హరి అక్కడ, ఇక్కడ, ఎక్కడ చూసినా ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పేమాటలో యదార్థం మాటేమోగానీ, శ్రీకాళహస్తీశ్వరాలయంలో అవినీతి లేని అడుగే కానరాదు. తామరపూలు, టెంకాయలు, నెయ్యి దీపాల కొనుగోళ్లలోనూ కోట్లాది రూపాయలు కైంకర్యం అవుతోంది. ఈ వస్తువులను కూడా సర్పదోష నివారణ పూజల్లో వినియోగిస్తారు. నాగపడగలతో పాటు తామరపూలు, నెయ్యిదీపాలు, కొబ్బరికాయలను రెండేసి చొప్పున దోషనివారణ పూజలో ఉపయోగిస్తారు.
తామరపూలతో ఏడాదికి రూ. 59 కోట్ల పరిమళం
రోజుకు 2,500 పూజలకు మొత్తం ఐదువేల తామరపూలు అవసరం. పూలను అమ్ముకున్నందుకుగాను గుత్తేదారు పి రమేష్, ఆలయానికి నెలకు రూ.11 లక్షలు చెల్లించాలి. జత తామర పూలను 20 రూపాయల చొప్పున మాత్రమే అమ్మాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అయితే దానికి భిన్నంగా రూ. 60 నుంచి రూ. 80 రూపాయల దాకా సాధారణంగా వసూలు చేస్తున్నారు. దీని ప్రకారం సాధారణంగా వ్యాపారం జరిగిందనుకున్నా నెలకు రూ. 60 లక్షల చొప్పున ఏడాదికి రూ. 7.20 కోట్ల రాబడి తామరపూల వ్యాపారం ద్వారా సమకూరుతోంది. గుత్తేదారు ఆలయానికి చెల్లించాల్సిన రూ. 1.32 కోట్లు పోను రూ. 58.80 కోట్లు ఏడాదికి మిగులుతోంది. అదే భక్తుల రద్దీ పెరిగితే తామరపూల ధర నూర్రూపాయలకు పైమాటే. ఈ గుత్తేదారుకు దక్కిన టెండరు ప్రకారం 2010 ఏప్రిల్ ఒకటో తేదీతో మొదలయి 2013 మార్చి 31 వరకూ ఆలయంలో తామరపూలు, టెంకాయలు తదితర సామగ్రిని అమ్ముకోవచ్చు. అయితే నెలనెలా కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకుంటున్న గుత్తేదారు ఇప్పటికే దేవస్థానానికి 88.34 లక్షల రూపాయిలు బకాయి పడ్డాడు. వాస్తవానికి నిర్ధేశిత ధరలకు మించి విక్రయించటంతోపాటు, బకాయి పడిన నేరానికి ఈ గుత్తేదారు టెండరును రద్దు చేయాలి. అయితే గుత్తేదారు లాభాల మూటలో ఉన్నతాధికారులకూ వాటాలు పడుతున్నందున చట్టం ఇక్కడ చట్టుబండలవుతోంది.
ఆదాయం రూ. 14 కోట్లు … బకాయి రూ. 14 లక్షలు
నెయ్యి దీపాల వ్యవహారంలోనూ ఇదే తంతు నడుస్తోంది. జత నెయ్యి దీపాలకు రూ. 20 ధర నిర్ణయించగా, గుత్తేదారు రెట్టింపు వసూలు చేస్తున్నాడు. నెయ్యి దీపాల ద్వారా రోజుకు లక్ష రూపాయల చొప్పున నెలకు రూ. 30 లక్షల రాబడి వస్తోంది. వీటిని అమ్ముకున్నందుకుగాను ఆలయానికి రూ. 1.08 లక్షలు చెల్లించాలి. అంటే నెలకు రూ. 29 లక్షలు ఆదాయం గుత్తేదారు రమేష్ పరమవుతోంది. 2007 నుంచి ఈ కాంట్రాక్టును నిర్వహిస్తున్న గుత్తేదారుకు ఇప్పటి వరకూ 13.92 కోట్లు ఆదాయం రాగ ఆలయానికి చెల్లించాల్సిన దానిలో 14 లక్షల రూపాయలు బకాయి పడ్డాడు.
టెంకాయల్లో అంతా అవినీతే
రోజుకు ఐదువేల టెంకాయలు అవసరం. టెంకాయలను పాత, కొత్త అని రెండు రకాలుగా విభజించారు. పాతరకం కాయ చుట్టు కొలత 28 సెంటీమీటర్లు ూండాలి. కొత్త టెంకాయ 30 సెంటీమీటర్లు ఉండాలి. అయితే గుత్తేదారు ఈ ప్రమాణాలకు పాతరేసేశాడు. 22-25 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న టెంకాయలనే సరఫరా చేస్తున్నాడు. ఒక టెంకాయ రూ. 6.60 విక్రయించాలని ఆలయ యాజమాన్యం నిర్ధేశించింది. అయితే మిగతావాటి మాదిరిగానే అధిక ధరల్ని వసూలు చేయటం రివాజయింది. ఒక్కొక్క కాయకు రూ. 10 నుంచి రూ. 12 దాకా ఇక్కడ వసూలు చేస్తున్నారు. అంటే రెట్టింపు లాభాలు దండుకుంటున్నారు. నెలకు రూ. 18 లక్షలు దండుకునే గుత్తేదారుకు ఆలయానికి చెల్లించాల్సింది చెల్లించినా నెలకు రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి 1.80 కోట్లకు పైనే మిగులుతుంది. ఇదంతా బయటకు కనిపించే అవినీతి. దీనికితోడు అర్చకులకూ, గుత్తేదారుకూ మధ్య జరిగే లోపాయికారి ఒప్పందం ప్రకారం టెంకాయలను పగలగొట్టకుండానే తట్టలోకి విసురుతారు. అలా పగలని కాయలను అర్చకులు తిరిగి గుత్తేదారుకు అమ్ముకుంటారు. భక్తులు ఎవరయినా తమ ప్రసాదం ఇవ్వాలని కోరితే, శని దోషం ఇక్కడితోనే పోవాలి, ఇంటికి తీసుకెళ్లకూడదు’ అంటూ అర్చకులు భక్తుల నోరు మూస్తారు. టెంకాయల టెండరుదారు 2008లో నెలకు 2.35 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఆనాటి గుత్తేదారు కాసరం బాలాజీ మాజీ శాసనసభ్యుడికి అనుచరుడు కావడంతో తాను చెల్లించాల్సిన సొమ్మును శాశ్వత బకాయిల జాబితాలో పెట్టేశాడు. ఆయన రూ. 25.50 లక్షల సొమ్మును ఆలయానికి ఎగవేశాడు.
27 జన
Posted by వెన్నెల రాజ్యం on జనవరి 27, 2011 at 8:17 సా.
సార్ మీరు పొరబడుతున్నారు. అక్కడ అవినీతి అన్ని కళ్లకూ తెలిసే జరుగుతుంది. అయితే అందరూ కళ్లు మూసుకుంటారంతే.
Posted by కృష్ణశ్రీ on జనవరి 30, 2011 at 5:40 సా.
యే దేవాలయ చరిత్ర చూసినా, యేమున్నది గర్వకారణం? వాటి చరిత్ర సమస్థం, భక్త పీడన పరాయణత్వం! (కొంతమందికి బొజ్జనింపుడు పరాయణత్వం కూడా!)