తెలివి తక్కువోళ్లు ఇంటిని నిర్మిస్తారు తెలివిగలోళ్లు అందులో నివశిస్తారు

తెలివి తక్కువోళ్లు ఇంటిని నిర్మిస్తే … తెలివిగలోళ్లు అందులో నివశిస్తారని తేల్చేశారు తెల్లోళ్లు.
”ఇల్లు కట్లిచూడు … పెళ్లి చేసి చూడు” అంటూ మనోళ్లు ఎప్పటి నుంచో బెదిరిస్తూనే ఉన్నారు.
తెల్లోళ్లు తేల్చేసిన సూత్రమూ, మనోళ్ల బెదిరింపూ రెండూ నిజ్జంగా నిజ్జమేనని ఇటీవలి నా అనుభవమూ పట్టిచూపింది.
అప్పుడెప్పుడో గత శతాబ్దం చివర నేను ఒంగోలులో ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న సమయమది. అప్పటి ఒంగోలు శాసనసభ్యుడు ఈదర హరిబాబు ఓపికచేసి విలేకరులకు తలా కాసింత ఇంటి స్థలాన్ని మంజూరు చేయించారు. కంచె ఏర్పాటుకంటూ విలేకరుల సంఘ నాయకులు మా నుంచి తలాకాస్త వసూలు చేశారు. దాన్ని కంచె ఏర్పాటుకు వినియోగించకుండా స్థలాల పంపిణీకి సహకరించారంటూ రెవెన్యూ సిబ్బంది కొందరికి బంగారపు ఉంగరాలను సమర్పించారు. ఎట్లయితేనేం నాలుగు సెంట్ల స్థలం నా చేతిలో పడింది. అన్నట్లు ఇక్కడొక సంఘటనను గుర్తుచేసుకోవాలి. ఈనాడు సిబ్బంది ప్రభుత్వ స్థలాల్ని తీసుకోకూడదంటూ యాజమాన్య ప్రతినిధులు కొందరు కుయ్యికుయ్యిమన్నారు. దీంతో నేను తొలుత స్పందిస్తూ, ”ప్రభుత్వ స్థలం తీసుకునేందుకు నేను అన్ని విధాలా అర్హుడినే. కాబట్టి స్థలం తీసుకుంటాను. అట్లా స్థలం తీసుకోవటం ఈనాడు విధానాలకు విరుద్ధమయితే నేను బయటకు వెళ్లేందుకు ఈ క్షణంలోనయినా సిద్ధమే.” అంటూ తేల్చి చెప్పాను. దీంతో ఏమనుకున్నారో ఏమో, ఆ ప్రతినిధులు మౌనం వహించారు. అయితే కుయ్యికుయ్యిమన్నవాళ్లుకూడా బినామీ పేరుతో స్థలాన్ని కొట్టేశారనుకోండి.
ఇక్కడ ఇంకొక తమాషా గుర్తుకొస్తోంది. స్థలం చేతబడకముందే ఓ విలేకరి దాన్ని రూ. 40 వేలకు గుండుగుత్తగా అమ్మేశాడు. ఇదెప్పడు తెలిసిందంటే…. స్థలాలను కొలవటం పూర్తిచేసి అందరమూ ఇళ్ల ముఖం పట్టాము. అప్పుడా విలేకరి తన జేబులో నుంచి మద్యం సీసా తీసి గటగటా తాగేశాడు. ఆ సీసాను తన స్థలంలోకి విసిరేస్తూ ” ఓ నా స్థలమా ఇదే చివరి చూపు” అని నాటకీయంగా పలకటంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అట్లా మొదలయిన అమ్మకాలు 60 మందిలో ఆరుగురు విలేకరులను మాత్రమే ఇప్పుడక్కడ మిగిల్చింది. ఎన్టీఆర్‌ జర్నలిస్టుల కాలనీలో స్ధలం మొదలు పూర్తయిన ఇంటిదాకా అమ్మకమయిపోయి ఇప్పుడు ఎవరెవరో అక్కడ కాపురాలు పెట్టేశారు. ఆనాడు రూ. 40 వేలకు అమ్ముడుపోయిన స్థలం ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత అక్షరాలా పాతిక లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ కాలనీలో స్థలం తీసుకున్న విలేకరులలో ఈ పదేళ్లలో కొందరు మరోసారి, మరి కొందరు రెండుసార్లు కూడా స్థలాల్ని ఉచితంగా పొందారు. నా మిత్రుడొకడు దాన్లో వచ్చిన స్థలాన్ని రూ. 3.70 లక్షలకు అమ్మి, దాంతో మళ్లీ మళ్లీ కొంటూ ఈరోజున ఓ అపార్టుమెంటులో మూడు పడక గదుల ఇంటితోపాటు కోటి రూపాయల్ని సొంతం చేసుకున్నాడు. స్థలాన్ని జాగ్రత్తగా చేతులు మారిస్తే లాభాల మూటలు దక్కించుకోవచ్చన్న దానికి ఈ సంఘటనే మంచి ఉదాహరణ.
