తన సొంత జిల్లా చిత్తూరులోనే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి చుక్కెదురయింది. దీంతో ఆయన ‘ఏక్ నిరంజన్’ అన్న ఛలోక్తులు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తొలిసారిగా తన జిల్లాకు పోయిన సందర్భంగా ఆరింట నలుగురు శాసనసభ్యులు కనీసం ఆయనను పలకరించేందుకు రాలేదు. తొలిరోజు వచ్చిన మంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు శాసనసభ్యుడు సీకె బాబు రెండో రోజే కనబడకుండా పోయారు. చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెసులో రెండు ముఠాలున్నాయి. దీనికి తోడు ఇప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఠా కూడా తోడు కావడంతో ముచ్చటగా మూడయ్యాయి. దీంతో కాంగ్రెసుపార్టీ ద్వితీయశ్రేణి నేతల్లో గందరగోళం నెలకొంది. సొంత జిల్లాలోనే ఈ విధంగా ఉంటే మిగిలిన జిల్లాల్లో నల్లారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఉంటుందా? ఊడిపోతుందా? అన్న చర్చ మొదలయింది.
చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడుగురు కాంగ్రెసు శాసనసభ్యులున్నారు. ఇందులో ముఖ్యమంత్రిని మినహాయిస్తే మంత్రి గల్లా అరుణకుమారితో పాటు ఐదుగురు శాసనసభ్యులున్నారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మడి కుతూహలమ్మ, రవి, షాజాహాన్ ముఖ్యమంత్రికి ముఖం చూపలేదు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాశమయింది. తొలిరోజు మంత్రి గల్లా అరుణకుమారి, చిత్తూరు ఎంఎల్‌ఏ సికె బాబు మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు. రెండో రోజు పర్యటన ఆద్యంతం వాళ్లు కూడా కనిపించలేదు.
ముచ్చటగా మూడు ముఠాలు
చిత్తూరు జిల్లా కాంగ్రెసు పార్టీ నేతల్లో తొలినుంచీ ఐక్యత లేదనేది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఇక్కడ ముఠాలు కొనసాగాయి. కాకపోతే ఆయన మరణం తర్వాత ఈ ముఠాలు బహిరంగంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడున్న రెండు శిబిరాలకు తోడు ఇప్పుడు కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి ముఠా తోడయింది.
పెద్దిరెడ్డితో చిరకాలవైరం
తాజా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ, కిరణ్‌కుమార్‌రెడ్డికి మధ్య 30 సంవత్సరాలుగా రాజకీయ శతృత్వం ఉంది. ఏ దశలోనూ ఈ రెండు ముఠాల నడుమ సంబంధాలు లేవు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన మంత్రి వర్గంలో పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డిపై ప్రత్యక్షపోరు కొనసాగిస్తానని తెగేసి చెప్పారు. అంతేగాకుండా వచ్చే సంవత్సరం మార్చి లోపల ప్రభుత్వం కుప్ప కూలటం ఖాయమని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు నియోజక వర్గాల్లో ఈయనకు బలమైన అనుచరగణం ఉంది.
సిఎంపై ముగ్గురు ఎంఎల్‌ఏల రుసరుస
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గుమ్మడి కుతూహలమ్మ, రవి, షాజాహాన్ గుర్రుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో తనకు కాంగ్రెసు అభ్యర్థిత్వం దక్కనీయకుండా కిరణ్‌కుమార్‌రెడ్డే ప్రయత్నించారని కుతూహలమ్మ విమర్శించారు. ఆమె సోనియాగాంధీ ద్వారా అభ్యర్థిత్వం దక్కుంచుకుని జిడినెల్లూరులో గెలుపు సాధించారు. పైగా జిల్లాలో సీనియర్నయినా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది. బహిరంగంగానే ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తుతోంది. పూతలపట్టు, మదనపల్లి శాసనసభ్యులు రవి, షాజాహాన్ కూడా ముఖ్యమంత్రిపై రుసరుసలాడుతున్నారు. తనతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో వేరొకరిని ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారని షాజాహాన్ అసంతృప్తిగా ఉన్నారు.
అరుణపై సిఎం అసంతృప్తి
పర్యటనలో కనీసం తొలిరోజు కూడా జనం లేకపోవడంతోపాటు జగన్మోహనరెడ్డి ముఠా, తెలుగుదేశం నాయకులు తన వాహనానికి అడ్డుతగలడం, తిరుమలలో భక్తుల నుంచి నిరసనలు రావడం తదితర సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి లోనయారని చెబుతున్నారు. దీంతో పోలీసు అధికారులతోపాటు, మంత్రి గల్లా అరుణకుమారిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే మంత్రి గల్లా రెండోరోజు ముఖ్యమంత్రి సొంత గ్రామ పర్యటనలోనే కనిపించలేదు.
26 డిసెం