ఖూనీ (కథ) వెంకట సుబ్బారావు కావూరి

అర్ధరాత్రి దాటి అప్పటికి పావుగంట గడిచింది. డిసెంబరు మాసపు చలిగాలి వణుకు పుట్టిస్తోంది.
హైదరాబాదు శివారులోని చైతన్యపురిలో వీధి దీపాల వెలుగుల్ని మంచు తెరలు అడ్డగిస్తున్నాయి. ఎక్కడన్నా ఒకటీ అరా ఇళ్లలో తప్ప అలికిడి సద్దుమణిగింది. గూర్ఖా లాఠీ టకటకలు ూండుండి ప్రతిధ్వనిస్తున్నాయి. లాఠీ చప్పుళ్లకు కుక్కలు బౌభౌమంటూ ప్రతిస్పందిస్తున్నాయి. ”నీ తోలు వలుస్తాం” అన్నట్లుగా ఎగిరెగిరి దూకుతున్నాయి.
దేవాలయం వీధి మొగదల్లో ూన్న మానస బహూళ అంతస్తుల భవనంలోని శరత్‌బాబు నివాసంలో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. ూయ్యాల మంచంమీద మీద అడ్డదిడ్డంగా పడుకుని చదువుకుంటున్నాడు శరత్‌బాబు. రచయిత కర్లపాలెం హనుమంతరావు ‘తెలుగు తక్కువతనం’ శీర్షికతో ఆనాటి దినపత్రికలో రాసిన వ్యాసాన్ని దీక్షగా చదువుతున్నాడు. ”రాళ్లులేని బియ్యమైనా చౌకధరల దుకాణాల్లో దొరకటం తేలికేమోగానీ దొరల భాష దొర్లని తెలుగు పలుకులు వినటం దుర్లభంగా ఉంది”. మొదటి వాక్యం చదవటంతోనే ”ఈ కర్లపాలెం ఎవరోగానీ ఇన్నాళ్లుగా నేను పడుతోన్న వేదనను అర్ధం చేసుకున్నాడల్లే ఉంది” అనుకున్నాడు మనస్సులో. ”తెలుగు పంతుళ్లకు సైతం తెలుగులో సంతకం చేయటం నామోషీ” ”అబ్బబ్బ ఎంత బాగా చెప్పాడో” అనందం పట్టలేక పైకే అనేశాడు. రచయితకు జేజేలు పలికాడు. వ్యాసం చదవటం పూర్తయేసరికి శరత్‌బాబును మాతృభాషాభిమానం పూర్తిగా ఆవరించింది. ఏదో తెలియని ఆవేశం అతడిని ూక్కిరిబిక్కిరి చేసింది. మాతృభాష మృతభాషయితే తెలుగు జాతి బానిస బంధాల్లోకి చేరినట్లే. సొంత భాషను కోల్పోయిన జాతి తన సంస్కృతినీ, సంప్రదాయాలనూ చేజార్చుకోకతప్పదని శరత్‌బాబు దృఢాభిప్రాయం. చివరకు వ్యక్తికీ, సంఘానికీ ముఖ్యమయిన ఆలోచనలు సైతం పరాయీకరణ పొందుతాయని అతని భయం. పగలంతా కంప్యూటరుతో కుస్తీపట్టిన మనసు విశ్రాంతి కోరుకుంటున్నట్లుగా ఆవలింతలు మొదలయ్యాయి. ఆలోచనలు గింగరాలు తిరుగుతూ నిద్రను చెడగొడుతున్నాయి.”ఏదో ఒకటి చేయాలి” అనుకుంటూ కళ్లు మూసుకున్నాడు. గోడమీదున్న గడియారం కేసి చూస్తూనే లేచాడు శరత్‌బాబు. గబగబా బట్టలు మార్చుకుని కిందకు దిగాడు. తన వాహనం చెంతకు చేరుతూనే ద్వారం తాళం తీయమంటూ భవనం కాపలాదారు అదవానీని కేకేశాడు. అదవానీ తన గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
”నమస్తే, శరత్‌ భాయ్‌” గుత్తిలో తాళం వెదుక్కుంటూ చెప్పాడు అదవానీ. అదవానీది రాజస్తాన్‌. తండ్రి హయాంలోనే ఆయన కుటుంబం పని వెదుక్కుంటూ హైదరాబాదుకు చేరుకుంది. అదవానీ ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఇంట్లో హిందీ ూపయోగించినా బయటి స్నేహాల కారణంగా తెలుగు మాట్లాడటం బాగానే అలవాటయింది.