నాకొచ్చిన స్థలంలో మా నాన్న పింఛను సొమ్ముతో అరకొరగా ఇంటిని నిర్మించిన నేను తెలివితక్కువవాడినో?
ఆ ఇంటికి ఇప్పుడు రూ. 3500 అద్దె వసూలు చేస్తో తెలివిగలవాడినో నేనయితే తేల్చలేను సుమా!
అయితే ఇతరుల కన్నా తొలినుంచీ వెయ్యి రూపాయల నుంచి రూ. 2000 దాకా తక్కువకే ఇంటిని అద్దెకు ఇచ్చిన నన్ను మాత్రం మా వాళ్లు ఒఠ్ఠి తెలివి తక్కువ దద్దమ్మగానే చూస్తారు. కొందరు గడుసులు నా ముఖానే అనేస్తారు కూడా నండోయ్‌! నన్ను ఐదేళ్ల పాటు మాటలతో బురిడీ కొట్టించి రూ. 1200 మాత్రమే అద్దె చెల్లించిన ఆయర్వేద వైద్యుడు  ఖాళీ చేయటంతో ఇంటికి ఇటీవల మరమ్మతులు చేయించే సందర్భంగా తెల్లోడి సూత్రం, మనోడి బెదిరింపూ నిజ్జంగా నిజమేనని తేలింది.
ఇరవై వేలతో పనులు పూర్తవుతాయని దిగితే రూ. 75 వేల దగ్గర తేలటం మొదటి తెలివితక్కువ.
వారం రోజులు సెలవు పెట్టి ఒంగోలు వెళ్లిన నేను మొదటి మూడు రోజులూ చిన్నపాటి పనిని కూడా చేయించలేకపోవటం రెండో తెలివితక్కువ.
ఐదు వేల రూపాయలతో సన్‌షేడ్‌ వేసిన గంటలోనే కురిసిన వర్షానికి అదంతా నా కళ్లముందే నేలకూలటం తెలివి తక్కువతనానికి మూడో నిదర్శనం.
రెండు వేల ఇటుక ఖరీదు రూ. 5700 మాత్రమే ఉండగా బంధువు నా దగ్గర రూ. 6200 వసూలు చేసినా కిమ్మనకుండా ఉండటం నాలుగో తెలివి తక్కువతనం.
కేవలం ఐదు గంటలపాటు ఇటుకలు, ఇసుక మోసే పనికి ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున చెల్లించటం ఐదో తెలివితక్కువతనం.
వీటన్నింటికీ మించి పక్కింటోడు బెత్తెడు స్థలం కూడా లేకుండానే కిటికీలు పెట్టినా మౌనంగా ఉన్నాను చూడండి తెలివితక్కువకు మహా నిదర్శనం. మంత్రిగారికి దగ్గరి బంధువని చెప్పుకునే ఇంకొకడు నా స్థలాన్ని జానెడు అక్రమించినా కనీసం అడగక పోవటం మహామహా తెలివితక్కువ తనానికి భలే ఉదాహరణ. వాడే మూర ఆక్రమించి నా స్థలంలో ఓ స్తంభాన్ని కట్టాడు. ఇదీ నా తెలివి తక్కువ తనమే. అంతేనా వాడు తన ఇంటిని కట్టుకుంటూ విసిరిన ఇటుకల దెబ్బకు నాలుగుసార్లు మా నీళ్ల గొట్టం పగిలిపోతే నా జేబునే ఖాళీ చేసుకుంది కాక నేను తెలివితక్కువవాడినని టముకు వేసుకుంటున్నాను చూడండి. దీనికి మించిన తెలివి తక్కువ తనం ఉండనే ఉండబోదని మా ఇంటి కొత్తగోడను గుద్ది మరీ ఒప్పుకోక తప్పదు.
ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం మరొక డజను తెలివితక్కువతనపు ఉదాహరణలను అవలీలగా రాయగలను. కానీ అలా రాసేస్తే నా బుర్రలో కనీసం మట్టయినా ఉందా? లేక ఇంతవరకూ ఎవ్వరూ వ్యాఖ్యానించని పదార్థమేదయినా ఉందా? అని అందరూ హాశ్చర్యపోయే ప్రమాదం ఉందని కొద్దిగా తెలివి ప్రదర్శించాను లెండి. అవునూ మనలో మన మాట ఎలా ఉంది నా తెలివి!

