ధరాభారం … ఒంటరి తనం – సమస్యలకు సమాధానమే ఉమ్మడి నిర్మాణం

అది హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇద్దరు ఇంజినీరింగు ఆచార్యులను కలిసేందుకు ఆర్కిటక్ట్‌ ఒకరు అక్కడకు వెళ్లారు. ముగ్గురూ ముచ్చటాడుతుండగా….
ఆచార్యుడు – 1 : నాకూ, వీరికీ పక్కపక్కనే చెరొక వంద చదరపు గజాల స్థలాలున్నాయి. సరిపోనంత లేనందున ఇల్లు కట్టుకోలేక పోతున్నాము. పోనీ రెండింటినీ కలిపి ఒకరు తీసుకుందామంటే మా ఇద్దరి దగ్గరా అంత డబ్బు లేదు. ఏమీ పాలుపోవటం లేదు.
ఆర్కిటెక్ట్‌ : నేనో ఉపాయం చెప్పనా?
ఆచార్యుడు – 2 : భలేవాడివే చెప్పు, చెప్పు.
ఆర్కి: సరే మంచిది. రెండు స్థలాలనూ కలిపేసి ఇంటిని కట్టుకోండి. లాటరీ వేసి ఎవరు కింద ఉండాలో? ఎవరు పైన ఉండాలో తేల్చుకోండి.
ఆచా1 – 2 : ఇదేదో ఆలోచించదగిందిగా ఉందే.
అంతలోనే మరొక ఆచార్యుడు అక్కడకు వస్తూనే… ఏవో రహస్యంగా ప్లాన్లు వేస్తున్నట్లున్నారే! చమత్కరించాడు.
ఆచా – 2 : రహస్యాలా? పాడా!. మా ఇద్దరి స్ధలాల్నీ కలిపి రెండంతస్తుల ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాము.
ఆర్కి : ఇష్టమయితే మీరూ కలవచ్చు. మూడంతస్తులు వేసి, తలా ఒకటి తీసుకోవచ్చు.
ఆచార్యులంతా ఓ పావు గంటసేపు తర్జనబర్జనపడ్డారు. స్థలం ధరలో మూడో వంతును మూడో ఆచార్యుడు చెల్లించే విధంగానూ, కట్టుబడి ఖర్చు ముగ్గురూ భరించేవిధంగానూ ఒప్పందం కుదిరింది. అటూ ఇటూ కాని స్థలాలున్న వారి సమస్య, అసలే లేని ఆచార్యుల సమస్య పరిష్కారమయింది. మరుసటి రోజు నుంచీ పనులు ప్రారంభమయ్యాయి. ఇక రేపో, మాపో లాటరీ తీసి ఎవరికి వచ్చిన అంతస్తులో వాళ్లు కాపురం పెట్టేయటమే తరువాయి.
—————————————————————————–
శరత్‌ : హలో, సాగర్‌ నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను.
సాగర్‌ : హాయ్‌! శరత్‌, మా అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది. పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. మీరేమీ కంగారు పడాల్సిన పనేలేదు. పనులన్నీ చూసుకుని రండి.
శరత్‌ : అదేమిటీ? మీ అమ్మగారికి కూడా బాగాలేదా? హతవిధి! నేను మా అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో? కనుక్కుందామని ఫోను చేశాను. అయ్యో! మీరూ బాధల్లో ఉన్నారన్నమాట.
సాగర్‌ : శరత్‌, మీ అమ్మగారే – మా అమ్మగారయ్యా! మనమంతా ఒక్కటే. వాస్తవానికి నేను చెప్పింది మీ అమ్మగారి గురించే.
కొందరు మిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌వాసులే సాగర్‌, శరత్‌లు. సాధారణంగా అపార్ట్‌మెంట్లలో గాలించినా దొరకని ఆప్యాయత, స్నేహ మాధుర్యాలు వారి మధ్య పరిమళించటం వెనుక ఏ సూత్రం దాగి ఉందో? తెలుసా!
—————————————————————————–
ప్రతాప్‌ : అదేంటయ్యా ప్రసాద్‌, మీ ఆవిడ ఇంట్లో లేనప్పుడు మమ్మల్ని భోజనానికి ఆహ్వానించావు? నువ్వే చేతులు కాల్చుకుంటావా ఏంది? అయినా ఎందుకు చెప్పు. మేమేదో ఒక హోటళ్లో ఇంత తినేసి మా ఊరికి చెక్కేసేవాళ్లం కదా!