”పగలూ, రాత్రి పనిచేస్తే ఆరోగ్యం పాడవుద్ది. జర జాగ్రత్తగా ఉండుండ్రి భాయ్‌” బిడ్డకు తండ్రి చెప్పినట్లుగా హెచ్చరించాడు అదవానీ తలుపుల్ని బార్లా తెరుస్తూ.
వాహనం బయలుదేరగానే వినయంగా వంగి మళ్లీ నమస్కరించాడు. అలా ఏ సమయానబడితే ఆ సమయాన శరత్‌బాబు వెళ్తుండటం అదవానీకి అనుభవమే. రెండేళ్ల క్రితం ఎంటెక్‌ పూర్తిచేసుకున్న వెంటనే లయ కంప్యూటర్స్‌లో ఆరెంకల జీతంతో ఉద్యోగంలో చేరాడు శరత్‌బాబు. తాను బాగా ఇష్టపడే గ్రామీణ వాతావరణం పూర్తిగా లేకపోయినా, నగరం వెలుపల ప్రశాంతత పుష్కలంగా ఉన్న చైతన్యపురిలో ఇల్లు కొనుక్కుని ఉంటున్నాడు. ఇల్లు కట్టిచూడు, పెళ్లిచేసి చూడని పెద్దలు ఏనాటి నుంచీ భయపెడుతున్నారోగానీ శరత్‌బాబు ఇల్లు చూసుకున్నాడు. అయితే పెళ్లి చేయాలన్న అతని తల్లిదండ్రుల కోరిక రెండేళ్లగా నెరవేరటం లేదు. ూద్యోగంలో చేరిన తొలి ఏడాది కొన్ని సంబంధాలు వచ్చినా శరత్‌బాబుకు నచ్చక అవేవీ మూడు ముళ్లు – ఏడడుగులదాకా రాలేదు. ఆ తర్వాత రాజీపడ్డా పిల్ల దొరకటం లేదు. పైసా కట్నం వద్దన్నా సంబంధాలు కుదరటం లేదు. బ్రహ్మచారి ముదిరి పాకాన పడుతుంటే తల్లిదండ్రుల్లో దిగులు అంతకంతకూ పెరుగుతోంది. ఆనాటి బాధలరీత్యా మనసా, వాచా, కర్మణా అమ్మాయిలు పుట్టకూడదనుకున్న నిన్నటితరం దంపతుల ఆలోచనలు, చేష్టలు ఈనాడు శరత్‌బాబులాంటి బ్రహ్మచారులపాలిట శాపమయికూర్చుంది. పిండికొద్దీ రొట్టె అన్నట్లుగా కర్మ కొద్దీ ఖర్మ మరి. బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ 12వ వీధిలోకి శరత్‌బాబు వాహనం మలుపు తిరిగింది. తనకు కావాల్సిన చిరునామా వెదుక్కునే పనిలో వాహన వేగం తగ్గించాడు. అతని మదిలో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ‘ఎపుడోకపుడు…ఎవరో ఒకరు వేయరా ముందుగా అడుగు అటో ఇటో ఎటోవైపు” అతనికిష్టమయిన అంకురం సినిమా పాట వింటూ దోవ వెదుక్కుంటూ వాహనాన్ని నడుపుతున్నాడు. ”ఉరిశిక్ష పడినా సరే, అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయాల్సిందే. త్రాష్టులకు గుణపాఠం నేర్పాల్సిందే.” ఎడమచేతి వేళ్లను గుప్పిటపట్టి ధృడంగా అనుకున్నాడు మనస్సులోనే. వాహనం జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషను దాటింది. అక్కడ మరో వీధిలోకి వాహనాన్ని మలుపు తిప్పుతూనే అతని కళ్లు దేనికోసమో వెదికాయి. ఆ వీధి రెండు వైపులా చీలిపోయే దగ్గర ఎదురుగా ఉన్న భవనంపై శరత్‌బాబు దృష్టి పడింది. ‘రేడియో కారం