”వానా వానా వల్లప్ప, వానా తమ్ముడు సోమప్ప” వర్షంలో తడుస్తూ పాడుకునేవాళ్లం నా చిన్నప్పుడు. చేతులు చాపి గుండ్రంగా తిరుగేవాళ్లం మా పల్లెటూరు ఈదుమూడిలో. వర్షానికి అలుపొచ్చేదేమోగానీ, మాకు అలుపే వచ్చేది కాదు. అన్నట్లు మా పెద్దవాళ్లు కూడా ఇప్పటిలా జలుబు చేస్తుందనో, జ్వరం వస్తుందనో మమ్మల్ని భయపెట్టి లోపలికి లాక్కెళ్లేవాళ్లు కాదు. తీరికగా ఉంటే మమ్మల్ని చూస్తూ వాళ్లూ ఆనందపడేవాళ్లు. కాకపోతే చిన్నంగా తిరగండ్రా పడిపోతారనో, దూరదూరంగా తిరగండి ఒకరికొకరు తగిలి పడిపోతారనో జాగ్రత్తలు చెప్పేవాళ్లు. అలా ఎంతసేపు తడిచినా జ్వరం కాదుగదా, కనీసం చివ్వున చీదేవాళ్లం కాదు. హాచ్…హాచ్‌లూ విన్పించేవే కాదు. అదంతా ఆనాటి తిండి మహిమ అని నా నమ్మకం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, శనివారం మధ్యాహ్నం హైదరాబాదులో వాన కురుస్తుండగా స్కూలు బస్సు దిగి ఇంటికొస్తూ తడుస్తోన్న ఓ బుడుగునీ, వాడి చెల్లలు కాబోలు సీగాన పెసూనాంబనూ వాళ్ల మమ్ రాస్కెల్స్, ఫూల్స్ అంటూ ఇంగ్లీషులో నానా గడ్డీ పెడుతోంది. ”కోల్డ్ ఎటాక్ అయితే టుమారో స్కూలుకు డుమ్మకొట్టాలనే?. అంటూ గాబరాపడిపోతోంది. ఫ్యూవర్ వస్తే రాత్రింబవళ్లూ కాచుకూచోవటం కష్టమంటోంది. పైగా వాళ్ల డాడ్‌తో తిట్లు తినాల్సి వస్తుందని భయంభయంగా చెబుతోంది వాళ్లతో. అయితే బుడుగుకీ, పెసూనాంబకూ వాళ్ల మమ్ తిట్లమీ తలకెక్కలేదనిపించింది నాకు. చెరోపక్క గొడుగు కింద నడుస్తూనే చేతులు చాపి వాన ధారను ఒడిసిపట్టి ఆనందపడటం కన్పించింది. అప్పుడు గుర్తుకొచ్చింది నా చిన్ననాటి జీవనం. వర్షం పడుతుండగా, బడికి పోతూ వర్షంలో ఎన్నెన్ని తమాషాలు చేసేవాళ్లమో! అకస్మాత్తుగా ఎగిరి దూకి తోటివారిమీద బురుదనీళ్లు పడేలా చేసేవాళ్లం. కాగితాలతో చేసి ఆడే పడవలాట సరేసరి. పడవల కోసం నోట్‌పుస్తకంలో సగం మాయమయ్యేది. మామూలు పడవ, కత్తి పడవ అలా రెండు రకాలు చేసేవాళ్లం. కాగితాన్ని మడిచి పడవను చేయలేని వాళ్లు నాలాంటి చేతనయినవాళ్లకు రెండు కాగితాలు ఇస్తే వాటితో పడవలు చేసి చెరొకటి తీసుకుని ఆడుకునేవాళ్లం. పడవల్లో చిన్నచిన్న పువ్వుల్నీ, పుల్లల్నీ, బఠానీల్నీ పెట్టి మద్రాసుకు రవాణా చేస్తున్నామంటూ చెప్పుకుని తెగ సంబరపడిపోయేవాళ్లం. అలా అంతులేకుండా సాగిపోయేవి మా ఆటలు. అలా ఆటల్లో పడి ఓరోజు మధ్యాహ్నం బడికి వెళ్లాల్నిన సమయానికి ఇంటికి చేరకపోవటంతో కంగారు పడిన మా అమ్మ నన్ను వెదుక్కుంటూ వస్తుండగా నా స్నేహితుల్లో ఒకడు చూసి ”ఒరేయ్, మిమ్మరా” అంటూ కేకేశాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నా బట్టల్ని చూసుకుంటే భయమేసింది. నా తెల్ల చొక్కాకు అక్కడక్కడా బురద పులుముకుంది. వెంటనే చొక్కా విప్పి అమ్మ అక్కడికి వచ్చేలోగా తిరగేసి వేసుకుని ఎదురెళ్లాను. ” అబ్బాయ్, బడికి టైమవుతుంటే ఇంకా ఆడితే ఎట్లా?” అంటూ మొహం మీదున్న మట్టిని తుడిచింది అమ్మ. చొక్కొ తిరగేసి ఉండటాన్ని అప్పుడు చూసింది. నెమ్మదిగా గుండీలు విప్పి, ”అయ్యో బురదయ్యిందే” అంటూ నా చేతి రెక్క పట్టుకుని ఇంటికి తీసుకుపోయింది. గబగబా నీళ్లు పోసంది. ఉతికిన చొక్కా వేసింది. జేబులో కాసింత కారప్పూస పోసింది. తింటూ బడికెళ్లమని బయటదాకా సాగనంపింది. నిన్నటి తరం అమ్మ కదా మరి.
24 జూలై
Posted by jayadev on జూలై 24, 2010 at 3:37 సా.
super..dooper..post sir
Posted by malapkumar on జూలై 28, 2010 at 6:19 ఉద.
మరి జంట పడవలు చేసే వారు కాదా ?
ఎంతైనా నిన్నటి బాల్యం మధురమే .
Posted by Sarath 'Kaalam' on జూలై 31, 2010 at 2:15 ఉద.
నేను మాత్రం మా పిల్లలని నిన్నటి తరం వాళ్ళలాగే పెంచుతున్నానండీ. వర్షం వస్తే తడుస్తూ ఆడుకోండని ప్రోత్సహిస్తుంటాను. మీరన్నట్లే ఈ కాలం తల్లితండ్రులు పిల్లలని బహు సున్నితంగా పెంచుతున్నారు.