వామాడ్రోయ్‌! వామాడ్రు!!


వామాడ్రోయ్‌! వామాడ్రు!!
నెత్తిపై తట్ట. ఆ తట్టలో సీసాలు. ఆ సీసాలో ఏదో నీళ్ల మాదిరిగా కనిపిస్తోన్న ద్రవం. వామాడ్రోయ్‌, వామాడ్రు అంటూ ఆ బేరగాడు కేకలు. పాతిక ముప్పై ఏళ్ల క్రితం తరచూ
మా ఊళ్లో (ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, ఈదుమూడి) కన్పించిన దృశ్యం ఇది. విన్పించిన కేకలవి.
‘వాము వాటర్‌’కు నిరక్షరకుక్షుడి నోట పరిణామం చెందిన మాట ‘వామాడ్రు’. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నిరక్షరాస్యులూ, అక్షరాస్యులూ, ఉపాధ్యాయులు కూడా అలానే పలికేవారు.
వాము వాటర్‌ బేరగాడు మా గ్రామానికి చెంతనున్న దుద్దుకూరు నుంచి రోజూ ఈదుమూడి చేరుకుని సాయంత్రం వరకూ వాటిని అమ్ముకునేవాడు. లీటరు వాము వాటర్‌ సీసా ధర రెండు రూపాయలు ఉండేది. అదే వినియోగదారుడే సీసా ఇస్తే రూపాయికే వాము వాటర్‌ ఇచ్చేవాడు.
వాము వాటర్‌ తెల్లోళ్లదో, నల్లోళ్ల ఇంగ్లీషు లేబులో తెలియదు. బ్రిటీషు పాలనలో ఫిర్కా (తెల్లోళ్ల పన్నుల వసూలు కేంద్రం) కేంద్రంగా ఉన్న దుద్దుకూరులో అధికారులు నివశించేవాళ్లు. అందువలన ఇది వారి దగ్గర నుంచి మనవాడు లాగేసుకున్న ఉత్పత్తో, మన సంప్రదాయ ఆయుర్వేద ఔషధానికి ఏ తెల్లబాబన్నా ఇంగ్లీషు పేరు పెట్టాడో అనుభజ్ఞులు చెప్పాలి.
బేరగాడు దాదాపు ప్రతిరోజూ దుద్దుకూరు నుంచి ఈదుమూడి చేరుకుని తొలుత వాము వాటర్‌ను తయారు చేసుకునేవాడు. అదంతా ఆనాడు నేను చదివే ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే సాగుతుండేది. ఉపాధ్యాయుల పెంపకం కారణంగానేమో బడికి సమయానికంటే ముందే వెళ్లేవాడిని. ఇతర విద్యార్థులయినా, ఉపాధ్యాయులయినా నా తర్వాత ఏ అరగంటకో వచ్చేవాళ్లు. పారిశుధ్యకార్మికుడు – రాత్రి కాపలాదారు – అటెండరు రాఘవులు మాత్రం తరగతి గదుల తాళాలు తీస్తో, ఊడుస్తో అక్కడే ఉండేవాడు. ఉదయం 6.50కి ఒకటో బెల్లు  నేనే కొట్టేవాడిని. అలా ఐదు నిమిషాల వ్యవధితో మూడుసార్లు బెల్లు కొట్టాలి. ఏడు గంటలకు బడి ప్రారంభం కావాలి. సరే మళ్లీ వాము వాటర్‌ బేరగాడి గురించి మాట్లాడుకుందాం. (మీరు కాదన్నారా? దారి మళ్లించింది నేనే కదా?!) అతను కూడా ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఖాళీ సీసాల బుట్టతో మా బడి ఆవరణకు చేరేవాడు. అతను వాము వాటర్‌ తయారే చేసే పద్ధతిని రోజూ చూస్తుండేవాడిని. సమీపంలోని చెరువు నుంచి నీటిని తెచ్చుకునేవాడు. ఓ గిన్నెపైన తేరు కోసం గుడ్డను కప్పేవాడు. దానిపై వాము వేసి ఆ నీటిని ఆ గిన్నెలోకి వంపేవాడు. వామును చేతితో నలుపుతుండేవాడు. అలా వామును కలుపుకుని ఆ నీరు గిన్నెలోకి చేరేది. గిన్నె నిండగానే ఆ నీటిని సీసాల్లో నింపి తట్టలో సర్దుకునేవాడు. ఏదో ఉప్పు సంబంధిత పదార్ధాన్ని కూడా వాము వాటర్‌లో కలిపే వాడని లీలగా గుర్తు. సీసాలన్నీ నిండాక అమ్మకానికి ఊళ్లోకి బయలుదేరేవాడు.
”కడుపునొప్పికీ, అరగటానికీ వామాడ్రోయ్‌! వామాడ్రు.
ఆ రోజుల్లో కడుపు నొప్పి వచ్చినా, అరగక ఇబ్బందులు పడతున్నా, పొట్ట ఉబ్బరించినా, మందం చేసినా, పుల్లతేపులు వచ్చినా  వెంటనే ఇంట్లో సిద్ధంగా ఉండే వామువాటర్‌నే తాగించేవాళ్లు. మిగతావాటి సంగతేమోగానీ కడపునొప్పి మాత్రం కాసేపట్లో పారిపోయేది. ఒగరు, కారంకారంగా, కొంత ఉప్పగా ఉండే వామువాటర్‌ను ఇష్టంగా తాగేవాళ్లు అప్పట్లో. అవండీ అలనాటి వామాడ్రు విశేషాలు. ఇలాంటి అనుభవం ఉన్న మిత్రులు స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వామువాటర్‌కు సంబంధించి నిజానిజాలేమిటో ఆయుర్వేద వైద్యులు శాస్త్రీయంగా తెలపాలని కోరుతున్నాను.