కారం ఎఫ్‌ఎం స్టేషన్‌’ దగ్గరయేకొద్దీ ఆ భవనం రెండో అంతస్తు గోడకు వేలాడదీసి ఉన్న బోర్డు అక్షరాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. శరత్‌బాబు మనస్సు ఆ అక్షరాలను చదవగా, పటపటమని పళ్లు శబ్దించాయి. రక్తమంతా పోగుబడిందా అన్నట్లుగా ముఖం ఎర్రబారింది. ఆ భవనానికి కొంచెం దూరంగా వాహనాన్ని నిలిపేసి దిగాడు. చేతులు కొద్దిగా వణకటం ప్రారంభమయింది. అయినా మనస్సు మాత్రం ఛలించలేదు. రెండు పిడికిళ్లూ బిగించాడు. కళ్లు మూసుకుని నిలబడ్డాడు. ‘రిలాక్స్‌ … రిలాక్స్‌ … రిలాక్స్‌’ సైక్రియాటిస్ట్‌ పట్టాభిరాం దగ్గర నేర్చుకున్న స్వీయ హిప్నటిజంతో ఒత్తిడి నుంచి క్షణాల్లోనే బయటపడ్డాడు. అక్కడ నుంచి ముందుకు కదిలాడు. కుర్చీలోనే కునికిపాట్లు పడుతోన్న కాపలాదారు శరత్‌బాబు రాకను చూడలేదు. దీంతో కారంకారం ఎఫ్‌ఎంస్టేషను లోపలికి పోవటం సులభమయింది. వరుసగా ఉన్న గదుల ద్వారాల పక్కన రాసిన పేర్లు చదువుకుంటూ ముందుకెళ్తుండగా, అతనికి కావలసిన గది దొరికింది. ‘రెస్ట్‌ రూం’ మరొక్కసారి చదివాడు. అతను వెదికేది ఆ గది కోసమే. పని ముగిసినా రాత్రివేళ ఇళ్లకు వెళ్లలేని జాకీలు, ఉదయాన్నే పనిలోకి దిగాల్సిన వారూ అందులో విశ్రాంతి తీసుకుంటారని శరత్‌బాబు ముందే తెలుసుకున్నాడు. నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలకు అడుగుపెట్టాడు. ఉదయాన్నే పనిలోకి దిగాల్సిన జాకీ కిసీజా నిద్ర రాకపోవటంతో ఏదో పుస్తకం చదువుకుంటోంది. తలుపు తీసిన చప్పుడికి తలెత్తి చూసిందామె. ”ఎవరు కావాలి” ప్రశ్నించింది. ”ఎవరో ఒకరు, నువ్వు దొరికావుగా చాలు” కరుకుగా సమాధానమిచ్చాడు శరత్‌బాబు. శరత్‌బాబు సమాధానంతోపాటు ముఖంలోనూ తేడా గమనించిన కిసీజాకు ఒకింత భయమేసింది. కుర్చీలో నుంచి తటాల్న లేచింది. అతని తీరుచూసి ఆమె అణువణువూ వణకటం ప్రారంభమయింది. అయినా ధైర్యం తెచ్చుకుని ”హA ఆర్‌ యూ,…హA ఆర్‌ యూ” గద్గద స్వరంతో ప్రశ్నించింది. అయినా శరత్‌బాబు మారుమాటాడకుండా మీదకు వస్తుండటంతో కిసీజా లేస్తూనే కుర్చీని పక్కకు నెట్టేసింది. అంతేవేగంగా వెనక్కు జరిగి గోడకు అతుక్కుపోయింది. అదే సమయంలో తన చొక్కా పైకెత్తి జీన్సు పంట్లాములో దోపి ఉన్న పిస్తోలును బయటకు తీశాడు. ఆమెకు గురిపెట్టాడు. కిసీజాకు ఏమి జరుగుతుందో అర్ధమే కావటం లేదు. అరుద్దామంటే నోరు పెగలటం లేదు. నోరు క్షణంలో పిడచకట్టుకు
పోయింది. కనీసం తనజోలికి రావద్దని బతిమలాడుదామన్నా పెదాలు విప్పారటం లేదు. పారిపోయేందుకు
ముందుకు గెంతబోతుండగానే, శబ్దనివారిణి ూన్న పిస్తోలు పేలటం ప్రారంభమయింది. వెంటవెంటనే బులెట్లు ఆమె శరీరంలోకి దూసుకుపోయి మాటాపలుకు లేకుండా కిందకు వాలిపోయింది. ఆమె శరీరం నుంచి స్రవిస్తోన రక్తం తెల్లటి గ్రానైటు రాయిని ఎర్రబరుస్తోంది. శరత్‌బాబు ముఖం విప్పారింది. మనసారా నవ్వుకున్నాడు. ముందే రాసి తెచ్చిన ఓ లేఖను జేబునుంచి తీసి నిర్లక్ష్యంగా మేజాబల్ల మీదకు విసిరాడు. అది గాలికి ఎగిరిపోకుండా బరువు పెట్టాడు. ఇక తనపని అయిపోయిందన్నట్లుగా వెనుదిరిగాడు. ఇంత జరిగినా కాపాలాదారు మేల్కోకపోవటంతో లోపలకు వెళ్లినంత సులభంగానే బయటకు వచ్చాడు శరత్‌బాబు. రోజూ పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసే కాపాలాదార్లు ఏ మాత్రం అవకాశం చిక్కినా కునకటం కద్దు. అదే అవకాశంగా హత్యచేసి కూడా శరత్‌బాబు పట్టుబడకుండానే బయటపడ్డాడు. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా వాహనాన్ని ముందుకు దూకించాడు. అక్కడే వెనక్కు తిప్పుకుని జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషను వైపు పోనిచ్చాడు.
”సార్‌” బల్లపై కాళ్లుపెట్టి నిద్రపోతోన్న ఎస్‌ఐని పిలిచాడు శరత్‌బాబు. అలికిడి విని కునికిపాట్లు పడుతోన్న కానిస్టేబులు మేలుకుని హడావుడి పడ్డాడు. శరత్‌బాబు చెంతకు వస్తూనే ”ఎవరు నువ్వు? ఏం కావాలి?” ప్రశ్నలు సంధించాడు గబగబా.
”ఎస్‌ఐ గారిని లేపండి, చెబుతాను” సున్నితంగా చెప్పాడు శరత్‌బాబు.
”అవసరమయితే లేపుతాగానీ, నీ పనేందో ముందు నాకు చెప్పవయ్యా.” విసుక్కున్నాడు కానిస్టేబులు.
”నేను ఖూనీ చేశాను” శరత్‌బాబు నెమ్మదిగా చెబుతూ జేబులో నుంచి పిస్తోలును తీసి టేబుల్‌మీద పెట్టాడు.
కానిస్టేబులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అంతలోనే తేరుకుని…. ”ఏంటీ? ఖూనీ చేశావా? ఎవర్ని? ఎక్కడ? వెంటవెంటనే ప్రశ్నించాడు. ”ఎస్‌ఐని లేపు, ఆయనతోనే చెబుతాను” శరత్‌బాబు కరుకుగా సమాధానం చెప్పటంతో చేసేదిలేక ఆయనను నెమ్మదిగా తట్టిలేపాడు కానిస్టేబులు. ఎస్‌ఐకు ఎంతకూ ఆవలింతలు ఆగలేదు. అది గమనించిన కానిస్టేబుల్‌ బిస్లరీ మినరల్‌ వాటరు బాటిల్‌ తెచ్చి ఎస్‌ఐకి అందించాడు. ఎస్‌ఐ దాహం తీర్చుకుని, మొహం కడుక్కున్నాడు. ఏమిటన్నట్లుగా శరత్‌బాబు ముఖంలోకి చూశాడు. ”కారం కారం ఎఫ్‌ఎం రేడియో జాకీని చంపేశాను సార్‌…..శరత్‌బాబు చెప్పటం ప్రారంభించాడు.
అది ప్రత్యేక న్యాయస్థానం. కారం-కారం ఎఫ్‌ఎం రేడియో జాకీ కిసీజా హత్య సంఘటన నేపధ్యం ప్రత్యేకమయినదని భావించిన హైకోర్టు ప్రత్యేక విచారణకు ఆదేశించింది. వారం క్రితమే విచారణ పూర్తయింది. కిసీజాను తాను హత్య చేసినట్లు అంగీకరించి, వాదనకు దిగాలని శరత్‌బాబు ముందే నిర్ణయించుకున్నందున న్యాయస్థానం పని సులువయింది. న్యాయవాదిని పెట్టుకోకుండా న్యాయస్థానానికి చెప్పాల్సిందేదో తనే సూటిగా చెప్పాడు. కిసీజా మరణానికి కారణమయిన బులెట్లు కూడా అతని పిస్తోలువేనన్న నివేదిక అంతకు ముందే న్యాయమూర్తికి చేరింది. సాయంత్రం నాలుగు గంటలవుతుండగా ప్రత్యేక న్యాయస్థానం సమావేశం ప్రారంభమయింది. రెండు మూడు వందల పేజీలున్నట్లుగా కన్పిస్తోన్న ఓ లావుపాటి పుస్తకాన్ని తీసి న్యాయమూర్తి చదవటం ప్రారంభించారు. ” ……. నిందితుడు శరత్‌బాబు ఆరోపించినట్లుగా తెలుగు భాషను ఎఫ్‌ఎం రేడియో జాకీలు ఖూనీ చేస్తున్న మాట వాస్తవమేనని ఈన్యాయస్థానంతోపాటు ప్రత్యేకంగా నేను కూడా అంగీకరిస్తున్నాను. వాళ్లు తెలుగు భాషను నిలెవెత్తున హత్య చేస్తున్న మాట కూడా నిజమే. మాతృభాషలో చదివే విద్యార్థుల సంఖ్య 30 శాతం లోపుకు పడిపోయినందున తెలుగు త్వరలోనే మృత భాష జాబితాలో చేరనుందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు……. తెలుగు భాషలో ప్రసారాలు చేస్తామని అనుమతులు తీసుకున్న ఎఫ్‌ఎం రేడియో సంస్థల యాజమాన్యాలే దీనిలో అసలయిన నేరస్తులు. ఏ భాషో తెలిసే వీలేలేకుండా మాట్లాడే వాళ్లనే జాకీలుగా నియమించటమే వాళ్ల తొలి నేరం. ఒకటి రెండు తెలుగు పదాలకు సొంత యాసతో పలికే ఆంగ్లం, మరికొంత ఉరుదు, ఇంకొంత హిందీ, కొందరయితే ఇంకేవేవో మరికొన్ని భాషలనూ కలగలిపి మాట్లాడే జాకీల తీరు మాతృభాషాభిమానులకు నిజంగానే పిచ్చెక్కిస్తుందంటే మరో వాదానికి తావులేదనే నేనే భావిస్తున్నాను. భాషా దినోత్సవం సందర్భంగా ఏవేవో హామీలు గుప్పించటం తప్ప నానాటికీ నామరూపాలు లేకుండా పోతోన్న తెలుగు భాషనూ, సంస్కృతినీ, సంప్రదాయాలనూ రక్షించుకునేందుకు ప్రభుత్వంగానీ, అధికారులుగానీ, చివరకు తెలుగు భాషా సంఘం కూడా పట్టించుకోకపోవటం క్షంతవ్యంకాని నేరం……. అన్నట్లు ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం లేదుగానీ, ఈ మధ్య అనుకోకుండా నేను విన్న ఎఫ్‌ఎం రేడియో జాకీల భాషని ఈ సందర్భంగా గుర్తుచేయాలనుకుంటున్నాను. ‘హ్యెలో, హెవ్వార్యూ, మీస్‌ జోతిక్క….మొదట మగ గొంతుక ప్రశ్నించింది. హెAయ్‌, ఆం ఫై షుణీళ్‌, మన ప్రోగ్రాం కోసం గైస్‌ అండ్‌ గాళ్స్‌ తెగతెగ ఎదురుచూస్తున్నామంటూ సెల్స్‌ బరాబర్‌ మోగిపోతూనే ఉన్నాయ్‌. ఆ…. గైస్‌ అండ్‌ గాళ్స్‌, వెలకం ఫ్రం జోతిక్క, అండ్‌ షుణీళ్‌’ అలా సాగింది వాళ్లిద్దరి సంభాషణ. అది ఏ భాషో నాకు అర్ధం కాక మా పిల్లల్ని అడిగాను. మా అబ్బాయి, అమ్మాయి తెగ ఆశ్చర్యపోతూ, ‘అదేంటి తాతయ్యా, మీరు తెలుగు భాషకు వీరాభిమానులు, మీకే అర్ధం కాలేదా’ అంటూ ఎదురు ప్రశ్నంచారు. నాకు మతి పోయినంత పనియిందంటే నమ్మండి. కనీసం పదవీ విరమణ తర్వాతయినా తెలుగు భాషను బతికించటానికి ఏదో ఒకటి చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే భాషను ఖూనీచేసినవారిని ఖూనీ చేస్తే ఆశయం నెరవేరుతుందని ఒక న్యాయమూర్తిగానే కాదు, తెలుగువాడిగా, మాతృభాషాభిమానిగా కూడా నేను నమ్మను. ఒకవేళ సాధ్యమవుతుందనుకున్నా రాజ్యాంగం అంగీకరించదు. సమాజమూ ఒప్పుకోదు. అందువలన సమాజ హితం కోరి నేరం చేసినా, చట్టం ప్రకారం శరత్‌బాబును శిక్షించకుండా వదిలేయలేము. నిందితుడు శరత్‌బాబుకు ఈ న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తున్నది. ఒక తెలుగు భాషాభిమానిగా ఈ తీర్పును వెలువరించటం బాధగా ూంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చక తప్పదు. దీనికి సంబంధించి కర్మాగార విభాగాధిపతులు తదుపరి చర్యలు తీసుకోవాలని ఇందుమూలంగా వారిని ఆదేశిస్తున్నాను.” అంటూ న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పు ప్రసంగాన్ని ముగించారు. అప్పటిదాకా నవ్వులు చిందిస్తూ బోనులో నిలబడున్న శరత్‌బాబు” తెలుగు భాష …. జిందాబాద్‌, తెలుగును ఖూనీ చేసిన వారిని ఖూనీ చేయటమే నా మార్గం” అంటూ నినాదాలు చేయటం ప్రారంభించటంతో పోలీసులు అతని చుట్టుముట్టారు. లాఠీలు ఝళిపించారు.
పోలీసులతో పెనుగులాడుతూ దభీమని కిందపడ్డాడు శరత్‌బాబు.
శరత్‌బాబుకు మెలకువ వచ్చింది. మొదట తాను ఎక్కడుందీ అర్ధం కాలేదు. న్యాయస్థానంలో ఉండాల్సిన తాను ఇంట్లో ఎలా ఉన్నానా? అని అయోమయంలో పడ్డాడు. రెండు, మూడు నిమిషాల తర్వాతగానీ తాను ఇప్పటిదాకా కలగన్నానన్న విషయం అతనికి అర్ధం కాలేదు. తెలుగు కథ నూరేళ్ల వేడుకల కార్యక్రమానికి ఆ రోజు సాయంత్రం హాజరయిన వీర మాతృభాషాభిమాని శరత్‌బాబు, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన నుంచి తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను కొనుక్కొని తెచ్చుకున్నాడు. వస్తూనే మంచంపై వాలిపోయి వాటి పని పట్టటం ప్రారంభించాడు. మాట్లాడే భాషే రాత భాష కావాలని జీవితాంతం పోరాడిన గిడుగు జీవిత చరిత్ర పుస్తకం చదివేశాడు. ఆనాటి దినపత్రికలో కర్లపాలెం హనుమంతరావు రాసిన ‘తెలుగు తక్కువతనం’ వ్యాసం జిరాక్స్‌ ప్రతుల్ని ఎవరో భాషాభిమాని ఒకరు పంచగా దాన్నీ తెచ్చుకున్నాడు. దాన్ని చదువుతూనే నిద్రలోకి జారిపోయాడు. తెలుగు భాషను ఖూనీ చేస్తోన్న తెలుగు ఎఫ్‌ఎం రేడియో జాకీలపై ఎన్నాళ్లుగానో పెంచుకున్న కోపాన్ని తీర్చుకునేందుకు వారిలో ఒకరిని ఖూనీచేసినట్లు కలగంటూ కిందపడ్డాడు. ఆలోచనలు జిగిబిగితో ఆరోజిక నిద్రాదేవి అతనిని రుణించలేదు మళ్లీ. కలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఎప్పుడో వేకువ వేళ నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాడు. తూర్పుదిక్కున అరుణకిరణాలు పొడజూపిన వేళకల్లా లేచి బయటికొచ్చాడు. ూదయాగమన సుందర దృశ్యం అతని కళ్లబడింది.

(అయిపోయింది)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: