అవును. నిజ్జంగా నిజం. నేను అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్నాను. ఈ పురస్కారాన్ని సభ జరిపి ప్రదానం చేయలేదు. నాకు తెలియకుండానే నాకు ప్రదానం చేసేశారు. శాలువాలు కప్పరు. మంగళవాయిద్యాలు అంటూ ప్రతేకంగా ఉండవు. మనసున మల్లెలు మాలలూగుతాయి. ఆనందం అంబరమంటుతుంది. సాధారణంగా ఇచ్చే జ్ఞాపిక అంటూ ప్రత్యేకంగా ఉండదు. అయినా జీవితాంతం వెన్నంటి ఉండే మృధుమధురమైన జ్ఞాపకాన్ని మాత్రం ఈ పురస్కారం నాకు అందించింది.
అదేనండి. ప్రముఖ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు తన ‘నా లోకం’ బ్లాగులో నా బొమ్మేసి మరీ నన్ను పరిచయం చేశారు. దాని కిందే గత నెలలో ప్రజాశక్తి స్నేహలో ప్రచురితమయిన నా కథ ‘ఖూని’ని కూడా టపా పెట్టారు.
శుక్రవారం (29. 10.10) ఉదయం అలాఅలా తెలుగు బ్లాగ్లోకాన్ని వీక్షించుకుంటూ నడుస్తుండగా, నడుస్తుండగా…ఓ చోట … నా లోకం. దానిలోకి జొరబడకుండా పోనెప్పుడూ. ఈ రోజూ అలానే జొరబడి చూద్దునుకదా. ఒక్కసారిగా దిమ్మతిరిగిందనుకోండి. అక్కడ నా బొమ్మ పెట్టుంది. ఇదేందిరా అనుకునేంతలోనే దాని కింద ‘పేరు వెంకటసుబ్బారావు కావూరి’ అంటూ శీర్షిక. ఆ కింద నా గురించి నా వరకూ లక్షలు, కోట్లు విలువచేసే నా పరిచయం. పైగా నన్ను గురించి, నా నిజాయితీ గురించి వకాల్తా. నా బ్లాగును వీక్షిస్తే కచ్చితంగా సంతృప్తి కలుగుతుందని యోగ్యతా పత్రం. ఆమ్మో ఇంకేం కావాలి రాతగాడిగా నాకు. ఇంకా కిందకొస్తే ఖూనీ కథ. అదండీ సంగతి. నాకొచ్చింది ఈనాడు ఎడిట్‌పేజీ రచయిత కర్లపాలెం హనుమంతరావుగారు మెచ్చి ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం. గతంలో బలిపీఠం కథకు ప్రముఖ రచయిత కాలువ మల్లయ్యగారి చేతులమీదుగా జాతీయ స్ధాయి పురస్కారాన్ని అందుకున్నాను. బీసీ నారాయణరావు ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని ఈనాడు జర్నలిజం పాఠశాల ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావుగారి చేతులు మీదుగా, నాకు ఇష్టమయిన వ్యక్తిత్వ స్వరూపులు, పూర్వ జర్నలిస్టు వీ. శ్రీనివాసరావుగారి సమక్షంలో అందుకున్నాను. ఆ రెండింటి మాదిరే కర్లపాలెం హనుమంతరావుగారి తన నా లోకం బ్లాగ్లోకం ద్వారా అందజేసిన యోగ్యతాపత్రాన్ని గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. కృతజ్ఞతలు.
29 అక్టో
Posted by వీకెండ్ పొలిటీషియన్ on అక్టోబర్ 29, 2010 at 7:21 ఉద.
మీకు నా అభినందనలు సార్ 🙂
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 29, 2010 at 7:24 ఉద.
ధన్యోస్మి
Posted by జ్యోతి on అక్టోబర్ 29, 2010 at 8:39 ఉద.
అభినందనలు.. మంచిపనికి విజయము, గుర్తింపు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి.
Posted by కొత్తపాళీ on అక్టోబర్ 29, 2010 at 12:04 సా.
చాలా సంతోషం. మన తోటివారు, మనం గౌరవించేవారు అయిన వ్యక్తులనుండి దొరికే ప్రశంస ఇచ్చే తృప్తిని గొప్ప గొప్ప ఎవార్డులు కూడా ఇవ్వలేవు. నిజం. అభినందనలు.
Posted by చిలమకూరు విజయమోహన్ on అక్టోబర్ 29, 2010 at 12:21 సా.
చాలా సంతోషంగా ఉంది.అభినందనలు.
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 29, 2010 at 1:54 సా.
చిలమకూరు విజయ మోహన్ గారు,
జ్యొతి గారు,
కొత్త పాళీ గారు
ఇలా పెద్దలు, అనుభవగ్నులు, మంచి మనసున్న మిత్రులు స్పందించినందుకు నెనరులు,
వీక్షించినవారందరికీ ధన్యవాదాలు
Posted by వేణూశ్రీకాంత్ on అక్టోబర్ 29, 2010 at 8:24 సా.
అభినందనలు, ఆ టపా లంకె కూడా ఇస్తే బాగుండేదండి.