13 వ్యాఖ్యలు

  1. బాగా గుర్తు చేసారు “వామాట్రు”(ఇలాగే అరిచేవాడూ మా ఊళ్ళో) ని. మేము నాగర్జున సాగర్ లో ఉన్నప్పుడు మా ఇంటి ముందు అమ్మకానికి వచ్చేవి ఇవి. సీస ధర 1-2 రూపాయలనుకుంటా.. ధర సరిగ్గా గుర్తు లేదు.మీరన్నట్లు నిజంగా కడూపునెప్పి అజీర్తి లాంటివి పారిపోయేవి ఇది తాగగానే. రుచి కూడా గమ్మత్తుగా ఉండేది. మీరు మంచి చిన్నప్పటి మెమరీ ని గుర్తు చేసారు.

    స్పందించండి

  2. మా ఊళ్లో వాంవర్కు అని అమ్మేవారులెండి 🙂
    ~సూర్యుడు

    స్పందించండి

  3. Avunandi mavullo denni VamuAraku ani Piliche varu , Konchem gadata ekkugane undi, maa amma baga koni maku pattichedi

    Rams-Krishna
    Amalapuram(Konasema)

    స్పందించండి

  4. వాము నాకు చాలా ఇష్టం. అందరు పంచదార వేకుకున్నట్లు అటొచ్చి-ఇటొచ్చి గుప్పెడు వాము నోట్లో వేసుకునేవాడిని. జీర్ణక్రియకి మంచిది. ఇంట్లో కారప్పూస (జంతికలు), చెక్కల్లో అమ్మ వాము కలుపుతుంది. ఇంకా మిర్చిబజ్జీల్లో కూడా వేస్తారు.

    స్పందించండి

  5. మీ “వామాడ్రు” టపా బాగుంది.

    ఇలాంటివి అమ్మేవాళ్లకి వాళ్ల స్టయిలే ట్రేడ్ మార్క్.

    మా వూళ్లో ఒకతను “కురసనారు, కురసనారూ” అని కిరొసిన్ ఆయిల్ అమ్ముకునేవాడు.

    ఇంకొకాయన “యేలుబల్ల, యేలుబల్లోయ్” అని నేరేడు పళ్లు అమ్ముకునేవాడు.

    ఇంకో తాత, “ఒక్కతాడొక్కతాడేయ్” అంటూ కొబ్బరి డొక్క తాడు అమ్ముకునేవాడు.

    ఇప్పటికీ, “గ్గో” అని వినిపిస్తే, ముగ్గు అనీ, “ప్పో” అని వినిపిస్తే, వుప్పు అనీ అర్థం!

    ఇక కడుపునొప్పి వస్తే, కొంచెం వామూ, నాలుగు వుప్పరాళ్ళూ అరచేతిలో వేసుకొని, బొటనవేలితో నలిపి, కాసేపు బుగ్గన పెట్టుకో అని ఇచ్చేవారు మా తాతగారు. అద్భుతమైన ఔషధం!
    ఇప్పటి ఆయుర్వేదులకి తెలుసో లేదో!

    అలాగే, భావన అల్లం అమ్ముతారు. భలే రుచిగా వుంటుంది. అదో ఔషధం.

    స్పందించండి

  6. మాకు చిన్నప్పుడు వామరుకు అని తెచ్చి పట్టేవారు. ఇది గ్రామీణ ప్రాంతంలోని woodwards Gripewater కు ప్రత్యామ్నాయం. అసలు దానికంటే ఇది బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరమున్న పిల్లలకు గోకర్ణంతో పడితే చాలు. పెద్ద వాళ్ళుకూడా తాగేవారు. అజీర్ణంకు బాగా పనిచేస్తుంది. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యం చేస్తారు. ఆయన కూడా ఇది తయారు చేసే వారు. మీ టపా చిన్ననాటి మా వామరుకు వాసనను గుర్తుచేసింది. ధన్యవాదాలు..

    స్పందించండి

  7. ఇతర వ్యాఖ్యల్లో వచ్చినట్టు దాన్ని “వాంవర్కు”; “వామార్కు”; “వామ్మర్కు” అంటూ వివిధ ప్రదేశాల్లో అమ్మేవారు. యెవరి ట్రేడ్ మార్క్ వారిది.

    నాక్కూడా భావనల్లం తయారీ గురించి తెలియదు–బహుశా అల్లాన్ని నిమ్మరసం లో, కొన్ని ఇతర ఔషధాలని కలిపి నానబెట్టి, తరవాత యెండబెడతారేమో!

    ఇది పైత్యానికి వ్యతిరేకం గా పని చేస్తుంది. వికారం, డోకులూ, పసరు పెరిగి పొద్దున్నే ఆకు పచ్చగా వాంతులవడం ఇలాంటివాటికి విరుగుడు.

    కొని తినాలేగానీ దాని రుచి వర్ణించలేం! వుత్తినే తిన్నా చాలా బాగుంటుంది.

    స్పందించండి

  8. ఎవరండీ వాము రుచిని అంతలా వర్ణిస్తోంది? గడ్డి కూడా వదిలేట్టులేరు.

    స్పందించండి

Leave a reply to తెలుగిల్లు స్పందనను రద్దుచేయి