ప్రసాద్‌ : అయ్యయ్యో! అంత మాట అనకండి సార్‌. మాకు ఇంత నీడ కల్పించిన ఇంజినీరు మీరు. మీరు మా ఊరు వచ్చి హోటల్లో తింటే ఊరుకుంటామా! ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టిచూడండి.
పావు గంట గడిచిందో లేదో బిలాబిలామంటూ పలువురు ఆ ఇంట్లోకి దిగబడ్డారు. అందరి చేతుల్లోనూ గిన్నెలు. హాట్‌బాక్సులు, ఆవకాయ, చింతకాయ తదితర పచ్చళ్ల సీసాలతో దిగబడ్డారు. కమ్మని నెయ్యి వాసన. మూతలు తీసి చూస్తే నాలుగయిదు గిన్నెల్లో గడ్డ పెరుగు. మజ్జిగ చారు, వడియాలు, అప్పడాలు, గారెలు, బూందీ, మైసూర్‌పాక్‌. ఇక లేని కూరే లేదు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఇంజినీరు వంతయింది. బంధుమిత్రులు కలిసి సొంతంగా నిర్మించుకున్న ఆ అపార్ట్‌మెంటుకు రూపకల్పన చేసింది ఆయనే. స్నేహం, బంధుత్వం, సహాయం, చేయూత, అండదండలు ఇలా మానవత్వానికి మారుపేరుగా నిలిచే ఆప్యాయతలన్నీ సొంతంగా నిర్మించుకునే అపార్ట్‌మెంట్లో వెల్లివిరుస్తాయని ఊహించాడుగానీ ఇంత ఇదిగా ఉంటాయని అనుకోలేదు. ఈనాటి అపార్ట్‌మెంట్లలో ఏవయితే కొరవడ్డాయని ఆందోళన వ్యక్తమవుతుందో, అవన్నీ అక్కడ సాకారమయ్యాయి. తన ఊహ నిజమయి అక్కడ దర్శనమివ్వటంతో ఆనంద భాష్పాలు రాలాయి. నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద …అమ్మ తన చిన్ననాట తినిపించిన గోరుముద్దను గుర్తుకు తెచ్చింది.
సమస్యలు ముదరుపాకాన పడి సమాజాన్ని పట్టిపీడిస్తున్నప్పుడు వాటిని పరిష్కరించటానికి తాను అన్ని యుగాల్లోనూ జన్మిస్తానని చెబుతాడు విష్ణువు. అదెంత నిజమోగానీ, చిన్నదో పెద్దదో సమస్య కొనసాగుతుంటే మాత్రం దాన్ని పరిష్కరించేందుకు పరిశోథకులు పూనుకోవటం, కద్దు. అలా ఇప్పటిదాకా కోట్లాది సమస్యలు పరిష్కారం అయిన విషయం అందరికీ విదితమే. కూడు, గుడ్డ తర్వాత అత్యవసరమైన గూటిని సాకారం చేసుకునే పనిలో నగరవాసులు ,పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
నానాటికీ ఆకాశాన్నంటుతోన్న స్థలం ఖరీదులే ప్రథమ సమస్య. ఏదో ఒక విధంగా స్థలాన్ని సమకూర్చుకుని సొంత ఇల్లు కట్టుకుందామంటే క్షణం క్షణం మీదపడే సమస్యలతో ఎవ్వరికైనా వైరాగ్యం కలుగకపోతే అనుమానించాల్సిందే.
పోనీ అపార్ట్‌మెంటు ఫ్లాటు కొనుక్కుని బతుకీడుద్దామనుకుంటే అది ఒంటిరిగా ఎదుర్కోవాల్సిన మహా నరకం. ప్రాణాలు పోతున్నా పలికేనాధుడుండడు. ఈ పక్కవాళ్లు తెలియదు. ఆ పక్కింటివాళ్లు అసలు తలుపే తీయరు. ఫాట్లో దొంగలు పడి దోచుకుపోతుంటే చూసీ చూడనట్లే వ్యవహరించే ధోరణి అతి సాధారణం.
ధరాభారం … ఒంటరితనం అక్కడ వేధించవు
ఈ సమస్యల పరిష్కారానికి దొరికిన సమాధానమే … ఉమ్మడి నిర్మాణం. అంటే అపార్ట్‌మెంటును సొంతంగా నిర్మించుకోవటమే. బంధుమిత్రులు ఒప్పందం చేసుకోవటంతో ఇది మొదలవుతుందన్నమాట. కాస్త వెసులుబాటుగా ఇంటిని నిర్మించుకోవాలనుకున్నవాళ్లు కొనేంత స్థలమే దీనికీ సరిపోతుంది కాబట్టి, ధర భారం కాదు. ఇక అపార్ట్‌మెంటు వాసులంతా బంధువులుగానో, మిత్రులుగానో, సహచరులుగానో ముందునుంచే బాగా తెలిసినవాళ్లయినందున ఆప్యాయత, అనురాగాలకు కొరవుండదు. దీని వలన రెండు ప్రధాన సమస్యలూ పరిష్కారమవుతాయి. ఇక లాభాలు తీయరుగనుక ఫ్లాటు ఖరీదు కూడా కొనుక్కున్నదానికన్నా కనీసం 20 శాతం తక్కువకే గిట్టుబాటవుతుంది.