7 వ్యాఖ్యలు

  1. How are youeligible to take gov land?

    Just for being a journalist…? As politicians want good relations with Journalists and as they have poer …they throw all thses biscuits officially…with the expenses of people money……..
    You joined in a private job…and getting gov land what about other private job holders, labour…..

    You can have super logics to support your 25 lac free money…enjoy…….

    స్పందించండి

    • ఆ రోజు 2000 రూపాయల లోపు, ఈ రోజున 9000 రూపాయల ఆదాయం కలిగిన నేను ప్రభుత్యం నుంచి ఇంటి స్థలాన్ని పొందేందుకు అర్హుడిని కాదా? బిస్కెట్లు తినేవాడినే అయితే పదేళ్ల తర్వాత గోడలకు పూత పూయించాల్సి వచ్చేది కాదు. పునాదులతో ఏడాదిపాటు నిర్మాణం ఆగిపోయిననాడు తన మీద వార్తల దాడి ఆపితే 5 లక్షలతో ఇల్లు పూర్తి చేస్తానని ఓ నాయకుడు ప్రతిపాదించగా తిరస్కరించాను. దాని ధర ఆనాడు 40 వేలే.

      స్పందించండి

      • mee nijayiti gurinchi nenu prasininchaledu sir………

        Jouranalist ane kaaranamgaa bhoomini pondatam …avidam gaa pondataannni meeru samardinchukovatam gurinchi maatrame maatlaaduthunanau………………..white card holders ki illu ivvatam ,…lekapote diguva aadaayaala kiivvatam …ilaa edinaa praati padikana ichaaraa…….? just jouranalist ane kaaranam gaa illu ivvataanni meeru elaa samardinchukontunaaru………journalists andaroo pedavaallanaa mee vuddesam?……

  2. mana manchithaname manaku sreeramaraksha,chethagaanivaade manchithanamu ane musuguvesukuntaadu,konthamandi mahanubhavulu prajalakosam anni vadulukoni amarulainaaru.vaallanu aadarshangaa theesukuni vaallu 100% ayithe ,daaniki daggara daggaragaa cherukovadaaniki prayathninchadame prasthutha vyavasthalo manam cheyyalsina pani ,meeru vunna feildlo moneyni tiraskarinchadamu chaala goppa vishayam, maatalu evaraina ennaina chebutaau ,edaina chesi memu idi chesaamu prajalaku ani chebuthu ,vere vaallanu vimarshiste bhaguntundi.meeru maanavatvamunna,telivaina manchivaaru

    స్పందించండి

  3. Posted by శ్రీనివాసరావు on ఆగస్ట్ 26, 2010 at 4:49 సా.

    మన మంచిని మనం చెప్పుకుంటే ఈ ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఎవ్వరూ వుండరు. మనలో వున్న చెడు చెప్పుకుంటే మాత్రం నమ్మడమే కాదు ఇంకా యెంత వున్నదో అని అనుమానిస్తారు. ఇది లోక సహజం.

    స్పందించండి

  4. subbaraogaru anta mee house anubhavalanu itemga pettaru. chala bagundi. kani plan prakaram chesukunte house rents pine job cheyyakunda monthly house rents vasulu chesukuntu jeevinche maalantivallu kuda unnaru gurtupettukondi..

    స్పందించండి

వ్యాఖ్యానించండి