువయిన విదేశీ డిజిటల్ ఫొటో ఫ్రేములో చలిస్తున్నాయి. సంప్రదాయం కాదుగానీ అలవాటు రీత్యా శాకాహారినైన నేను కొద్దిగా పెరుగన్నాన్ని మాత్రమే లోపలికి పంపగలిగాను. కోకోకోలా అనబడు ఓ డబ్బా కిల్‌డ్రింకునూ కొద్దిగా సేవించాను. కాకపోతే బాగా ఉండటంతో నాలుగంటే నాలుగు తీపితీపి కిళ్లీల్ని మాత్రం పరపరా నమిలేశాననుకోండి. అంతా అయిన తర్వాత ఆ భవనం సోయగాలను వీక్షిస్తూ, అంచనా వేస్తూ, కోట్ల మంది కనీసం అడుగు పెట్టలేని కోట ఒక్క ఫాదరుకే ఉండటాన్ని మనస్సులోనే ప్రశ్నించుకుంటూ బయటపడ్డాము. ”ఇదేముంది, ఫాదరుగారి రూము ఉందీ… అదిరిపోద్ది” నా మిత్రుడి వ్యాఖ్యానాన్ని గుర్తుచేస్తూ ఈ రచనను ముగిస్తాను.
5 జన
Posted by vanajavanamali on జనవరి 6, 2012 at 4:24 ఉద.
పాదర్ ల ముసుగులు తీస్తే ఇలాటి వాస్తవాలు కోకొల్లలు. మంచి విషయం చెప్పారు.
Posted by చిలమకూరు విజయమోహన్ on జనవరి 7, 2012 at 2:35 ఉద.
ఇలా ఫాదరీల పంక్షన్లలో,పార్టీలలో తీసుకునే మాంసాహారం, పండ్లూ, కిల్‌డ్రింకులూ, హిమక్రీములతో షడ్రసోపేత భోజనాల మహిమ వల్లనేనేమో భారతదేశ పాత్రికేయులంతా ఎక్కువగా క్రైస్తవభజన చేస్తూ హిందూమతం మీద పడి విమర్శచేస్తూ ఉంటారు.
Posted by శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU on జనవరి 26, 2012 at 12:36 సా.
If similar party is thrown by a Hindu Priest what would have been the reaction and negative coverage of the media.