చదరపు గజం రూ. 15 వేల చొప్పున కొన్న 250 చదరపు గజాలలో ఓ సొంతిల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ. 1000 చొప్పున 1250 చదరపు అడుగుల మొత్తం కట్టుబడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుంది.
అదే 370 చదరపు గజాలలో రెండు ఇళ్లు నిర్మిస్తే 20 శాతం తక్కువగా అంటే రూ. 40.25 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. దీనినిబట్టి ఎంతమంది కలిసి కట్టుకోబోతున్నారో దానికి అనుగుణంగా స్థలాన్ని కొనుగోలు చేస్తే ధరాభారం తొలగిపోతుంది. ఒక్కరే సొంతగా ఇంటిని నిర్మించుకుంటే స్థలం ధర మొత్తాన్నీ వారొక్కరే భరించాలి. అదే స్థలంలో అపార్ట్‌మెంటు నిర్మిచుకుంటే ఆ స్థలం ఖరీదును అందరూ పంచుకుంటారుగనుక అసలు భారమే కాదు. అందువలన ఇంటి విషయంలో ఇప్పటి వరకూ ధరాభారం సమస్యను పరిష్కరించే సూత్రం ఇదొక్కటే.
ఉమ్మడి నిర్మాణంలో బంధాలు – అనుబంధాలు
బంధువులుగానీ, మిత్రులుగానీ, ఒకే కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగానీ, ఒకే ఆలోచనతో పనిచేసే బృందంగానీ కలిసి సొంతంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి దిగితే కొద్దిపాటి సమస్యలున్నా పలు సమస్యలు పరిష్కారం అవుతాయనటంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి ప్లాను ఆమోదం, రుణం మంజూరు తదితర పనులు ఉమ్మడిగా అయితే సులభంగానూ, లంచాలు, కాళ్లతిప్పటా లేకుండా పూర్తవుతాయి.
– ఉమ్మడి నిర్మాణాలను ఇద్దరు మొదలు ఎంతమందయినా కలిసి చేసుకోవచ్చు.
– స్థలం ధరను అందరూ పంచుకుంటారు.
– ఏ పరిసరాలున్న స్థలాన్ని ఎంపికచేసుకోవాలో యజమానులే నిర్ణయించుకోవచ్చు. ధర సమస్య కారణంగా ఊరవతల కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఊరిమధ్యలోనూ కొనొచ్చు.
– భవన నిర్మాణ తీరును నిర్ధేశించవచ్చు.
– నిర్మాణ సామగ్రిని టోకున సరసమయిన ధరకు కొనుగోలు చేయవచ్చు.
– భారాన్ని పెంచే ఏ పనీ చేయనవసరం లేదు.
– చెట్లు నాటేందుకూ, ఆటలకూ ఇలా ఇష్టమైన వాటికి తగిన స్థలాన్ని కేటాయించుకోవచ్చు. అంతగా అవసరం లేని హెలీప్యాడ్‌లు లాంటివాటి జోలికి వెళ్లాల్సిన పనిలేదు.
– నిర్మాణ పనుల్లోనూ, తర్వాత రోజూవారీ ఎదరయ్యే పనులనూ సొంతంగా నిర్వహించి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. వ్యక్తిగత శక్తిని పెంపొందించుకునే వీలుంటుంది. ప్రదర్శించి అందరి మన్ననలనూ అందుకోవచ్చు.
– ప్రతి దానినీ అత్యధికుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్వహించే పద్ధతిద్వారా అది మనదేనన్న భావన పెంపొందుతుంది. ఆ మేరకు ఫలితాలు కూడా ఆశించినమేర వస్తాయి.
– కలిసి ఉంటే దక్కే సుఖాలనూ, సౌలభ్యాలనూ నిజంగా అందరూ అనుభవించవచ్చు.
– ముఖ్యంగా కష్టసమయంలో అందరి అండదండలూ అందుకోవచ్చు. ఆనందాన్ని అందరూ కలిసి ఆస్వాదించవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: